CM Chandrababu: సురవరంతో పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 24 , 2025 | 03:26 PM
సురవరంతో తనకు సుదీర్ఘ స్నేహం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయనకు అనేక ఉద్యమాలు నడిపిన అనుభవం ఉందని స్మరించుకున్నారు. ఆయనకు తానంటే ప్రత్యేక అభిమానం ఉండేదని గుర్తుచేసుకున్నారు. తాను చేపట్టిన పనులను అభినందించి, ప్రోత్సహించేవారని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
హైదరాబాద్, ఆగస్టు24(ఆంధ్రజ్యోతి): సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy) భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu) నివాళులు అర్పించారు. హిమాయత్‌నగర్‌లోని సీపీఐ కార్యాలయంలో సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు సీఎం చంద్రబాబు. అలాగే సురవరం కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.
ఈ సందర్భంగా సురవరం సేవలను గుర్తుచేసుకున్నారు. అనంతరం మీడియాతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. సురవరంతో తనకు సుదీర్ఘ స్నేహం ఉందని తెలిపారు. ఆయనకు అనేక ఉద్యమాలు నడిపిన అనుభవం ఉందని స్మరించుకున్నారు. వారికి తానంటే ప్రత్యేక అభిమానం ఉండేదని గుర్తుచేసుకున్నారు. తాను చేపట్టిన పనులను అభినందించి, ప్రోత్సహించేవారని వెల్లడించారు. సురవరంతో కలిసి పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని పేర్కొన్నారు. ఆయన మృతి సీపీఐకి, దేశానికి తీరని లోటని చెప్పుకొచ్చారు. సురవరం ఆత్మకు శాంతి కలగాలని తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

విద్యార్థి దశ నుంచి సురవరం పోరాడారు: మల్లు భట్టి విక్రమార్క
సురవరం సుధాకర్ రెడ్డి గొప్ప నాయకుడు అని.. ఆయనను కోల్పోవడం చాలా బాధకరంగా ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్మరించుకున్నారు. విద్యార్థి దశ నుంచి సురవరం పోరాడారని గుర్తుచేసుకున్నారు. దేశంలో సీపీఐ బలోపేతం కోసం కృషి చేశారని ఉద్ఘాటించారు. చిన్న నాటి నుంచి ప్రజల పక్షాన నిలబడి.. ప్రజల కోసం పోరాడారని కీర్తించారు. ఆయన చివరి వరకు ప్రజల కోసం నిలబడ్డారని ప్రశంసించారు. సురవరం రాజకీయ జీవితం నేటి యువతకు ఆదర్శమని కొనియాడారు. సురవరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పినట్లుగా తెలంగాణ కేబినెట్‌లో తీర్మానం చేసి సురవరం పేరు చిరస్థాయిగా నిలిచేలా నిర్ణయం తీసుకుంటామని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
గొప్ప కమ్యూనిస్టు నాయకుడు: ఎమ్మెల్యే సుజనా చౌదరి
సురవరం సుధాకర్ రెడ్డి గొప్ప కమ్యూనిస్టు నాయకుడుని.. అలాంటి గొప్ప నేతని భారతదేశం కోల్పోయిందని బీజేపీ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఉద్ఘాటించారు. సుధాకర్ రెడ్డితో తనకు 30 సంవత్సరాల పరిచయం ఉందని గుర్తుచేసుకున్నారు. వారు కమ్యూనిస్టు సిద్ధాంతాలను నమ్ముకున్నారని చెప్పుకొచ్చారు. ఆయన నిబద్ధతతో, నిజాయితీతో జీవితాన్ని కొనసాగించారని కీర్తించారు. సీపీఐ, సీపీఎం రెండు పార్టీలు కూడా కలిసి పనిచేయాలని సురవరం కోరుకునేవారని.. ఇంతవరకు అది జరగలేదని.. అది జరగాలని తాను కోరుకుంటున్నానని ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు.
శాంతిధూత మిషన్‌కి సురవరం మద్దతిచ్చారు:కేఏ పాల్
సురవరం సుధాకర్ రెడ్డి చనిపోయారని తెలియగానే తాను చాలా బాధపడ్డానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ వెల్లడించారు. సుధాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడే శాంతిధూత మిషన్‌కి మద్దతు ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. సుధాకర్ రెడ్డి మనతో లేకపోవడం బాధాకరమని చెప్పుకొచ్చారు. కమ్యూనిస్టులకు సరైన లక్ష్యం, నీతి, నిజాయితీ ఉన్నాయని ఉద్ఘాటించారు. ఆయన ఆశయాలు నెరవేర్చాలంటే ఇప్పుడున్న పార్టీలు మారాలని సూచించారు. బహుజనులకు ఇప్పుడున్న పార్టీలు న్యాయం చేయాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. సుధాకర్ రెడ్డి ఆశలను మనం నెరవేర్చాలని కేఏ పాల్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రంగంలోకి ఎన్టీఆర్ ఫ్యాన్స్.. అనంతపురంలో ఉద్రిక్తం
రాహుల్‌కి ముద్దు పెట్టిన యువకుడు.. చితక్కొట్టిన సిబ్బంది
For More AP News And Telugu News