Share News

CM Chandrababu: జీరో గంజా కల్టివేషన్ లక్ష్యంగా అధికారులు పని చేయాలి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 09 , 2025 | 02:25 PM

ఏజెన్సీ ప్రాంతం అంటే దేవుడు సృష్టించిన అద్భుతమని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామని... చెప్పినట్లే సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.

CM Chandrababu: జీరో గంజా కల్టివేషన్ లక్ష్యంగా అధికారులు పని చేయాలి: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

అల్లూరిజిల్లా, ఆగస్టు9 (ఆంధ్రజ్యోతి): గిరిజనులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఉద్ఘాటించారు. ఏజెన్సీ ప్రాంతం అంటే దేవుడు సృష్టించిన అద్భుతమని అభివర్ణించారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామని... చెప్పినట్లే సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామని వ్యాఖ్యానించారు. సంపద సృష్టించి పేదలకు పంచాలనేదే తన లక్ష్యమని ఉద్ఘాటించారు. ఆర్థికంగా అభివృద్ధి చెందినవారు సమాజానికి తిరిగి ఇవ్వాలని సూచించారు. స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు ఇచ్చేలా ఎన్టీఆర్ జీవో తెచ్చారని చెప్పుకొచ్చారు. ఈ జీవోను ఒకసారి వైసీపీ, మరోసారి కాంగ్రెస్ పార్టీలు నిలిపివేశాయని గుర్తుచేశారు. ఏపీలో ఐదేళ్లు జగన్ హయాంలో విధ్వంసం జరిగిందని మండిపడ్డారు. పేదలను సర్వనాశనం చేయడానికే వైసీపీ పుట్టిందని ఆక్షేపించారు. తాను చెప్పినట్లే పెన్షన్లు పెంచి ఇచ్చానని, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నామని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.


గంజాయి సాగు నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అధికారులను సీఎం చంద్రబాబు అడిగారు. డ్రోన్ల వినియోగం ద్వారా గంజాయి సాగును నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. గంజాయి సాగు వినియోగాన్ని నివారించేలా చర్యలు తీసుకుంటే.. టూరిజం కూడా అభివృద్ధి చెందుతోందని స్పష్టం చేశారు. జీరో గంజా కల్టివేషన్, జీరో క్రైమ్ దిశగా పోలీసులు ప్రణాళికాబద్దంగా పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. ఏజెన్సీ ప్రాంతంలో సెరీకల్చర్ సాగును 10 వేల ఎకరాల్లో చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. సెరీకల్చర్ ద్వారా వచ్చిన పట్టుదారాలతో నేసిన వస్త్రాలను సీఎం పరిశీలించారు. నిఫ్ట్ వంటి సంస్థలతో కలిసి పని చేయడం ద్వారా ఏజెన్సీలో నేసిన వస్త్రాలకు మంచి డిమాండ్ వచ్చేలా చేయొచ్చని సూచించారు. ఏజెన్సీలో నేసిన వస్త్రాల మార్కెటింగ్ కోసం మంచి భాగస్వాములను అన్వేషించాలని ఆదేశించారు. డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టాల్‌ని సందర్శించి కాఫీ తాగారు. కూకీస్, మిల్లెట్ బిస్కట్లు, స్థానికంగా లభించే ముడిసరుకులనే ఉపయోగించి చాక్లెట్ల తయారీ మీద దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.


ఇవాళ(శనివారం) అల్లూరి జిల్లాలోని లగిశపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. లగిశపల్లిలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్ద గిరిజన ప్రాంతంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రజా వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. గిరిజన ప్రాంతాల్లో హోం స్టే ప్రాజెక్టులు ఎలా ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. జీసీసీ నూతన ఉత్పత్తులు పరిశీలించి వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఏజెన్సీలో డ్రగ్స్, గంజాయి నివారణ చర్యలపై ఆరా తీశారు. ఈగల్ బృందం పనితీరును సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు.


అనంతరం కాఫీ ప్లాంటేషన్ పెంపకందారులతో సీఎం మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ తోటల పెంపకంలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అంటూ చంద్రబాబు ఆరా తీశారు. ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులకు మరింత ప్రొత్సహాం ఇవ్వాలని సూచించారు. ఈ-కామర్స్ వేదికల మీద ఆర్గానిక్ ఉత్పత్తులు, గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేలా చూడాలని సీఎం ఆదేశించారు. అలాగే వంజంగిలోని వనదేవత మోదకొండమ్మను దర్శించుకున్నారు. వంజంగి సమీపంలోని కాఫీ ప్లాంటేషన్‌లోని తోటలను సీఎం పరిశీలించారు. ఏజెన్సీలో నేసిన ఓ చీరను సీఎం చంద్రబాబు కొనుగోలు చేశారు. ప్రకృతిని ఎంజాయ్ చేసేలా ఆరోగ్యకరమైన వాతావరణంలో హోం స్టే ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. గిరిజన ఉత్పత్తులకు సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. ఉత్పత్తుల విక్రయాలు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ కలిగేలా చూడాలని సూచించారు. గిరిజన ఉత్పత్తులకు సంబంధించి మరింత మార్కెటింగ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. ఇందుకోసం ప్రముఖ కంపెనీల భాగస్వామ్యం కల్పించేలా ఆలోచన చేయాలని సీఎం చంద్రబాబు. దిశానిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళల రక్షణ మా బాధ్యత.. సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డి రాఖీ శుభాకాంక్షలు

పులివెందుల ఎన్నికలో వైసీపీ నేతలు అవకతవకలకు పాల్పడుతున్నారు: బీటెక్ రవి

For More AP News and Telugu News

Updated Date - Aug 09 , 2025 | 02:58 PM