India postal services: మరో కీలక నిర్ణయం.. అమెరికాకు సేవలు నిలిపివేత
ABN , Publish Date - Aug 24 , 2025 | 08:59 AM
ఇప్పటికే రిజిస్టర్డ్ పోస్టు సేవలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించిన ఇండియన్ పోస్టల్ శాఖ.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కారణంగా.. వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ, ఆగస్టు 24: అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నారు. దీంతో భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అలాంటి వేళ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు అన్ని పోస్టల్ సేవలు నిలిపి వేస్తున్నట్లు ఇండియన్ పోస్టల్ ప్రకటించింది. ఈ నిబంధన ఆగస్ట్ 25వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అయితే ఈ సేవలు నిలిపివేయడం తాత్కాలికమేనని వివరించింది. అమెరికాలో ఆగస్టు నెలాఖరు నుంచి కస్టమ్స్ నిబంధనలు అమల్లోకి రానున్నాయని.. ఆ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
800 డాలర్ల విలువైన వస్తువులపై ఉన్న పన్ను మినహాయింపులను ఉపసంహరించుకుంటున్నట్లు ఈ ఏడాది జులై మాసాంతంలో ఆమెరికా యాంత్రాంగం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అమెరికాకు వెళ్లే అన్ని పోస్టల్ సర్వీసులకు వాటి విలువతో ఏమాత్రం సంబంధం లేకుండా సుంకాలకు లోబడి ఉంటాయంటూ ఆ దేశ అధికారులు వెల్లడించారు. అయితే 100 డాలర్లు విలువ కలిగిన గిఫ్ట్ ఐటెమ్స్, లేఖలు, దస్త్రాలకు మాత్రం ఈ సుంకాల నుంచి మినహాయింపు లభిస్తోందని ఆ ఉత్తర్వుల్లో అమెరికా యంత్రాంగం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఇక రష్యాతో భారత్ సన్నిహితంగా ఉంటుంది. అందులో భాగంగా రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేస్తోంది. ఈ విషయంపై అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్రుగా ఉన్నారు. బారత్ చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యాకు చేరుతున్న నగదుతో ఉక్రెయిన్‌తో జరిగే యుద్ధానికి వినియోగిస్తుందంటూ ట్రంప్ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌పై భారీగా ట్రంప్ సుంకాలు విధించారు. అంటే భారత్‌పై 25 శాతం సుంకం విధిస్తే.. మరో 25 శాతం పెనాల్టీ కింద ట్రంప్ విధించారు.
వినియోగదారులకు కలుగుతున్న ఈ అసౌకర్యానికి తాము చింతిస్తున్నామని ఇండియన్ పోస్టల్ చెప్పింది. ఈ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని.. అమెరికాకు పోస్టల్ సేవలను సాధ్యమైనంత త్వరగా పునరుద్దరింపబడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇండియన్ పోస్టల్ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు.. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ సేవలు నిలిచిపోనున్న సంగతి తెలిసిందే. ఈ రిజిస్టర్డ్ పోస్ట్ సేవలను.. స్పీడ్ పోస్ట్‌లో విలీనం చేస్తున్నట్లు ఇండియన్ పోస్టల్ ఇప్పటికే ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మరో కీలక నిర్ణయం.. అమెరికాకు సేవలు నిలిపివేత
కీలక విషయాన్ని కనుగొన్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్
For More National News And Telugu News