Share News

Murali Nayak Tribute: అమరుడా ఇక సెలవ్‌

ABN , Publish Date - May 12 , 2025 | 04:44 AM

మురళీ నాయక్‌ సైనికుడైన ఆత్మకు అనేక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి. సైనిక కుటుంబానికి ఆర్థిక సహాయం, స్థలం, ఉద్యోగాలు ఇచ్చే హామీతో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు నివాళులు అర్పించారు

Murali Nayak Tribute: అమరుడా ఇక సెలవ్‌

ప్రభుత్వ లాంఛనాలతో అగ్నివీర్‌ మురళీ నాయక్‌కు అంత్యక్రియలు

  • తరలివచ్చిన వేలాది జనం.. అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు

  • ఉప్పొంగిన భావోద్వేగం.. అమర్‌ రహే అంటూ మిన్నంటిన నినాదాలు

  • పాడె మోసిన మంత్రి లోకేశ్‌.. అంత్యక్రియలు చివరి దాకా అక్కడే

  • పార్థివ దేహానికి డిప్యూటీ సీఎం పవన్‌ ఘన నివాళి

  • ధైర్యంగా ఉండాలని నాయక్‌ తల్లిదండ్రులకు ఓదార్పు

  • పవన్‌ వ్యక్తిగతంగా రూ.25 లక్షల ఆర్థిక సాయం

  • ప్రభుత్వం తరఫున రూ.50 లక్షలు, 5 ఎకరాల భూమి, ఇంటి స్థలం, వీరజవాన్‌ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం

  • కుటుంబానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు భరోసా

  • మంత్రులు అనగాని, అనిత, సవిత, సత్యకుమార్‌ నివాళులు

అనంతపురం మే 11(ఆంధ్రజ్యోతి): దేశం రక్షణలో సరిహద్దులో పాకిస్థాన్‌ ఉగ్రమూకలతో పోరాడుతూ అమరుడైన వీరజవాన్‌ మురళీనాయక్‌ అంత్యక్రియలు తీవ్ర భావోద్వేగాల మధ్య జరిగాయి. ‘యుద్ధంలో నేలకొరిగిన ఓ అమరుడా.. ఇక నీకు సెలవు’ అంటూ జిల్లా నలుమూలల నుంచీ వచ్చిన వేలాది మంది అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.


శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలోని సొంత వ్యవసాయ క్షేత్రంలో వీరజవాన్‌ మురళీ నాయక్‌ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో ఆదివారం నిర్వహించారు. వీరజవాన్‌ పార్థివ దేహంపై కప్పిన జాతీయ జెండాను, అతడి దుస్తులను తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సమయంలో మురళీనాయక్‌ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. అంతకు ముందు తమ కుమారుడి పార్థివదేహానికి పూల మాలలు వేసి నివాళులర్పిస్తూనే... జై హింద్‌ అంటూ బరువెక్కిన హృదయాలతో ఆ తల్లిదండ్రులు సెల్యూట్‌ చేయడం అక్కడున్నవారిని మరిం త భావోద్వేగానికి గురి చేసింది. జాతీయ జెండాను గాల్లో ఊపు తూ, ఉద్వేగంతో ‘భారత్‌ మాతాకీ జై... మురళీనాయక్‌ అమర్‌ రహే’ అంటూ పెద్దపెట్టున జనం నినదించారు. గిరిజన సంప్రదాయ పద్ధతిలో మురళీనాయక్‌ అంత్యక్రియలను పూర్తి చేశారు.

DSF.jpg

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఓదార్పు

వీరజవాన్‌ మురళీ నాయక్‌ పార్థివ దేహాంపై ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళుల ర్పించారు. సెల్యూట్‌ చేశారు. మురళీనాయక్‌ తల్లిదండ్రులను ఓదార్చారు. బోరున విలపిస్తున్న ఆ సైనికుడి తల్లి జ్యోతిబాయిని తన పక్కనే కూర్చోబెట్టుకుని కన్నీళ్లు తుడిచారు. ఇదే సందర్భంలో ఆ సైనికుడి తండ్రి శ్రీరామ నాయక్‌ చెప్పిన మాటలు పవన్‌ కల్యాణ్‌తోపాటు అక్కడున్న వారందరికీ కళ్లు చెమర్చేలా చేశాయి. ‘రేయ్‌ మురళీ... పవన్‌ కల్యాణ్‌ సార్‌ వచ్చి కుర్చున్నారు. లేచి సార్‌కు సెల్యూట్‌ కొట్టు మురళీ... ఒక సారి పవన్‌ సార్‌ను చూడు మురళీ’ అంటూ బోరుమన్నారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనను సముదాయించి ఓదార్చారు.


అండగా నిలిచిన ప్రభుత్వం.. పవన్‌

ప్రభుత్వం తరఫున మురళీ నాయక్‌ కుటుంబానికి రూ.50 లక్షలు, 5 ఎకరాల భూమి, 300 గజాల ఇంటి స్థలం, వీరజవాన్‌ తండ్రి శ్రీరాం నాయక్‌కు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు. పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగతంగా రూ.25 లక్షలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. సొంత భూమిలో మురళీ నాయక్‌ అంత్యక్రియలు నిర్వహించిన నేపథ్యంలో, అక్కడ స్థూపం ఏర్పాటుకు నిర్ణయించామని, జిల్లా కేంద్రంలో వీరజవాన్‌ మురళీ నాయక్‌ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు. కాగా, గ్రామస్థుల కోరిక మేరకు అమర జవాన్‌ మురళీ నాయక్‌ స్వగ్రామం కళ్లి తండా పేరును ఇకపై మురళీ నాయక్‌ తండాగా మార్చనున్నట్లు మంత్రి లోకేశ్‌ హామీ ఇచ్చారు.

efsdcx.jpg

ప్రభుత్వం అండగా ఉంటుంది: డిప్యూటీ సీఎం

వీరజవాన్‌ మురళీ నాయక్‌ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఆ కుటుంబానికి ఏ సాయం కావాలన్నా చేస్తాం. చిన్న వయసులోనే మురళీ నాయక్‌ అమరుడు కావడం చాలా బాధగా ఉంది. సైన్యంలో చేరాలన్న అతడి తపన.. మురళీ నాయక్‌ విరోచిత పోరాటం చిరస్మరణీయం. ప్రభుత్వం ప్రకటించిన సాయాన్ని అందజేస్తాం. వ్యక్తితంగానూ ఉండ గా ఉంటాను.


పవన్‌ వీరాభిమాని మురళీనాయక్‌

యుద్ధంలో అమరుడైన కళ్లితండాకు చెందిన జవాను అగ్నివీర్‌ మురళీనాయక్‌.. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వీరాభిమాని అని గ్రామస్థులు, అతడి స్నేహితులు తెలిపారు. రెండేళ్ల క్రితం మురళీనాయక్‌ సైన్యంలో చేరకముందు పవన్‌ కల్యాణ్‌ జిల్లా పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో మురళీనాయక్‌ చాలా హంగామానే చేశారు. ఎర్రచొక్కా వేసుకుని, తలకు రుమాలు చుట్టుకుని, జనసేన పార్టీ జెండా చేతపట్టుకుని స్నేహితులతో కలిసి పవన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. పవన్‌ కల్యాణ్‌కు క్రేన్‌ సాయంతో భారీ గజమాల కూడా వేశారు. ఆ ఫొటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ఆదివారం కళ్లి తండాలో మురళీ నాయక్‌ అంతిమయాత్రకు హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు ఆ ఫొటోలు, వీడియోలను గ్రామస్థులు చూపించారు.


మురళీ నాయక్‌ త్యాగం స్ఫూర్తిదాయకం: సీఎం చంద్రబాబు

వీరజవాన్‌ మురళీనాయక్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు అంతిమ నివాళులర్పించారు. ఈమేరకు ఎక్స్‌లో ఆయన ట్వీట్‌ చేశారు. ‘దేశరక్షణలో ప్రాణాలర్పించిన మురళీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మురళీ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందజేస్తాం. దీంతోపాటు 5 ఎకరాల సాగు భూమి, 300 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తాం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తాం మురళీ నాయక్‌ మన మధ్య లేకపోయినా ఆయన చేసిన త్యాగం ఎప్పుడూ మనలో స్ఫూర్తి రగిలిస్తూనే ఉంటుంది’ అని పేర్కొన్నారు.


అంతిమయాత్ర వాహనంలో లోకేశ్‌

మురళీ నాయక్‌ అంత్యక్రియలు చివరి వరకు మంత్రి నారా లోకేశ్‌ అక్కడున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకే కళ్లితండాకు చేరుకున్న లోకేశ్‌, ముందుగా మురళీ నాయక్‌ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జై హింద్‌ అంటూ సెల్యూట్‌ చేశారు. అనంతరం అతని తల్లిదండ్రులను ఓదార్చారు. అంతిమయాత్ర ఉదయం 11 గంటలకు మొదలవ్వగా... జవాన్‌ పార్థివదేహాన్ని మిలటరీ వాహనంలో ఎక్కించే సమయంలో లోకేశ్‌ పాడె మోశారు. అదే వాహనంలో అంత్యక్రియల ప్రాంతం వరకు ప్రయాణించారు. జాతీయ జెండాను చేతబూని ‘భారత్‌ మాతాకీ జై... వందేమాతరం.. మురళీ నాయక్‌ అమర్‌ రహే’ అంటూ నినదించారు. మిలటరీ వాహనం నుంచి వ్యవసాయ క్షేత్రంలోకి మురళీ పార్థివ దేహాన్ని కిందకు దించగా, అక్కడి నుంచి గుంత వరకు పాడెను మోశారు. అనంతరం పార్థివ దేహాన్ని పేటిక నుంచి బయటకు తీయగా, మధ్యాహ్నం 12 గంటల సమయంలో సైనికులు గౌరవ వందనం సమర్పించారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించి, గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ప్రభుత్వ లాంఛనాలు పూర్తైన తర్వాత మురళి పార్థివదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. వారు గిరిజన సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఖననం చేసే సమయంలో లోకేశ్‌ మట్టి పోసి, జై హింద్‌ అంటూ సెల్యూట్‌ కొట్టారు. కలెక్టర్‌ చేతన్‌, ఎస్పీ రత్న సహా పలువురు అధికారులు జవానుకు పుష్పాంజలి ఘటించారు.


adssxc.jpg

చాలా బాధాకరం: లోకేశ్‌

చిన్న వయసులోనే వీరజవాన్‌ మురళీ నాయక్‌ చనిపోవడం బాధాకరం. దేశం కోసం పోరాడతానని చెప్పి ఆర్మీలో చేరాడు. కుటుంబాలు, తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ దేశం కోసం అహర్నిశలూ మన సైనికులు కష్టపడుతున్నారు. కాబట్టే మనమంతా క్షేమంగా ఉన్నాం. వారి సేవలు వెలకట్టలేనివి. భారత సైన్యానికి రుణపడి ఉంటాం.

నివాళులర్పించిన మంత్రులు, ఎమ్మెల్యేలు

హోం మంత్రి వంగలపూడి అనితతోపాటు మంత్రులు సత్యకుమార్‌ యాదవ్‌, సవిత, అనగాని సత్యప్రసాద్‌, ప్రభుత్వ విప్‌ కాల్వ శ్రీనివాసులు, గుంటూరు మేయర్‌ రవీంద్ర.. వీరజవాన్‌ పార్థివ దేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి ఘన నివాళులర్పించారు. అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వీర జవాను పాడె మోశారు. హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, కందికుంట వెంకటప్రసాద్‌, పల్లె సింధూరరెడ్డి, ఎంఎస్‌ రాజు, మాజీ ఐఏఎస్‌ కుంటిమద్ది లక్ష్మీనారాయణ, జిల్లాకు చెందిన అన్ని పార్టీల నేతలు నివాళులర్పించారు.


sdfcdfsc.jpg

కాస్త.. ఎంగిలి పడండమ్మా..

వీర జవాను తల్లిదండ్రులకు అన్నం తినిపించిన మంత్రి సవిత

మురళీనాయక్‌ మరణ వార్త తెలిసిన నుంచీ ఆయన తల్లిదండ్రులు శ్రీరామానాయక్‌, జ్యోతిబాయి రెండు రోజులుగా అన్నపానీయాలు ముట్టక నీరసించిపోగా మంత్రి సవిత వారిని బతిమాలి బతిమాలి కాస్త అన్నం తినిపించారు. కుమారుడిని పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్న జవాను తల్లిదండ్రులను మంత్రి సవిత సముదాయించి అన్నం తినిపించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

-ఆంధ్రజ్యోతి (హిందూపురం, అనంతపురం)


DSCSD.jpg

అమర జవాన్‌కు చిత్ర నివాళి

వీర మరణం పొందిన మురళీనాయక్‌ ఆత్మకు శాంతి చేకూరాలని నారాయణఖేడ్‌కు చెందిన లీఫ్‌ ఆర్టిస్టు రావి ఆకుపై ఆయన చిత్రం రూపొందించి

నివాళులర్పించారు.

- ఆంధ్రజ్యోతి, నారాయణఖేడ్‌


ఇవి కూడా చదవండి..

పాక్ లో ప్రస్తుత పరిస్థితి .. చైనా శాటిలైట్ చిత్రాలు

Buddha Venkanna: విషపురుగు.. అందుకే దూరం పెట్టిన చంద్రబాబు

Operation Sindoor: మరికొద్ది గంటల్లో హాట్ లైన్ చర్చలు.. రంగం సిద్ధం..

Operation Sindoor: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై ప్రధాని సంచలన వ్యాఖ్యలు

India Vs Pakistan: ప్రధాని మోదీకి రాహుల్ కీలక సూచన

Operation Sindoor: భారత సైన్యం రావల్పిండిలోనూ గర్జించింది: రాజ్‌నాథ్ సింగ్

For Andhrapradesh news and Telugu News

Updated Date - May 12 , 2025 | 04:44 AM