AB Venkateswara Rao: తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంది: ఏబీ వెంకటేశ్వరరావు
ABN , Publish Date - Oct 26 , 2025 | 07:40 PM
తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రయత్నిస్తుందని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సర్కార్ తీసుకువచ్చిన జీవో-32పై ఏపీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు.
కడప, అక్టోబరు26(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) అక్రమ ప్రాజెక్టుల (Illegal Projects) నిర్మాణానికి ప్రయత్నిస్తుందని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సర్కార్ తీసుకువచ్చిన జీవో-32పై ఏపీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆల్మట్టి డ్యాం ఎత్తుతో కృష్ణానది జలాల్లో 130 టీఎంసీలని ఏపీ నష్టపోతుందని వాపోయారు. నదీజలాల ట్రిబ్యునల్ చట్టానికి విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందని.. అయినా ఏపీ ప్రభుత్వం ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్లడం లేదని నిలదీశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంతో రాయలసీమ ఎక్కువగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఏబీ వెంకటేశ్వరరావు.
రాయలసీమకు నీటి వనరులు తక్కువ..
రాయలసీమకు గ్రావిటీతో నీళ్లు వచ్చే ప్రాజెక్టులు ఉన్నాయని వివరించారు. ఇవాళ(ఆదివారం) కడపలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. భౌగోళిక పరిస్థితుల కారణంగా రాయలసీమకు నీటి వనరులు తక్కువ అని చెప్పుకొచ్చారు. రాయలసీమ సముద్ర మట్టానికి ఎత్తులో ఉండటంతో వర్షాలు తక్కువగా పడతాయని వివరించారు. కొన్ని పంటలకు అనువైన ప్రాంతమని..రాయలసీమకు దీర్ఘకాలికంగా నీటి సమస్యను పరిష్కరించేందుకు ఎవరో ఒకరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు ఏబీ వెంకటేశ్వరరావు.
పార్టీలు రైతుల బాగోగుల కోసం కృషి చేయాలి..
పార్టీలు ఓట్ల కోసం కాదని.. రైతుల బాగోగుల కోసం కృషి చేయాలని కోరారు. ప్రభుత్వాలు దయాదాక్షిణ్యాలతో కాదని.. బాధ్యతతో మెలగాలని సూచించారు. 35 ఏళ్ల క్రితం ట్రైనీ ఐపీఎస్‌గా తాను కడపలో పని చేశానని గుర్తుచేశారు.. నాటికి, నేటికి వ్యవసాయంలో పెద్దగా మార్పు లేదని చెప్పుకొచ్చారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగితే మంచి పంటలు పండించే అవకాశం ఉందని ఉద్ఘాటించారు. రాయలసీమ కోసం శివరామకృష్ణ మంచి ప్రాజెక్టులు డిజైన్ చేశారని ప్రశంసించారు. గాలేరు - నగరి ప్రాజెక్టు రాయలసీమ రూపురేఖలు మార్చే ప్రాజెక్టు అని నొక్కిచెప్పారు. 2004లో రాయలసీమకు జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టుల నిర్మాణంలో కదలిక తెచ్చారని గుర్తుచేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటిని వదిలేశాయని ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
బనకచర్ల ప్రాజెక్టుతో నష్టపోతాం: ఏబీ వెంకటేశ్వరరావు
‘బనకచర్ల, పోలవరం ప్రాజెక్టులని మనకు గుదిబండలా అంటగడుతున్నారు. బనకచర్ల ప్రాజెక్టుతో నష్టపోతామని తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని.. అసలు బనకచర్లతో తెలంగాణ కంటే ఏపీకే ఎక్కువ నష్టం. కడప జిల్లా ప్రాజెక్టుల్లో నీరు ఉన్నా పంట కాల్వలు లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు.
గాలేరు - నగరి ప్రాజెక్టుకు ఫారెస్ట్ అనుమతులతో ఆలస్యం అంటూ సాకులు చెబుతున్నారు. ఫారెస్ట్ అనుమతుల కోసం రూ.25 కోట్లు ఖర్చు చేయలేకపోతున్నారు. రాయలసీమలో ప్రాజెక్టుల కోసం ఎవరూ పోరాటం చేసినా నేను ముందుంటా. నీళ్లు రాని ప్రాజెక్టులకు ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేస్తారు. ఎన్నిసార్లు జలహారతులు ఇస్తారు.. సిగ్గు అనిపించడం లేదా. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వింతగా ఉంది’ అని ఏబీ వెంకటేశ్వరరావు విమర్శలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్
పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టం.. భానుప్రకాష్ వార్నింగ్
Read Latest AP News And Telugu News