Share News

అక్టోబర్ 2 కల్లా రాష్ట్రంలో లెగసీ వేస్ట్ పూర్తిగా తొలగిస్తాం: మంత్రి నారాయణ

ABN , Publish Date - Aug 24 , 2025 | 01:08 PM

మచిలీపట్నంలోని లెగసీ వేస్ట్ డంపింగ్ యార్డును మంత్రి నారాయణ పరిశీలించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో లెగసీ వేస్ట్ పూర్తిగా తొలగిస్తామని ఆయన అన్నారు.

అక్టోబర్ 2 కల్లా రాష్ట్రంలో లెగసీ వేస్ట్ పూర్తిగా తొలగిస్తాం: మంత్రి నారాయణ
Minister Narayana Machilipatnam visit

మచిలీపట్నం, కృష్ణా జిల్లా: సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో లెగసీ వేస్ట్ పూర్తిగా తొలగిస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ (Ponguru Narayana) అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని పూర్తిగా శుభ్రంగా మార్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని ఆయన తెలియజేశారు. మచిలీపట్నంలోని లెగసీ వేస్ట్ డంపింగ్ యార్డును పరిశీలించిన మంత్రి.. చెత్తను బయో మైనింగ్ చేస్తున్న విధానం గురించి మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.


అప్పుతో పాటు చెత్తను వదిలి వెళ్లారు..

గత ప్రభుత్వం అప్పులతో పాటు 85 లక్షల టన్నుల చెత్త కూడా వదిలి వెళ్ళిపోయిందని మంత్రి నారాయణ విమర్శించారు. చెత్త పన్ను వేసినా చెత్తను మాత్రం తొలగించని చెత్త ప్రభుత్వం వైసీపీదని మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 85 లక్షల లెగసీ వేస్ట్ ఉందని.. ఇప్పటివరకూ 72 లక్షల టన్నుల చెత్తను తొలగించగా మరో 13 లక్షల టన్నుల చెత్త మిగిలి ఉందని అన్నారు. మచిలీపట్నం లో మొత్తం 42 వేల టన్నుల చెత్తకు గాను 19 వేల టన్నులు పూర్తిగా తొలగించామని వెల్లడించారు. మచిలీపట్నంలో అదనంగా మెషీన్లు ఏర్పాటు చేసి త్వరితగతిన చెత్త తొలగించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.


పక్కా ప్రణాళికతో ఉన్నాం

నిత్యం రాష్ట్రంలో 7,500 టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. వీటి నిర్వహణ కోసం ప్రభుత్వం వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఇక ద్రవ వ్యర్థాల నిర్వహణ కోసం వచ్చే రెండు సంవత్సరాల్లో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు నిర్మించనున్నట్టు తెలిపారు. వ్యర్థాల నిర్వహణపై పక్కా కార్యాచరణతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని వివరించారు. చెత్త నిర్వహణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలనే లక్ష్యంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్టు నారాయణ స్పష్టం చేశారు.


ఇవీ చదవండి..

రంగంలోకి ఎన్టీఆర్ ఫ్యాన్స్.. అనంతపురంలో ఉద్రిక్తం

రౌడీ షీటర్ శ్రీకాంత్, లేడీ డాన్ క్రైమ్ హిస్టరీపై పోలీసుల ఆరా..

మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Aug 24 , 2025 | 01:17 PM