India Vs Pakistan: ప్రధాని మోదీకి రాహుల్ కీలక సూచన
ABN , First Publish Date - 2025-05-11T15:37:48+05:30 IST
India Vs Pakistan: భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అలాంటి వేళ.. ప్రధాని నరేంద్ర మోదీకి లోక్ సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ లేఖ రాశారు.

న్యూఢిల్లీ, మే 11: భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న వేళ.. ఈ ఇరు దేశాలు తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్‌తోపాటు కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చ జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఆదివారం ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ లేఖ రాశారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు ఏకగ్రీవంగా తీర్మానించాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్‌తోపాటు కాల్పుల విరమణ ఒప్పందంపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చించడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి మనమంతా ఇలా సమావేశమై నిర్ణయం తీసుకోనే అవకాశం లభిస్తోందని ఆయన చెప్పారు. తన ఈ డిమాండ్‌పై వెంటనే స్పందించి.. నిర్ణయం తీసుకుంటారని రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు.
మరోవైపు పార్లమెంట్ ఉభయ సభలను సమావేశ పరిచి.. పహల్గాంలో ఉగ్రదాడిపై చర్చించాలని ప్రధాని మోదీకి ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే లేఖ రాశారు. ఏప్రిల్ 28వ తేదీన ప్రధాని మోదీకి ఖర్గే ఈ లేఖ రాసిన విషయం విదితమే. అయితే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ రాసిన లేఖపై మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. ఈ అంశంపై గతంలోనే ప్రధానికి లేఖ రాశానని చెప్పారు. ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ రాసిన లేఖకు తాను మద్దతు తెలుపుతున్నానని ఈ సందర్భంగా ఖర్గే స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ రాసిన లేఖ పట్ల ప్రధాని మోదీ సానుకూలంగా స్పందిస్తారని ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట సైనిక చర్యల చేపట్టిన తర్వాత కేంద్రం రెండు సార్లు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ హాజరు కాలేదు. అయితే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రభుత్వం చేపట్టే ఎటువంటి చర్యకైనా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈ అఖిల పక్ష సమావేశాల్లో ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసిన విషయం విషయం విధితమే.
ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది మరణించారు. ఈ ఘటన వెనుకు కర్మ, కర్త, క్రియ అంతా పాకిస్థాన్ ఉందనే బలమైన సాక్ష్యాలను భారత్ సంపాదించింది. దీంతో పాక్‌కు వ్యతిరేకంగా భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దాంతో సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. అలాగే భారత్‌లోని పాకిస్థానీలంతా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అందుకు గడువు సైతం విధించింది. ఆ తేదీ కూడా ముగిసింది.
ఇక పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాదులపై ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ చర్యలు తీసుకుంది. అందుకు ప్రతిగా భారత్ సరిహద్లులోని పలు రాష్ట్రాల్లోకి పాక్ సైన్యం డ్రోనులు, క్షిపణులతో దాడికి దిగింది. వెంటనే స్పందించిన భారత్.. వీటిని తిప్పికొట్టింది. ఇక కాల్పుల విరమణ ఒప్పందాన్ని సైతం పాకిస్థాన్ ఉల్లఘించింది. దీనికి సైతం భారత్ తనదైన శైలిలో సమాధానమిచ్చింది.
ఇలాంటి పరిస్థితులు ఇరు దేశాల మధ్య నెలకొన్న నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలను సమావేశం ఏర్పాటు చేసి.. దీని వేదికగా పరిస్థితులపై చర్చించాలని విపక్ష కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. అందులోభాగంగా ప్రధాని మోదీకి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు.
For National News And Telugu News