Rowdy Sheeter Srikanth: రౌడీ షీటర్ శ్రీకాంత్, లేడీ డాన్ క్రైమ్ హిస్టరీపై పోలీసుల ఆరా..
ABN , Publish Date - Aug 24 , 2025 | 09:52 AM
నెల్లూరులో రౌడీ షీటర్ శ్రీకాంత్, లేడీ డాన్ అరుణ అరాచాకలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నేరసామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు వీరికి సాయమందించిన పలువురు రౌడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నెల్లూరు: నెల్లూరులో రౌడీ షీటర్ శ్రీకాంత్, అతడి ప్రియురాలు అరుణ కలిసి చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు, నేరాల గుట్టుపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. లేడీ డాన్ అరుణ, శ్రీకాంత్ నేరాలతో సంబంధమున్న రౌడీ గ్యాంగ్ కోసమూ శోధిస్తున్నారు. ఇప్పటికే రౌడీ షీటర్ శ్రీకాంత్ సోదరుడు మునికృష్ణని పోలీసులు బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు రౌడీ షీటర్లని నెల్లూరులో అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న పలువురు రౌడీలను పట్టుకునేందుకు చెన్నై, బెంగుళూరు, హైదరాబాదులో పోలీసు బృందాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి.
ఇటీవల రౌడీ షీటర్ శ్రీకాంత్‌కు పెరోల్ రావడంలో నెల్లూరు రాజకీయనేతల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తడంతో సాక్షాత్తూ ఏపీ హోంశాఖా మంత్రి అనిత లోతుగా దర్యాప్తు జరపాలని పోలీసులను ఆదేశించారు. పెరోల్ ఇప్పించేందుకు శ్రీకాంత్ ప్రియురాలు అరుణ పొలిటికల్ వ్యవస్థలను మేనేజ్ చేసిందనే అభియోగాలున్నాయి. దీంతో ఆమెను కొన్నిరోజుల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. సెప్టెంబరు 4 వరకూ కోర్టు లేడీడాన్ అరుణకు రిమాండ్ విధించింది. అలాగే అక్రమ మార్గంలో పెరోల్ బెయిల్ అందుకుని బయటకు వచ్చిన శ్రీకాంత్ మళ్లీ కటకటాలపాలయ్యాడు. ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైళ్లో ఉన్నట్లు సమాచారం. వెలుగు కార్యాలయంలో చిన్న ఉద్యోగిగా చేరిన అరుణ శ్రీకాంత్‌తో చేతులు కలిపి లేడీ డాన్‌గా మారింది. అతడ్ని భర్తగా చెప్పుకుంటూ అరుణ ఎన్నో లాబీయింగులు, నేరాలకు పాల్పడింది. ఇప్పుడు ఆ నేరాల చిట్టా తయారు చేసే ప్రయత్నంలోనే పోలీసులు నిమగ్నమయ్యారు.
అంతేకాక, తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పరిధిలోని పాలవల్లివారి వీధిలో 2019లో మృతి చెందిన రజనీష్ కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ కేసును అప్పట్లో అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. సాక్షాలు లేవని 2021లో దర్యాప్తును మూసివేశారు. కానీ, ఈ దారుణహత్యకు శ్రీకాంత్, అరుణలకు సంబంధముందనే ఆరోపణలు ఇటీవల గుప్పుమన్నాయి. హత్యకి ముందు రజనీష్ తీసుకున్న సెల్ఫీ వీడియో ఇటీవల వైరల్ కావడమే కారణం. ఆ వీడియోలో రజనీష్, రౌడీ షీటర్ శ్రీకాంత్ నుండి తీవ్ర ఒత్తిళ్లు ఎదురవుతున్నాయని.. వాటిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రజనీష్ పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో నేపథ్యంలో కేసును మళ్లీ పునఃపరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామని సీఐ మురళీకృష్ణ వెల్లడించారు.
కానీ, కుమారుడి హత్యకు కారకులెవరో చెప్పేందుకు ఇప్పటికీ రజనీష్ కుటుంబ సభ్యులు భయపడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.. జగన్ ప్రభుత్వ హయాంలో ఈ హత్యకేసుపై విచారణ జరగకుండా శ్రీకాంత్, అరుణ మేనేజ్ చేసినట్లు తెలుస్తోంది. మరోపక్క లేడీ డాన్ అరుణ రూ.21లక్షలు మోసం చేసిందని విజయవాడ వాసి ఫిర్యాదు చేశారు. ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.2లక్షలకి పైగా గుంజిందని కోవూరుకి చెందిన గిరిజనులు కంప్లైంట్ ఇచ్చారు.
ఇవీ చదవండి..
మరిన్ని ఏపీ వార్తల కోసం