Nuzvid Division: ముక్కలైన డివిజన్.. ఒక్కటి కానుందా?
ABN , Publish Date - Aug 09 , 2025 | 01:27 PM
వైసీపీ ప్రభుత్వం చేసిన జిల్లాల మార్పులు, చేర్పులతో రాష్ట్రంలో అనేక జిల్లాల వాసులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనాలోచిత చర్యల వల్ల సుదీర్ఘకాలం నుంచి ఉన్న డివిజన్లు సైతం కుంచించుకుపోవడం, కొన్ని నియోజకవర్గాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు తరలివెళ్లిపోయి డివిజన్, నియోజకవర్గాల ప్రాధాన్యం తగ్గిపోయింది. అలా ప్రాధాన్యత కోల్పోయిన డివిజన్ నియోజకవర్గాల్లో నూజివీడు ఒకటి.
నూజివీడు, ఆగస్టు 09: ఉమ్మడి కృష్ణా జిల్లాలో నూజివీడు ఉన్నప్పుడు కృష్ణా జిల్లాలోని 14 మండలాలతో అతిపెద్ద డివిజన్‌గా నూజివీడు ఉండేది. మరోవైపు ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు మధ్యస్తంగా ఉండడంతో డివిజనకు అత్యధిక ప్రాధాన్యం లభించేది.
మూడు ముక్కలైన నూజివీడు డివిజన్..
జిల్లాల విభజనతో 14 మండలాలతో ఉన్న నూజివీడు డివిజన్ దాదాపు మూడుముక్కలు అయింది. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో పూర్వపు నూజివీడు డివిజన్‌లోని మండలాలు కలిశాయి. పూర్వపు డివిజన్‌లో నూజివీడు నియోజకవర్గంలో గల నాలుగు మండలాలు ఏలూరు జిల్లా కేంద్రంగా ఉన్న నూజివీడు డివిజన్‌లో ఉండగా, మిగిలిన పది మండలాల్లోని కొన్నింటిని ఎన్టీఆర్ జిల్లా పరిధిలో తిరువూరు డివిజన్‌ను ఏర్పాటు చేయగా, మరికొన్నింటిని గుడివాడ డివిజన్‌లో విలీనం చేశారు.
నాలుగు మండలాలతో కుదేలు..
గత ప్రభుత్వం నిర్ణయం వల్ల 14 మండలాల నూజివీడు డివిజన్ నాలుగు మండలాలకు కుదించబడింది. దీంతో సేల్స్ ట్యాక్స్ కార్యాలయం, ఉద్యానవన పంటలకు కేంద్రంగా ఉన్న నూజివీడు నుంచి ఉద్యానవన సహాయ సంచాలకుల కార్యాలయం, పౌర సంబంధాల శాఖ కార్యాలయాలు ఏలూరుకు తరలాయి. ఈ పరిస్థితుల్లో నూజివీడు డీఎస్పీ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయాలు సైతం నిబంధనల ప్రకారం తరలిపోయే ప్రమాదం పొంచి ఉండడంతో నాటి ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అప్పటి సీఎం జగన్‌ను కలిసి విన్నవించడంతో నాడు పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి, లింగపాలెం మండలాలను నూజివీడు డివిజన్‌కు కలపడంతో పాటు పెదపాడు, పెదవేగి మండలాలను నూజివీడు పోలీస్ డివిజన్‌లో కలిపారు. ఆయా మండల వాసులకు నూజివీడులో కలవడం ఇబ్బందికరంగా మారింది. నూజివీడు రెవెన్యూ డివిజన్ 6 మండలాలైంది. నూజివీడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నప్పుడు డివిజన్ మెట్ట ప్రాంతం కావడంతో జిల్లాలో ప్రాధాన్యం ఉండేది. నూజివీడు ఏలూరు జిల్లాలో కలపడం వల్ల ఆ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంగా ఉండడం, అప్పటికే ఆ జిల్లాలో మెట్ట ప్రాంతంగా ఉన్న జంగారెడ్డిగూడెంకు ఉన్న ప్రాధాన్యం నూజివీడుకు లేదనే చెప్పాలి.
సీఆర్డీఏపై కక్షతోనే..
జగన్ ప్రభుత్వం సీఆర్డీఏ పరిధిలో చుట్టూ ఉన్న డివిజన్లను, జిల్లాలు మార్చి సీఆర్డీఏని దెబ్బతీసే భాగంలోనే నూజివీడును ఏలూరు జిల్లాలో కలిపారనేది నగ్నసత్యం. ఇప్పుడు నూజివీడు నియోజకవర్గం సీఆర్డీఏలో ఉంది. అవుటర్ రింగ్ రోడ్డు నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లి మండలం నుంచి వెళుతోంది. అవుటర్ రింగ్ రోడ్డు పూర్తయితే నియోజకవర్గం అభివృద్ధికి బాటలు పడినట్లే.
రెండు సార్లు బాబు హామీ..
చంద్రబాబు ప్రతిపక్షనేతగా నూజివీడు రెండుసార్లు వచ్చారు. వచ్చిన ప్రతిసారి నియోజకవర్గ ప్రజలు తమ నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల హామీగా ఆయన ఎన్నికల ప్రచార సభకు వచ్చినప్పుడు చంద్రబాబు సభాముఖంగా విజయవాడ జిల్లా కేంద్రంగా ఉన్న జిల్లాలో నూజివీడును చేర్చుతానని హామీ ఇచ్చారు. సీఎం అయిన తర్వాత ఆగిరిపల్లి పీ-4 కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన దృష్టికి ప్రజలు ఈ విషయాన్ని మరోసారి తీసుకురాగా తనకు గుర్తు ఉందంటూ ఆయన పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు, డివిజన్ కేంద్రాలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని వేయడం, ఎంతవరకు వచ్చిందని బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అడగడం, నెల రోజులలో దీనిపై నివేదిక ఇవ్వాలని డిసెంబరు నాటికి సమస్యకు పరిష్కారమయ్యేలా చర్యలు ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేయడంతో నూజివీడు నియోజకవర్గంలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Also Read:
ఏపీవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు: పీవీఎన్ మాధవ్
ఇకపై మినిమం అకౌంట్ బ్యాలెన్స్ రూ.50 వేలు..
For More Andhra Pradesh News and Telugu News..