Rakhi Festival Wishes: మహిళల రక్షణ మా బాధ్యత.. సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డి రాఖీ శుభాకాంక్షలు
ABN , Publish Date - Aug 09 , 2025 | 09:22 AM
రాఖీ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహిళల రక్షణ కోసం కృషి చేస్తున్నామని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలిపారు.
అమరావతి, ఆగస్టు9 (ఆంధ్రజ్యోతి): రాఖీ పండుగ (Raksha Bandhan) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్(X) వేదికగా ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. ‘నా తెలుగింటి ఆడపడుచులకు, నా ప్రియమైన అక్కాచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. అన్నా చెల్లెళ్ల అనుబంధం వ్యక్తం చేస్తూ ‘నీ కోసం నేనున్నాను’ అనే భరోసా కల్పించే శుభ సందర్భమే రాఖీ పర్వదినం. అందుకే రాఖీ పౌర్ణమి మనందరికీ ప్రత్యేకం. మీ అందరికీ ఒక అన్నగా మీకు రక్షణ కల్పించే, మీ జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత నాది అని రాఖీ పండుగ సందర్భంగా మరోసారి ప్రకటిస్తున్నాను. ఆడబిడ్డల రక్షణ కోసం అహర్నిశలూ పని చేస్తానని హామీ ఇస్తూ అందరికీ మరొక్కమారు రాఖీ పండుగ శుభాకాంక్షలు’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
రాష్ట్రాభివృద్ధిలో మహిళలందరూ భాగస్వాములు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారతతో సహా కోటీశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో మహిళలందరూ భాగస్వాములయ్యే వరకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. మహిళల రక్షణ, భద్రత, అభివృద్ధి, సంక్షేమంలో రాజీలేదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
దేవుడిచ్చిన తోబుట్టువులు మీరు: మంత్రి నారా లోకేష్

రాఖీ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) శుభాకాంక్షలు తెలిపారు. ‘తోడబుట్టిన అక్కాచెల్లెళ్లు లేని నాకు.. దేవుడిచ్చిన కోట్లాది మంది తోబుట్టువులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. తల్లికి వందనం చేసి, స్త్రీ శక్తిని మహాశక్తిగా మార్చే మా సంకల్పానికి ఆడపడుచుల అనురాగ బంధమే బలం. రక్షాబంధన్ పండుగ సందర్భంగా మీరు కడుతున్న రాఖీ సాక్షిగా ఇదే నా హామీ.. అన్నగా, తమ్ముడిగా మీ రక్షణ మా బాధ్యత’ అని మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అనుబంధాలకు గుర్తుగా రక్షాబంధన్ వేడుకలు
ఏపీలో ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త పరీక్ష విధానం
For More AP News and Telugu News