Share News

Home Minister Anitha Praises AP Police: మాదక ద్రవ్య రహిత ఏపీ మా లక్ష్యం: అనిత

ABN , Publish Date - Sep 02 , 2025 | 09:42 AM

నేర పరిశోధన, ప్రజల శ్రేయస్సులో పోలీసు జాగిలాలది కీలక పాత్రని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఉద్ఘాటించారు. పోలీసు జాగిలాల శిక్షణతో‌ పాటు, వాటి సంరక్షణపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని హోంమంత్రి అనిత సూచించారు.

Home Minister Anitha Praises AP Police: మాదక ద్రవ్య రహిత ఏపీ మా లక్ష్యం: అనిత
Home Minister Anitha Praises AP Police

అమరావతి, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత (Minister Vangalapudi Anitha) ఉద్ఘాటించారు. ప్రజల రక్షణలో కీలకంగా వ్యవహరించే పోలీసు శాఖ మరింత చురుకుగా పని చేస్తోందని తెలిపారు. యువత మత్తుపదార్థాలకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా... మత్తుపదార్థాలను గుర్తించడంలో శిక్షణ పొందిన స్లీపర్ డాగ్స్ పని అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు హోంమంత్రి అనిత.


ఇవాళ(మంగళవారం) గుంటూరు జిల్లాలోని ఆరో బెటాలియన్ ప్రాంగణంలో 22వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పలువురు ఐపీఎస్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు హోంమంత్రి అనిత. 31వ పోలీసు జాగిలాల ప్రదర్శన, విన్యాసాలు ఆకట్టుకున్నాయి. శిక్షణలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతి అందజేశారు అనిత. ప్రథమ స్థానం నెల్లూరు జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యం దక్కించుకున్నారు. రెండో స్థానంలో పల్నాడు అశోక్, గుంటూరు జిల్లాకు చెందిన వేణుబాబు సాధించారు. తృతీయ స్థానంలో రాజమండ్రికి చెందిన శివకుమార్ దక్కించుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత ప్రసంగించారు.


నేడు ఈ కార్యక్రమంలో‌ పాల్గొనడం ఆనందంగా ఉందని హోంమంత్రి అనిత చెప్పుకొచ్చారు. జాగిలాల ప్రదర్శన, వాటి క్రమ శిక్షణ చూస్తే ఆశ్చర్యం కలిగిందని పేర్కొన్నారు. మూగ జీవాలతో ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ జాగిలాల వల్ల ఎన్నో కేసులు ఛేదించిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఎక్కడ నేరం జరిగినా... డాగ్ స్క్వాడ్ రాలేదా అని ప్రజలే అడుగుతారని అన్నారు. ప్రతి జాగిలానికి రెండు అంశాల్లో శిక్షణ ఇవ్వడం ఇదే తొలిసారని చెప్పుకొచ్చారు. మందుగుండు, డ్రగ్స్, గంజాయి, ఎర్రచందనం ఏదైనా ఎక్కడ దాచినా గుర్తించేలా జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారని తెలిపారు హోంమంత్రి అనిత.


నేటికీ అప్పా అనేది మనం కేటాయించుకోలేక పోయామని హోంమంత్రి అనిత వెల్లడించారు. వంద ఎకరాల్లో అప్పా నిర్మాణం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. కొత్తగా వచ్చే పోలీసు సిబ్బందికి సాంకేతిక పరిజ్ఞానం పైన కూడా శిక్షణ ఇస్తున్నారని వివరించారు. నేర పరిశోధనలో, ప్రజల శ్రేయస్సులో కూడా పోలీసు జాగిలాలది కీలకపాత్రని ఉద్ఘాటించారు. గతంలో రేపల్లెలో అత్యాచారం జరిగిన కేసులో ఎలాంటి ఆధారం దొరకలేదని చెప్పుకొచ్చారు. డాగ్ స్క్వాడ్ వచ్చి ఆనవాళ్లు గుర్తించాక 36 గంటల్లో నిందితులను పట్టుకున్నారని గుర్తుచేశారు. పోలీసు జాగిలాల శిక్షణతో‌పాటు, వాటి సంరక్షణపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని హోంమంత్రి అనిత సూచించారు.


మాదక ద్రవ్యాలపై నిరంతరం నిఘా: ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

గంజాయి, డ్రగ్స్‌ను పూర్తిగా నిరోధించేలా అనేక కార్యక్రమాలు చేపట్టామని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (AP DGP Harish Kumar Gupta) తెలిపారు. ఏపీ పోలీసు చరిత్రలో సరికొత్త శిక్షణని ఈసారి ఇచ్చామని చెప్పుకొచ్చారు. మందుగుండు సామాగ్రితోపాటు డ్రగ్స్‌ను కూడా గుర్తించేలా జాగిలాలకు శిక్షణ ఇచ్చామని వెల్లడించారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.


డ్రగ్స్ రహిత ఏపీగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు తమకు స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలపై నిరంతరం నిఘా పెట్టి తనిఖీలు ముమ్మరం చేశామని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో నేరాల సంఖ్య తగ్గించామని చెప్పుకొచ్చారు. నిందితులను పట్టుకోవడంలో కూడా సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడిందని ఉద్ఘాటించారు. 22వ బ్యాచ్‌కి సరికొత్త విధానంలో అనేక అంశాల్లో శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. సమాజ శ్రేయస్సులో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రబాబు ది గ్రేట్.. సీబీఎన్‌ కు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న అభినందనలు

రాష్ట్రాభివృద్ధిలో పవన్ కల్యాణ్‌ సహకారం మరువలేనిది: సీఎం చంద్రబాబు

For More AP News And Telugu News

Updated Date - Sep 02 , 2025 | 10:59 AM