Nara Lokesh Counters to YS Jagan: కన్న తల్లినే సరిగ్గా పట్టించుకోని సైకో.. జగన్‌పై లోకేష్ ఘాటు వ్యాఖ్యలు
ABN , Publish Date - Sep 04 , 2025 | 01:13 PM
ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీలో నాలుగు స్లాబ్‌లను రెండుకు కుదించి నిత్యావసరాల ధరలు తగ్గించడం చారిత్రాత్మక సంస్కరణ అని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. సరళమైన వృద్ధి, ఆధారిత పన్ను విధానం ఒక నిర్ణయాత్మక అడుగును సూచిస్తోందని తెలిపారు. ఈ మైలురాయి సంస్కరణలు చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోదీని ప్రత్యేకంగా అభినందిస్తున్నామని లోకేష్ పేర్కొన్నారు.
అమరావతి, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఇవాళ (గురువారం) ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ క్రమంలో మంత్రివర్గ సమావేశానికి ముందు మంత్రులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అల్పాహార విందు ఇచ్చారు. ఈ భేటీలో మంత్రులకు పలు కీలక సూచనలు చేశారు నారా లోకేష్. డీఎస్సీకి ఎన్ని ఇబ్బందులు సృష్టించినా రికార్డు స్థాయిలో 16వేల పై చిలుకు పోస్టులు విజయవంతంగా భర్తీ చేశామని ఉద్ఘాటించారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక్క డీఎస్సీ కూడా సక్రమంగా నిర్వహించలేదని విమర్శించారు. డీఎస్సీ అభ్యర్థులందరితో ఒక అభినందన సభ నిర్వహిస్తే బాగుంటుందని ఈ సమావేశంలో మంత్రులు అభిప్రాయపడ్డారు. గత ఏడాది ఇదే సమయంలో తలెత్తిన బుడమేరు వరదపై మంత్రులు చర్చించారు. జగన్ ఐదేళ్ల నిర్వాకం వల్ల బుడమేరు కట్ట తెగి సమస్యలు ఎదుర్కొన్నామని లోకేష్ ప్రస్తావించారు.
అన్ని శాఖలతో సమన్వయం..
గత ఏడాది అనుభవాలతో ఈసారి అప్రమత్తంగా ఉన్నామని లోకేష్ చెప్పుకొచ్చారు. అన్ని శాఖల సమన్వయంతో గత ఏడాది సవాళ్లను ధీటుగా ఎదుర్కొన్నామని లోకేష్ స్పష్టం చేశారు. ఇన్‌చార్జ్ మంత్రులు తమ జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లో కార్యకర్తలను కలవాలని లోకేష్ సూచించారు. కార్యకర్తల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌లు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. కార్యకర్తల నుంచి నియోజకవర్గ పరిస్థితులపై ఇన్‌చార్జ్ మంత్రులు ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని మార్గనిర్దేశం చేశారు లోకేష్. జిల్లాల్లో ఎక్కడైనా యూరియా సమస్య ఉందా అని లోకేష్ ఆరా తీశారు. అన్ని జిల్లాల్లో తగినంత లభ్యత ఉందని మంత్రులు సమాధానం ఇచ్చారు. అక్కడక్కడా రైతులు క్యూ ఉన్నా వెంటనే అధికారులు సమస్యలను పరిష్కరిస్తున్నారని మంత్రులు చెప్పుకొచ్చారు. రైతుల ముసుగులో వైసీపీ నేతలు చేసే కుతంత్రాలను ధీటుగా తిప్పి కొట్టాలని లోకేష్ పేర్కొన్నారు.
వైసీపీ నేతలది సంకట స్థితి..
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి రోజు కన్న తల్లి పట్ల జగన్ వ్యవహారించిన తీరు రాష్ట్రమంతా చూసిందని లోకేష్ గుర్తుచేశారు. కన్న తల్లినే సరిగ్గా పట్టించుకోని సైకోయిజం జగన్ రూపంలోనే చూశామని లోకేష్ తెలిపారు. కన్న తల్లి, సొంత చెల్లితో జగన్‌కు ఉన్న విభేదాలతోనే పార్టీలో ఇమడలేక, బయటకు రాలేక చాలా మంది వైసీపీ నేతలు సంకట స్థితి ఎదుర్కొంటున్నారని మంత్రులు వివరించారు. అయితే, లోకేష్‌తో జరిగిన ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిణామాలపైనా మంత్రుల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.
చారిత్రాత్మక సంస్కరణ..
ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీలో నాలుగు స్లాబ్‌లను రెండుకు కుదించి నిత్యావసరాల ధరలు తగ్గించడం చారిత్రాత్మక సంస్కరణ అని లోకేష్ ఉద్ఘాటించారు. సరళమైన వృద్ధి, ఆధారిత పన్ను విధానం ఒక నిర్ణయాత్మక అడుగును సూచిస్తోందని తెలిపారు. ఈ మైలురాయి సంస్కరణలు చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోదీని ప్రత్యేకంగా అభినందిస్తున్నామని లోకేష్, మంత్రులు పేర్కొన్నారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, మ్యాప్‌లు, చార్టులు, పెన్సిళ్లు, షార్ప్‌నర్లు, వ్యాయామ పరికరాలపై జీఎస్టీ తగ్గింపులను విద్యా శాఖ మంత్రిగా ప్రత్యేకంగా స్వాగతిస్తున్నానని చెప్పుకొచ్చారు. విద్యపై కుటుంబాల భారాన్ని తగ్గించడంలో జ్ఞాన-ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో ఇవి చాలా దోహదపడతాయని లోకేష్ నొక్కిచెప్పారు.
అయ్యన్నపాత్రుడుకి బర్త్ డే విషెస్..
అలాగే ఈ సమావేశంలో ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుకి లోకేష్, మంత్రులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రజాసంక్షేమం కోసం వారు విశేష కృషి చేశారని కొనియాడారు. తాను చేపట్టిన పదవులకు వన్నెతెచ్చారని ప్రశంసిచారు. ఎక్కడా రాజీపడని మనస్తత్వం అయ్యన్న పాత్రుడు సొంతమని కీర్తించారు. అయ్యన్న పాత్రుడు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నానని నారా లోకేష్, మంత్రులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
జీఎస్టీ సంస్కరణలు దేశానికి నిజమైన దీపావళి.. పవన్ ప్రశంసలు
Read Latest Andhra Pradesh News and National News