AP Schools Closed in Cyclone: మొంథా తుపాను నేపథ్యంలో స్కూల్స్ బంద్
ABN , Publish Date - Oct 26 , 2025 | 06:24 PM
మొంథా తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పాఠశాలలనూ మూసివేయాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమగోదావరి, అక్టోబరు26(ఆంధ్రజ్యోతి): మొంథా తుపాను (Cyclone Montha) నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh Govt) అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పాఠశాలల (Schools)నూ మూసివేయాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఆయా జిల్లాల కలెక్టర్లు అలర్ట్ అయ్యారు.
వెంటనే విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పాఠశాలలను మూసివేయనున్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలో ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలకు, అంగన్‌వాడీలకు ఈ నెల 27, 28 తేదీల్లో సెలవులు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ MN హరేందిర ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
అనకాపల్లి జిల్లాలో స్కూల్స్ బంద్...
మొంథా తుపాను ప్రభావం దృష్ట్యా అనకాపల్లి జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలకు అక్టోబరు 27, 28, 29 మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఓ ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా విద్యా సంస్థలను తెరిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ హెచ్చరించారు.
తూర్పుగోదావరి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు..
తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈనెల 27, 28వ తేదీల్లో తూర్పుగోదావరి జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. కలెక్టరేట్, రెవెన్యూశాఖ కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే, విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మరో పది రోజుల్లో వరిపంట చేతికి వచ్చే సమయంలో తుపాను హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఈదురుగాలులకు వరిపంట నేలకొరుగుతోందని అన్నదాతలు వాపోతున్నారు. వరి దుబ్బులు నీటమునగటంతో పంట నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ప్రయాణాలు చేయొద్దు: కలెక్టర్ చదలవాడ నాగరాణి
మరోవైపు.. పశ్చిమగోదావరి జిల్లాలోని తీరప్రాంతాల్లో మొంథా తుపాను ప్రభావం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పలు సూచనలు చేశారు. ఈ మేరకు కలెక్టర్ చదలవాడ నాగరాణి ఓ ప్రకటన విడుదల చేశారు. తుపాను పరిస్థితుల దృష్ట్యా ఈనెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అత్యవసరమైతే తప్పా ప్రయాణాలు చేయొద్దని సూచించారు. ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాల్లో ప్రజలు తిరగవద్దని దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే బీచ్‌లు, పర్యాటక రీక్రియేషన్ సంబంధిత కార్యకలాపాలను నిలిపివేసినట్లు గుర్తుచేశారు. విద్యుత్ ఉద్యోగులు అంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి మార్గనిర్దేశం చేశారు.
విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్ సమస్యలు తలెత్తితే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆజ్ఞాపించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులంతా అందుబాటులో ఉండాలని సూచించారు. కిందపడిన కరెంట్ వైర్లు, స్తంభాలతో ప్రజలు జాగ్రత్త వహించాలని దిశానిర్దేశం చేశారు. రేపు(సోమవారం) నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ని రద్దు చేస్తున్నట్లు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్
పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టం.. భానుప్రకాష్ వార్నింగ్
Read Latest AP News And Telugu News