TDP Leaders: ఎన్నికల సంఘాన్ని కలిసిన టీడీపీ నేతలు.. ఎందుకంటే..
ABN , Publish Date - Aug 13 , 2025 | 02:25 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం నేతలు బుధవారం కలిశారు. పులివెందుల, ఒంటిమిట్టలో అరాచకాలకు పాల్పడిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఏపీ ఎన్నికల కమిషనర్‌ను మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, విద్య మౌలిక వసతుల కమిటీ ఛైర్మన్ రాజశేఖర్ కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (AP Election Commission) తెలుగుదేశం నేతలు (TDP Leaders) ఇవాళ(బుధవారం) కలిశారు. పులివెందుల, ఒంటిమిట్టలో అరాచకాలకు పాల్పడిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఏపీ ఎన్నికల కమిషనర్‌ను మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, విద్య మౌలిక వసతుల కమిటీ ఛైర్మన్ రాజశేఖర్ కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో టీడీపీ నేతలు మాట్లాడారు.
ఐదేళ్లలో రాష్ట్రాన్ని జగన్ అధోగతిపాలు చేశారు: వర్ల రామయ్య

అరాచకానికి, రాజ్యాంగ వ్యతిరేక పరిపాలనకు జగన్ మోహన్ రెడ్డి మారుపేరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపణలు చేశారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని జగన్ అధోగతిపాలు చేశారని మండిపడ్డారు. పులివెందుల, ఒంటిమిట్ట ప్రాంతాల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరగడాన్ని ప్రజలు సంతోషిస్తున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు పాలనపై ఎలక్షన్ కమిషన్ సంతోషాన్నివ్యక్తం చేసిందని తెలిపారు. పులివెందుల, ఒంటిమిట్ట ఎలక్షన్ పూర్తి అయ్యాక వైసీపీ అభ్యర్థులు, నేతలు మాట్లాడిన మాటలపై జగన్ ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఒక పోలీసు అధికారిని బాడీ షేమింగ్ చేస్తారా అని నిలదీశారు. వైసీపీ నేతల రిగ్గింగ్, దుర్మార్గం, బూత్ క్యాప్చరింగ్ లేకుండా పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలు జరిగాయని వర్ల రామయ్య పేర్కొన్నారు.
జగన్‌కు చంద్రబాబు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు: ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ

తల్లికి వందనం ద్వారా లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం లబ్ధి చేకూరిస్తే దానిని రాక్షస పాలన అని జగన్ ఎలా అంటారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి నిర్మించడం, సంపద సృష్టించడం జరుగుతుంటే దానిని రాక్షస పాలన అంటారా అని ఫైర్ అయ్యారు. 71శాతం పూర్తయిన పోలవరాన్ని జగన్ ధ్వంసం చేస్తే, ఆ పనులను కూటమి ప్రభుత్వం గాడిన పెట్టడాన్ని ఏమంటారని నిలదీశారు. క్రిమినల్స్‌కి సీట్లు ఇచ్చిన జగన్‌కు చంద్రబాబు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. టీడీపీ నేతల ఫొటోలు మార్ఫింగ్ చేసి కామెంట్లు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. త్వరలో మార్ఫింగ్‌ల నిగ్గు తేలుస్తామని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ వార్నింగ్ ఇచ్చారు.
అధికారులను నిందిస్తారా: దేవినేని ఉమామహేశ్వరరావు

ఏపీలో గత ఐదేళ్ల జగన్ పాలనలో రెండు వేలకు పైగా ఎంపీటీసీలను ఏకగ్రీవం చేసుకున్నారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపణలు చేశారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో వందకుపైగా జెడ్పీటీసీలు ఏకగ్రీవం చేసుకున్నారని విమర్శించారు. అధికారులను నిందిస్తారా.. డీఐజీ కోయ ప్రవీణ్ ఎలక్షన్లు జరిపిస్తే ఆయన గురించి అభ్యంతరకరంగా మాట్లాడుతారా అని మండిపడ్డారు. పులివెందుల, ఒంటిమిట్టలలో ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెప్పుకొచ్చారు. శాసన సభకు జగన్ వచ్చి ప్రశ్నిస్తే.. 164 మంది కూటమి ఎమ్మెల్యేలు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తమకు న్యాయ వ్యవస్ధల మీద గౌరవం ఉండటంతోనే కోర్టులకు వెళ్తున్నామని ఉద్ఘాటించారు. పోలీసు అధికారులను అపహాస్యం చేసిన దానిపై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్‌ని కోరామని దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.
వైసీపీని బహిష్కరించాలి: ఎమ్మెల్యే బోడే ప్రసాద్
దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా జగన్ మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విమర్శించారు. వైసీపీ గుర్తింపుని ఎన్నికల సంఘం శాశ్వతంగా రద్దు చేయాలని కోరారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా జగన్, ఆయన పార్టీని బహిష్కరించాలని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సూచించారు.