Guntur District: మంత్రి లోకేశ్ చొరవతో స్వదేశానికి
ABN , Publish Date - Aug 09 , 2025 | 06:00 AM
విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ యువకుడు, మంత్రి లోకేశ్ చొరవతో స్వగ్రామానికి చేరాడు.గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం...
కాంబోడియా నుంచి క్షేమంగా ఇంటికి చేరిన యువకుడు
తాడేపల్లి (పెనుమాక),ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ యువకుడు, మంత్రి లోకేశ్ చొరవతో స్వగ్రామానికి చేరాడు.గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన వేమవరపు చందు ఇంటర్ వరకు చదివి కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో విజయవాడలో క్యాటరింగ్ నిర్వహిస్తూ,కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవాడు.కొన్ని నెలల క్రితం తన సోదరి వివాహ కార్యక్రమంలో పర్చూరుకు చెందిన మోజెస్ అనే వ్యక్తి అతనికి పరిచయమయ్యాడు.అతని మాటలు నమ్మి చందు ఈ ఏడాది జూన్ 24న ఉద్యోగం కోసం కాంబోడియా వెళ్లాడు.అక్కడకు వెళ్లిన తర్వాత సైబర్ నేరాలు చేయాలంటూ మోజెస్ అతని కుటుంబసభ్యులు వేధించడం ప్రారంభించారు.చందు అంగీకరించకపోవడంతో చీకటి గదిలో బంధించి తిండి సరిగ్గా పెట్టకుండా చిత్రహింసలకు గురిచేశారు. దీనికి తోడు అక్కడి వాతావరణ పరిస్థితులకు అతని గొంతు నుంచి గుండె వరకు ఇన్‌ఫెక్షన్ సోకింది.చందు..హలో.నారాలోకేశ్‌కు ఈ మెయిల్ ద్వారా సమాచారం అందించాడు.స్పందించిన మంత్రి అతన్ని క్షేమంగా స్వస్థలానికి చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లోకేశ్ ఆదేశాలతో కాంబోడియా ఎంబసీ అధికారులతో మాట్లాడిన రాష్ట్ర అధికారులు..చందును ఈ నెల 1న క్షేమంగా స్వస్థలానికి చేరేలా చర్యలు తీసుకున్నారు. మంత్రి లోకేశ్‌కు చందు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.