Raksha Bandhan 2025: అనుబంధాలకు గుర్తుగా రక్షాబంధన్ వేడుకలు
ABN , Publish Date - Aug 09 , 2025 | 06:49 AM
అనురాగం, అనుబంధం, ఆత్మవిశ్వాసం.. అన్నీ సమపాళ్లలో కలిసిన బంధమే రక్తసంబంధం, ఎల్లలు లేని ప్రేమకు, వెలకట్టలేని విలువలకు ఇది ఓ చిహ్నం. కలిసిమెలిసి పెరిగినా.. అల్లరి చేస్తూ గడిపినా.. కష్టాల్లో తోడుగా నిలిచినా సోదర సోదరీమణుల ప్రేమ ఎప్పుడూ త్యాగాన్నే కోరుకుంటుంది.
నేడు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక కథనం
అనురాగం, అనుబంధం, ఆత్మవిశ్వాసం.. అన్నీ సమపాళ్లలో కలిసిన బంధమే రక్తసంబంధం, ఎల్లలు లేని ప్రేమకు, వెలకట్టలేని విలువలకు ఇది ఓ చిహ్నం. కలిసిమెలిసి పెరిగినా.. అల్లరి చేస్తూ గడిపినా.. కష్టాల్లో తోడుగా నిలిచినా సోదర సోదరీమణుల ప్రేమ ఎప్పుడూ త్యాగాన్నే కోరుకుంటుంది. నేడు (శనివారం) రాఖీ పౌర్ణమిని (Raksha Bandhan) పురస్కరించుకుని కష్ట సుఖాల్లో కంటికిరెప్పలా కలిసిమెలిసి ఉంటున్న తోబుట్టువులందరికీ శుభాకాంక్షలు...
(విజయవాడ-ఆంధ్రజ్యోతి): 'రక్షా బంధన్' తోబుట్టువులకు పవిత్రమైన పండుగ. ప్రతి కష్టంలో సోదరులు తోడుంటారనే విశ్వాసానికి గుర్తు. 'రాఖీ' పండుగ శ్రావణ మాసంలో జరుపుకుంటారు. సోదర, సోదరీమణుల మధ్య అనుబంధాన్ని ఈ పండుగ గుర్తు చేస్తుంది. రాఖీ అంటే రక్షణ అని అర్థం. సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఎల్లవేళలా అండగా, రక్షణగా ఉండాలని ఆకాంక్షిస్తారు. రాఖీ పండుగను కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి జరుపుకుంటారు. రాఖీ పౌర్ణమిని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తారు.
రక్షా బంధన్ వేడుక తరతరాలుగా వస్తోంది. ఈ పండుగకు సంబంధించి కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వ్యాస భగవా నుడి విష్ణు పురాణంలో రాఖీ పౌర్ణమిని 'బలేవా' అని పిలిచేవారు. బలి చక్రవర్తి మహా విష్ణువు భక్తుడు. ఆయన తన అపారమైన భక్తితో విష్ణువుని తనవద్దే ఉంచుకుంటాడు. విష్ణువు లేని వైకుంఠం వెలవెలబోతుండటంతో శ్రీ మహాలక్ష్మి 'పౌర్ణమి' నాడు బలి చక్రవర్తికి రాఖీ కట్టింది. లక్ష్మీదేవిని ఏం కావాలో కోరుకోమని బలి చక్రవర్తి అడగ్గా.. లక్ష్మీదేవి మహావిష్ణువును తనతో పంపాలని కోరడంతో వెంటనే అంగీకరిస్తాడు.
మహాభారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడిని సంహరించే సమయంలో అతడీ వేలికి గాయమవుతుంది. అ సమయంలో ద్రౌపది తన చీర కొంగును చించి కృష్ణుడి వేలికి కట్టగా.. దానికి ప్రతిఫలంగా కృష్ణుడు ఎప్పటికీ నీకు రక్షణగా ఉంటానని ఆమెకు మాట ఇస్తాడు. తదనంతరం దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాపహరణానికి ప్రయత్నించినప్పుడు కృష్ణుడు ఆమెను ఆదుకుంటాడు.
మార్కెట్లో రాఖీల సందడి
రాఖీ పండుగ నేపథ్యంలో నగరంలోని రక్షణ బంధం దుకాణాలు రకర కాల రాఖీల విక్రయాలతో జోరందుకున్నాయి. గత మూడు రోజులుగా స్టాల్స్ పెట్టి రాఖీలు విక్రమిస్తున్నారు. మార్కెట్లో రాఖీలు రూ.10 నుంచి రూ.3 వేలుపైనే ధరల్లో అందుబాటులో ఉన్నాయి. స్వీట్స్, డ్రై ఫ్రూట్స్ విక్రయాలు పెరిగాయి. శ్రావణ శుక్రవారం, రెండో శనివారం కలిసిరావడం. స్కూళ్లు, కళాశాలలు సెలవు కావడంతో నగరంలో మార్కెట్ కూడళ్లు కిక్కిరిసి పోయాయి.
రక్షా బంధం మాటల్లో చెప్పలేనిది... - శంకర్, గుణదల
ఆర్మీలో క్లర్క్‌గా పనిచేస్తున్నా.. ప్రతి నాలుగేళ్లకోసారి ఉద్యోగరీత్యా ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయి. ఎక్కడున్నా రాఖీ పండుగ నాడు అక్క వద్దకు తప్పకుండా వస్తాను. నాకు రాఖీ కట్టిన క్షణం ఆమె కళ్లలో కళ్లలో ఆనందం చెప్పలేనిది. ఆమెకు ఏ కష్టం రాకుండా చూసుకుంటా.
నేనున్నాననే భరోసా ఇవ్వాలి - చిరంజీవి, మాచవరం
ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తున్నా, ఉద్యోగ రీత్యా ఎప్పుడు ఎక్కడ ఉంటానో తెలీదు. కానీ, రాఖీ పండుగకు మాత్రం కుటుంబానికి అందుబాటులో ఉంటా. చెల్లి ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్లి తప్పనిసరిగా రాఖీ కట్టించుకుంటా. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మిస్ కాలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీశైలంలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం
For More AP News and Telugu News