Share News

TTD Reforms: భక్తులకి అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు

ABN , Publish Date - Nov 05 , 2025 | 07:34 PM

తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రతిష్ట పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు వ్యాఖ్యానించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం గతం కంటే చాలా బావుందని భక్తులు చెబుతున్నారని పేర్కొన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.

TTD Reforms: భక్తులకి అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు
TTD Reforms

హైదరాబాద్, నవంబరు5 (ఆంధ్రజ్యోతి): తిరుమల వేంకటేశ్వరస్వామి (Venkateswara Swamy) ప్రతిష్ట పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) వ్యాఖ్యానించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం గతం కంటే చాలా బావుందని భక్తులు చెబుతున్నారని పేర్కొన్నారు. తిరుపతి (Tirupati)లో ఉండే స్థానికులకు నెలకు ఒకసారి మొదటి మంగళవారం మూడు వేల మందికి దర్శనం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. టూరిజం ప్యాకేజీలు రద్దు చేసి ఆ టికెట్‌లను సామాన్య భక్తులకు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇవాళ(బుధవారం) హైదరాబాద్ వేదికగా మీడియాతో మాట్లాడారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.


శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 10 లక్షల మంది..

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు భద్రత, పారా మెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేయనున్నామని చెప్పుకొచ్చారు. టికెట్ జారీలో సైబర్ నేరాలకు పాల్పడిన వారిని తొలగించి... సైబర్ సెక్యురిటీ ల్యాబ్‌ని ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. అన్నమయ్య జన్మించిన తాళ్లపాకను అభివృద్ధి చేయాలని నిర్ణయించామని తెలిపారు. తిరుమల, ఒంటిమిట్టలో ఔషధ, పవిత్ర వనాల ఏర్పాటు చేయనున్నామని వివరించారు. టీటీడీ కొనుగోళ్ల విభాగంలో జరిగిన అవకతవకలపై ఏసీబీ విచారణకు ఆదేశించామని స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.


కాటేజీలకు దేవుడి పేర్లు

తిరుమలలో కాటేజీలకు సొంత పేర్లు తీసేసి దేవుడి పేర్లు పెట్టామని ఉద్ఘాటించారు. టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా తాను బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తి అయిందని పేర్కొన్నారు. ఏడాదిలో ఎన్నో కార్యక్రమాలు అమలు చేశామని ఉద్ఘాటించారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏర్పాటు చేసిన మొదటి టీటీడీ బోర్డు సమావేశంలోనే అన్యమతస్థులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.


అన్యమతస్థులను తొలగించాం..

చర్యల్లో భాగంగా కొంతమంది అన్యమతస్థులను తొలగించామని గుర్తుచేశారు. ఏఐ సాంకేతికత సహాయంతో 2 గంటల్లోనే భక్తులకు దర్శనం ఏర్పాటు చేయాలి అనుకున్నామని చెప్పుకొచ్చారు. కానీ ఒక వర్గం ఏఐపై వ్యతిరేకత వ్యక్తం చేసిందని తెలిపారు. అనంతవరంలోని వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కొండపై పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. రూ. 25 కోట్లతో కాణిపాకం ఆలయం వద్ద నూతన భవనాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. తలకొనలో రూ. 19 కోట్లతో ఆలయం అభివృద్ధి చేయనున్నామని పేర్కొన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.


తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడితే చర్యలు..

నూతన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆధ్వర్యంలో మళ్ళీ ఏఐ ప్రాజెక్టుని పట్టాలెక్కిస్తున్నామని వివరించారు. తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడితే చర్యలు తీసుకోవాలని తీర్మానించామని పేర్కొన్నారు. తిరుమలపై అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.నాణ్యమైన పదార్థాలను మాత్రమే కొని తిరుమల కొండపై అన్న ప్రసాదాలు చేయిస్తున్నామని వెల్లడించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.


సిమ్స్ ఆస్పత్రిని మెరుగుపరిచాం..

‘సిమ్స్ ఆస్పత్రిని మెరుగుపరిచాము. సిమ్స్ ఆస్పత్రిలో మెడికల్ మాఫీయా నడుస్తుంది. సిమ్స్ ఆస్పత్రే మెడికల్ షాప్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. శ్రీనివాస సేతు అనే పేరు బదులుగా తిరుపతి ఫ్లైఓవర్‌కి గరుడ వారధి అని పేరు పెట్టాము. కొండని అనుకున్న స్థలంలో ముంతాజ్ హోటల్‌కి గత జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ముంతాజ్ హోటల్ అక్కడి నుంచి తీసేయించి వేరే చోటికి మార్చాం. తిరుమలలో షాపులను క్రమబద్ధీకరిస్తున్నాం. స్వామి వారి బ్రేక్ దర్శనాలు మొన్నటి దాకా 10:30కి ఉండేవని.. ఇప్పుడు వాటిని తిరిగి తెల్లవారుజాముకి మార్చాం. అలిపిరి టోల్‌గేట్ దగ్గర కొత్త సాంకేతికతో ఏర్పాటు చేశాం. శ్రీవాణి ట్రస్ట్ కింద 5వేల ఆలయాలు నిర్మించాలని తీర్మానించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఆలయాలు, భజన మందిరాలు ఏర్పాటు చేయాలని తీర్మానించాం. టీటీడీకి 100 ఎలక్ట్రిక్ బస్సులు ఇస్తామని కేంద్రమంత్రి కుమారస్వామి హామీ ఇచ్చారు. వాటిని తిరుపతి, తిరుమల మధ్య నడపాలి అనుకుంటున్నాం’ అని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.


రాష్ట్ర రాజధానుల్లో వేంకటేశ్వర స్వామి ఆలయం..

‘టీటీడీ పరిధిలో ఉండే ఆలయాల్లో నిత్యాన్నదానం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. భారతదేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానుల్లో వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల రాజధానిలో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఆమోదం తెలిపాం. ఒంటిమిట్టలో 100 గదుల వసతి గృహం నిర్మాణం చేయలని నిర్ణయం తీసుకున్నాం. వేంకటేశ్వర గోశాల నిర్వహణ మెరుగుపరచడంపై నిఫుణుల కమిటీ వేశాం. ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత కార్యాచరణ ఉంటుంది. తిరుపతి ఎయిర్ పోర్టుకి వేంకటేశ్వర ఎయిర్‌పోర్టు అని నామకరణం చేశాం. ఈ అంశంపై ఏపీ కేబినెట్‌లో చర్చించనున్నారు. వేంకటేశ్వర పేరుతో పాటు ఎయిర్ పోర్టుని ఆలయం సెట్‌లాగా ఏర్పాటు చేస్తున్నాం. తిరుపతి ఎయిర్ పోర్టు అంటే వేంకటేశ్వర స్వామి ఆలయం గుర్తుకు వచ్చేలా తీర్చిదిద్దుతాం’ అని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్

భారీ పెట్టబడులు, ఒప్పందాలకు విశాఖ వేదిక.. మంత్రి డీబీవీ స్వామి కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 05 , 2025 | 08:11 PM