Share News

Operation Sindoor: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై ట్రంప్‍నకు షాక్ ఇచ్చిన ప్రధాని మోదీ..

ABN , Publish Date - May 11 , 2025 | 04:15 PM

Operation Sindoor: భారత్, పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన కొన్ని గంటలకే ప్రధాని మోదీ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పలువురు కేంద్ర మంత్రులతోపాటు త్రివిధ దళాల అధిపతులు హాజరయ్యారు.

Operation Sindoor: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై ట్రంప్‍నకు షాక్ ఇచ్చిన ప్రధాని మోదీ..
MP Modi

న్యూఢిల్లీ, మే 11: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశంపై మధ్యవర్తులు అవసరం లేదని ప్రధాని తేల్చి చెప్పారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌కు అప్పగించడం మినహా పాకిస్థాన్‌కు మరో మార్గం లేదని ఆయన అన్నారు. కాశ్మీర్ అంశం పరిష్కరించుకునేందుకు తాము మధ్యవర్తిత్వం వహిస్తామని అమెరికా చెప్పిన వేళ ప్రధాని వ్యాఖ్యలు ఒక్కసారిగా హీటెక్కించాయి. కాశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒక్కటేనని మోదీ కుండబద్దలు కొట్టారు. కాశ్మీర్‌ విషయంలో ఇంతకుమించి మాట్లాడేదేమీ లేదని సుస్పష్టం చేశారు. ఉగ్రవాదులను అప్పగించే విషయంపై పాక్‌ మాట్లాడితే.. మేమూ మాట్లాడతామని ప్రధాని మోదీ చెప్పారు. ఇక త్రివిధ దళాల అధిపతులకు మోదీ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగిసిపోలేదని అన్నారు. పాక్‌ దాడులకు దిగితే.. భారత్‌ సైతం ఎదురుదాడి చేస్తుందని ప్రధాని మోదీ హెచ్చరించారు.

పాక్ కాల్పులకు దిగితే గట్టిగా బదులివ్వండంటూ త్రివిధ దళాల అధిపతులకు ప్రధాని మోదీ సూచించారు. అటు నుంచి తుపాకీ గుళ్లు వస్తే.. భారత్ నుంచి మిస్సైల్స్ ప్రయోగించాలని తెలిపారు. ఆపరేషన్ సింధూర్‌తో ప్రపంచానికి కొత్త సందేశం పంపామన్నారు. ఉగ్ర శిబిరాల సహా హెడ్ క్వార్టర్స్‌ను ధ్వంసం చేశామని చెప్పారు. వైమానిక దాడుల తర్వాత పాకిస్థాన్ చేతులెత్తేసిందని ఆయన పేర్కొన్నారు. సింధూ జలాల ఒప్పందాన్ని సీమాంతర ఉగ్రవాదంతో ముడిపెట్టామని.. ఉగ్రదాడులు ఆగే వరకు ఒప్పందం నిలుపుదలలోనే ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మరోవైపు భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రధాని మోదీ నివాసంలో జరిగిన ఈ భేటీకి త్రివిధ దళాల అధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ హాజరయ్యారు. అత్యున్నత స్థాయి అధికారులతో జరిగిన ఈ సమావేశంలో ప్రధాని మోదీ పైవిధంగా స్పందించారు. ఇక వరుసగా నాలుగు రోజులు పాటు పాకిస్థాన్ క్షిపణులు, డ్రోనులతో భారత్‌పై దాడులకు తెగబడింది. వీటిని భారత్ తిప్పికొట్టింది.


ఇంతలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణను ఆయన ప్రకటించారు. ఆ తర్వాత భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. శనివారం సాయంత్రం నుంచి కాల్పులు విరమణను ఇరు దేశాలు పాటిస్తున్నాయంటూ ఆయన కీలక ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటన చేసిన కొన్ని గంటలకే పాకిస్థాన్ తన తెంపరితనాన్ని మరోసారి చాటింది. భారత్ సరిహద్దు భూభాగంలోకి కాల్పులు జరిపింది. వీటిని భారత్ సైన్యం తిప్పికొంది.

ఇలాంటి పరిస్థితులు నెలకొన్న వేళ.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. పార్లమెంట్‌ ఉభయ సభల సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇదే అంశంపై ఇప్పటికే ప్రధాని మోదీకి ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే సైతం లేఖ రాసిన విషయం విధితమే.


ఏప్రిల్ 22వ తేదీ జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది మరణించారు. దీంతో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే పాకిస్థాన్ సైతం భారత్‌కు వ్యతిరేకంగా స్పందించింది. ఆ క్రమంలో భారత్‌కు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉప్పు నిప్పుగా మారాయి.


అలాంటి వేళ.. పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు నిర్వహించింది. దీనికి ఆపరేషన్ సిందూర్ అని భారత్ పేరు పెట్టింది. ఈ దాడి తర్వాత భారత్‌లోని సరిహద్దు వెంబడి ఉన్న రాష్ట్రాలపైకి పాకిస్థాన్ క్షిపణులు, డ్రోనులతో దాడులకు తెగబడింది. వాటిని భారత్ తిప్పి కొట్టింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య యుద్దం తప్పదన్నట్లుగా పరిస్థితులు వేడెక్కాయి. అలాంటి వేళ.. అమెరికా జోక్యం చేసుకొని ఈ రెండు దేశాల కాల్పుల విరమణ పాటిస్తాయని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి..

India Vs Pakistan: ప్రధాని మోదీకి రాహుల్ కీలక సూచన

Operation Sindoor: భారత సైన్యం రావల్పిండిలోనూ గర్జించింది: రాజ్‌నాథ్ సింగ్

For National News And Telugu News

Updated Date - May 11 , 2025 | 05:43 PM