Minister Narayana: అమరావతికి కొత్త రూపం.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN , Publish Date - Aug 18 , 2025 | 07:27 PM
భూముల కేటాయింపు విషయంలో మంత్రివర్గ ఉఫసంఘం తీసుకున్న నిర్ణయాలకు సీఆర్డీఏ అధారిటీలో ఆమోదముద్ర వేశామని మంత్రి నారాయణ తెలిపారు. వీటిని ఈనెల 21వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో వీటికి ప్రభుత్వం ఆమోదం తెలపనుందని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.
అమరావతి , ఆగస్టు18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) నేతృత్వంలో 51వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం (Amaravati CRDA Meeting) ఏపీ సచివాలయంలో ఇవాళ(సోమవారం) జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించారు. ఈ భేటీకి సంబంధించిన విషయాలను మీడియాకు మంత్రి నారాయణ (Minister Narayana) వెల్లడించారు. భూముల కేటాయింపు విషయంలో మంత్రివర్గ ఉఫసంఘం తీసుకున్న నిర్ణయాలకు సీఆర్డీఏ అథారిటీలో ఆమోదముద్ర వేశామని తెలిపారు. వీటిని ఈనెల 21వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో వీటికి ప్రభుత్వం ఆమోదం తెలపనుందని చెప్పుకొచ్చారు మంత్రి నారాయణ.
20వేల మందికి ఉద్యోగాలు...
అమరావతి రాజధానిలో 217చదరపు కిలోమీటర్లు పరిధిలో గ్రామ కంఠాల పరిధిలో డ్రింకింగ్, సివరేజి వాటర్ వంటి వాటి విషయంలో రూ.904 కోట్లతో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. 29 గ్రామాల్లో తాగునీటికి 30 శాతం, సివరేజి ట్రీట్‌మెంట్ చేసి పంపడంలో వందశాతం గ్యాప్ ఉందని తెలిపారు. వాటర్ సప్లైకి రూ. 64.35 కోట్లు, సివరేజ్‌కి రూ.110కోట్లు, రోడ్లకు రూ.339కోట్లు మెయింటెనెన్స్‌కు మొత్తంగా రూ.904 కోట్లు కేటాయిస్తున్నామని వెల్లడించారు. మంగళగిరిలో గ్లోల్డ్స్ క్లస్టర్, జమ్స్ అండ్ జ్యూలరీ పార్కు కోసం 78 ఎకరాల్లో రూ.5000 కోట్ల పెట్టుబడులు , 20వేల మందికి ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అసైనీలకు తిరిగి సర్టిఫికెట్లు ఇచ్చిన వారికి గతంలో పట్టా, అసైనీ అని రాసి ఇచ్చేవారని... దానిలో అసైనీ పదాన్ని తీసేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని పేర్కొన్నారు మంత్రి నారాయణ.
ఎస్‌ఆర్‌ఎం, విట్‌లతో ఒప్పందం...
ఎస్పీవీలను ఏర్పాటు చేయాలని దానిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, ఐకానిక్ బ్రిడ్జ్, స్పోర్ట్ సిటీ, ఐఆర్ఆర్ వంటి వాటిని తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. వాడిన వాటర్‌ను ట్రీట్ చేసి బయటకు పంపేందుకు రూ.411కోట్లు, వాటర్ డిస్ట్రిబ్యూషన్‌కు రూ.376 కోట్లతో చేపడుతున్నామని వివరించారు. ఎస్‌ఆర్‌ఎం, విట్‌లకు 17వేల మందితో నడపాలని ఒప్పందం ఉందని.. అప్పుడు అదనంగా భూమి ఇస్తామని గతంలో హమీ ఇచ్చామని గుర్తుచేశారు. దీంతో ఇప్పడు వారికి మరో 100 ఎకరాల చొప్పున ఒక్కొక్కరికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అమరావతి క్యాపిటల్ సిటీ డిజైన్ చేసినప్పుడు సీడ్ క్యాపిటల్‌కు రైట్ సైడ్, లెప్ట్ సైడ్ రెండు బ్రిడ్జిలు నిర్మించాలనుకున్నామని.. దానిలో భాగంగా వైకుంఠపురం వద్ద ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుందని తెలిపారు మంత్రి నారాయణ.
వైసీపీ నేతలది తప్పుడు ప్రచారం..
మార్చి 31వ తేదీకి 4వేల ఇళ్లు తయారు చేసి అధికారులకు ఇచ్చేస్తామని.. ఆ రోడ్డును ఏడాదిన్నరలో పూర్తిచేసి ఇచ్చేస్తామని స్పష్టం చేశారు. మూడున్నరేళ్లలో అమరావతి మొదటిదశ పూర్తిచేస్తామని ఉద్ఘాటించారు. అమరావతి మునిగిపోయిందని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అసలు అమరావతి ఎక్కడ మునిగిందో చూపాలని సవాల్ విసిరారు. బ్రిడ్జి నిర్మాణ సమయంలో వచ్చిన మట్టిని కాలువలో వేయడంతో నీరు నిలిచిందని.. దానిని గుర్తించి వెంటనే సీఆర్డీఏ అధికారులు క్లియర్ చేశారని క్లారిటీ ఇచ్చారు. ఐకానిక్ టవర్స్‌లో నిర్మాణం కోసం చుట్టూ గుంతలు తవ్వామని... అక్కడ వాన వస్తే నీళ్లు నిలవకుండా ఎలా ఉంటాయని ప్రశ్నించారు మంత్రి నారాయణ.
ల్యాండ్ పూలింగ్‌పై చర్చ...
అమరావతిలో ఏడీసీ, సీఆర్డీఏలు పనులు చేస్తున్నాయని... అలాగే ఎస్పీవీలు కూడా క్రియేట్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అడిషనల్ ల్యాండ్ పూలింగ్ విషయంలో చర్చించిన తర్వాత త్వరలోనే కేబినెట్‌కు తీసుకువస్తామని వెల్లడించారు. గతంలో గుంటూరు, విజయవాడకు అండర్ గ్రౌండ్ డ్రైనేజికి ఇచ్చిన డబ్బులు వైసీపీ ప్రభుత్వం వాడేసిందని ఆరోపించారు. కరకట్ట రోడ్డుపై రెండువైపులా రివర్టింగ్ వాల్ కట్టాలా లేదా అనేదానిపై నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. సీడ్ యాక్సిస్ రోడ్డు ఇంకా కొండవీటి వాగు దాటాలని, మంగళగిరి రోడ్డు వద్ద కెనాల్ దాటాలని వివరించారు. సీడ్ యాక్సిస్ రోడ్డును అనుసంధానిస్తూ వై ఆకారంలో మరో రోడ్డు మంగళగిరి వైపున కలుపుతామని వివరించారు. అవుటర్ రింగ్ రోడ్డును కేంద్ర ప్రభుత్వం టేకప్ చేస్తుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కాకాణి గోవర్ధన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్
కేంద్రమంత్రులతో నారా లోకేష్ భేటీ.. ఎందుకంటే..
Read Latest AP News And Telugu News