Minister Atchannaidu: జగన్ హయాంలో రైతుల సమస్యలు అవినాశ్‌రెడ్డికి కనిపించలేదా.. అచ్చెన్నాయుడు ఫైర్
ABN , Publish Date - Nov 04 , 2025 | 05:08 PM
కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేరు మీద వైసీపీ నేతలు చేస్తున్న నాటకాలు ఆపాలని హితవు పలికారు మంత్రి అచ్చెన్నాయుడు.
అమరావతి, నవంబరు4 (ఆంధ్రజ్యోతి): కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి (MP Avinash Reddy)పై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేరు మీద వైసీపీ నేతలు చేస్తున్న నాటకాలు ఆపాలని హితవు పలికారు. కడప జిల్లాలో ఏమి జరుగుతోందో చూడని అవినాశ్‌కి.. ఇప్పుడు రైతులపై అంత ఆకస్మికంగా ప్రేమ ఎందుకు..? వచ్చిందని ప్రశ్నించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఉల్లి రైతులు నష్టపోకూడదని సీఎం చంద్రబాబు ఆలోచించి హెక్టార్‌కి రూ.50,000 చొప్పున అందజేయాలని నిర్ణయించారని తెలిపారు. తమ ప్రభుత్వంలోఉల్లి రైతులకు రూ.104.57 కోట్ల లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు మంత్రి అచ్చెన్నాయుడు.
ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టినప్పుడు క్వింటాకు రూ.1200 వెచ్చించి మార్కెటింగ్, మార్క్‌ఫెడ్ ద్వారా కర్నూలు మార్కెట్ నందు సుమారు రూ.17. 22 కోట్ల విలువ గల ఉల్లి పంటను కొనుగోలు చేశామని చెప్పుకొచ్చారు. ఉల్లి పంట పాడవ్వకుండా రైతులకు తమ ప్రభుత్వం మేలు చేసిందని వివరించారు. 2020లో వైసీపీ హయాంలో ఉల్లి ధర పడిపోతే మద్దతు ధర రూ.770లు ప్రకటించడం తప్పా చేసిందేమీ లేదని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో మార్క్‌ఫెడ్ ద్వారా కేవలం 129 మంది రైతుల నుంచి 970 మెట్రిక్ టన్నుల ఉల్లిని మాత్రమే సేకరించి, రైతులకు కేవలం రూ.75 లక్షలు మాత్రమే చెల్లించిన విషయం అవినాష్ రెడ్డి గుర్తుంచుకోవాలని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.
జగన్ హయాంలో క్వింటాకు ఉల్లి ధర రూ.770 నిర్ణయించారని, కానీ రైతుల శ్రేయస్సు కోసం సీఎం చంద్రబాబు ఉత్తమ నిర్ణయంతో క్వింటాకు రూ.1200 పెట్టి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లలో రైతుల సమస్యలు అవినాశ్‌రెడ్డికి కనిపించలేదా..? అని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడు, విపత్తుల సమయంలో మాత్రమే వైసీపీ నేతలు రైతుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు మంత్రి అచ్చెన్నాయుడు.
గత ఐదేళ్లు రైతులు ఇబ్బందులు పడుతుంటే అవినాశ్ రెడ్డి కళ్లకు గంతలు కట్టుకుని ఉన్నారా..? అని ప్రశ్నించారు. నష్టపరిహారం ఫైళ్లు పెండింగ్‌లో పెట్టింది కూటమి ప్రభుత్వం కాదని… గత జగన్ ప్రభుత్వ గందరగోళ విధానాలేనని ఎద్దేవా చేశారు. రైతుల పేరు చెప్పుకుంటూ రాజకీయ లాభం చూడటం అవినాశ్‌రెడ్డి స్వభావమని విమర్శించారు. సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే కనీస అర్హత అవినాశ్‌రెడ్డికి లేదని ఫైర్ అయ్యారు. రైతుల కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఉద్ఘాటించారు. అన్నదాతలకు అందచేస్తున్న పథకాలు, ధరలు తగ్గినప్పుడు వారికి ఇస్తున్న పరిహారాలు వైసీపీ నేతల కళ్లకు కనపడటం లేదా..? అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఉల్లి రైతుల సమస్యలని ఏపీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: ఎంపీ అవినాశ్ రెడ్డి
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్
Read Latest AP News And Telugu News