Share News

Police Investigation:పేలుడుకు కారణం రక్షణ శాఖ వస్తువు

ABN , Publish Date - Aug 09 , 2025 | 05:44 AM

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ సమీపాన బుక్కా వారి వీధిలో గురువారం సాయంత్రం భారీ పేలుడుకు కారణం గ్యాస్‌ సిలెండర్‌ కాదని, రక్షణ శాఖకు చెందిన వస్తువు అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

Police Investigation:పేలుడుకు కారణం రక్షణ శాఖ వస్తువు

  • పోలీసులకు లభించిన ఆధారాలు

విశాఖపట్నం, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ సమీపాన బుక్కా వారి వీధిలో గురువారం సాయంత్రం భారీ పేలుడుకు కారణం గ్యాస్‌ సిలెండర్‌ కాదని, రక్షణ శాఖకు చెందిన వస్తువు అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి పోలీసులు ఆ ప్రాంతంలోకి ఎవరూ రాకుండా, సాక్ష్యాలు ధ్వంసం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. శుక్రవారం ఉదయం ఫోరెన్సిక్‌ నిపుణులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి ఆధారాలు సేకరించారు. ఈ సందర్భంగా వారి దృష్టికి పలు అంశాలు వచ్చాయి. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు రక్షణ శాఖకు చెందిన ఓ బరువైన ఇనుప వస్తువు లభించగా, దానిని వారు బుక్కా వీధిలో ప్రమాదం జరిగిన వెల్డింగ్‌ షాపు పక్కనున్న తుక్కు వ్యాపారికి విక్రయించారు. ఇలాంటి వస్తువులను ముక్కలుగా కట్‌ చేసి అమ్మేస్తుంటారు. అందులో భాగంగా దానిని కట్‌ చేసి ఇవ్వాలని తుక్కు వ్యాపారి పక్కనున్న వెల్డింగ్‌ షాపులో ఇవ్వగా దానిని కట్‌ చేస్తున్నప్పుడు భారీ పేలుడు సంభవించిందని తేలింది. దీనికి గ్యాస్‌ సిలిండర్లకు సంబంధం లేదని పోలీసులు భావిస్తున్నారు. కట్‌ చేసిన వస్తువు శకలాలను కూడా పోలీసులు సేకరించారు. వాటిపై రక్షణ శాఖకు చెందిన గుర్తులు ఉన్నట్టు తెలిసింది. దర్యాప్తు చేస్తున్నామని, పరీక్షల అనంతరం పేలుడుకు కారణం ఏమిటనేది తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.


మెడికవర్‌కు ఒకరు తరలింపు

భారీ పేలుడు ఘటనలో ముగ్గురు మరణించగా మరో ముగ్గురిని తీవ్ర గాయాలతో కేజీహెచ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెడికవర్‌ ఆస్పత్రికి గురువారం రాత్రే తరలించారు. మరో ఇద్దరిని ప్లాస్టిక్‌ సర్జరీ వార్డులో ఉంచి చికిత్స చేస్తున్నారు.

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా

పేలుడు కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మృతుల కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్టు వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందుతోందని, వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని మంత్రి తెలిపారు.

Updated Date - Aug 09 , 2025 | 05:44 AM