AP Sanitation Tenders: పాత కంపెనీలకే పట్టం
ABN , Publish Date - Aug 09 , 2025 | 05:57 AM
శానిటేషన్ టెండర్లలో ఏపీఎంఎస్ ఐడీసీ అధికారులు మరోసారి పాత కంపెనీలకేపట్టం కట్టారు.టెక్నికల్ బిడ్ తర్వాత డిస్‌క్వాలిఫై చేసిన కంపెనీల నుంచి....
చివరి దశకు చేరుకున్న శానిటేషన్ టెండర్లు
డీఎంఈకి 5, డీఎస్‌హెచ్‌కు 7 కంపెనీల అర్హత
ప్రమాణాలకు అనుగుణంగా పనులు జరగట్లేదు
గతంలో డీఎంఈ, డీఎస్‌హెచ్ కమిషనర్ నివేదిక
ప్రస్తుతం మళ్లీ అర్హత సాధించిన అవే కంపెనీలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
శానిటేషన్ టెండర్లలో ఏపీఎంఎస్ ఐడీసీ అధికారులు మరోసారి పాత కంపెనీలకేపట్టం కట్టారు.టెక్నికల్ బిడ్ తర్వాత డిస్‌క్వాలిఫై చేసిన కంపెనీల నుంచి అభ్యంతరాల స్వీకరణకు 24 గంటలే గడువు ఇచ్చి ఆ ప్రక్రియను తూతూమంత్రంగా కానిచ్చేశారు.జాతీయ స్థాయిలో గుర్తింపు, రూ.కోట్లలో టర్నోవర్, అర్హత కలిగిన కంపెనీలను పరిగణలోకి తీసుకోలేదు.టెండర్ నిబంధనలు మార్చేసి,కొన్ని కంపెనీలను ఉద్దేశపూర్వకంగా డిస్‌క్వాలిఫై చేశాన్న విమర్శలొచ్చినా పట్టించుకోలేదు. చివరకు తాము అనుకున్న కంపెనీలనే ఎంపిక చేశారు.డీఎంఈ ఆస్పత్రులకు ఐదు, డీఎస్‌హెచ్ (డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్)కు ఏడు చొప్పున అర్హత సాధించిన కంపెనీలకు సంబంధించిన ఫైనాన్షియల్ బిడ్‌లను గత మంగళవారం ఆఘమేఘాల మీద తెరిచారు.అందులో 2మినహా మిగిలిన కంపెనీలు ఏపీఎంఎస్ఐడీసీ నిర్దేశించిన 3.85శాతానికే పరిమితమయ్యాయి. సోమవారం బిడ్ ఫైనలైజ్ కమిటీ (బీఎఫ్‌సీ) సమావేశం ఏర్పాటు చేసి కంపెనీలకు టెండర్లు ఖరారు చేయాలని భావిస్తున్నారు.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో శానిటేషన్ పనులు నిర్వహిస్తున్న కంపెనీలే కొత్త టెండర్లలో అర్హత సాధించాయి.టెండర్ నిబంధనల ప్రకారం కాకుండా సిబ్బందిని తగ్గించి గుంటూరు,ప్రకాశం,నెల్లూరు జీజీహెచ్‌ల సూపరింటెండెంట్లతో గతంలో ఎంవోయూ కుదుర్చుకున్న కంపెనీ మరోసారి ఎంపికైంది. గతంలో శానిటేషన్ సిబ్బంది నియామకంలో అక్రమాలకు పాల్పడిన మరో కంపెనీ కూడా అర్హత సాధించింది.ఆయా కంపెనీలపై పలు ఆరోపణలున్నా వాటిని పరిగణలోకి తీసుకోలేమని ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసీ) ఎండీ వీరపాండియన్ ఇప్పటికే స్పష్టం చేశారు.
కమిషనర్ నివేదిక బుట్టదాఖలు
ప్రస్తుతం రాయలసీమలో శానిటేషన్ పనులు నిర్వహిస్తున్న కంపెనీ తీరు సరిగ్గా లేదని, సిబ్బంది ధర్నాలు చేస్తున్నారని మూడు జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి లేఖలు రాశారు.సదరు కంపెనీ వర్కర్లకు జీతాలు సమయానికి ఇవ్వడం లేదని,ఆస్పత్రుల్లో పారిశుధ్యం శుభ్రంగా ఉండటం లేదని, టెండర్ నిబంధనలు పాటించట్లేదని ఆరోపించారు. అదేవిధంగా శానిటేషన్, సెక్యూరిటీ పనులు చేస్తున్న కంపెనీల పనితీరు సక్రమంగా లేదంటూ డీఎంఈ,డీఎస్‌హెచ్ కమిషనర్ సైతం ప్రభుత్వానికి గతంలోనే లేఖ రాశారు. ఇకపై పిలిచే టెండర్లలో టర్నోవర్ ఎక్కువగా ఉన్న, మంచి కంపెనీలకు శానిటేషన్,సెక్యూరిటీ బాధ్యతలు అప్పగించాలని ఆ లేఖలో సూచించారు.శానిటేషన్ టెండర్లు పిలిచే ముందు సీఎం చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేశారు.అయితే ఈ సూచనలను అధికారులు బుట్టదాఖలు చేశారు. మరోవైపు టెండర్ నిబంధనల ప్రకారం అన్ని అర్హతలున్నా డిస్‌క్వాలిఫై చేశారని ఆరోపిస్తూ నాలుగు కంపెనీలు సోమవారం కోర్టును ఆశ్రయించడానికి సిద్ధమయ్యాయి. ఏపీఎంఎస్ ఐడీసీ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇస్తే మొత్తం టెండర్ ప్రక్రియకు బ్రేక్ పడే అవకాశం ఉంది.
అంతా నిబంధనల ప్రకారమే..:స్పెషల్ సీఎస్
శానిటేషన్ టెండర్ల ప్రక్రియ మొత్తం నిబంధనల ప్రకారమే చేపట్టామని ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎం.టి.కృష్ణబాబు తెలిపారు.కంపెనీల ఎంపికను పారదర్శకంగా చేస్తున్నామని చెప్పారు.టెండర్ డాక్యుమెంట్ సిద్ధం చేసినప్పుడే క్షుణ్నంగా అధ్యయనం చేశామని,మెటీరియల్ కాస్ట్, సర్వీస్ చార్జీలను విభజన చేశామని వివరించారు.అంతా పకడ్బందీగా చేస్తున్నామని,కంపెనీ యాజమాన్యాల విషయంలో జోక్యం చేసుకోలేమని పేర్కొన్నారు.టర్నోవర్ ఎక్కువగా ఉన్నా కంపెనీలను ఎంపిక చేయాలని సీఎం చెప్పారని,ఆ ప్రకారమే టెండర్ ప్రక్రియ చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు.