Bhanuprakash Reddy ON TTD: పరకామణిలో రూ.100 కోట్ల దొంగతనం: భానుప్రకాష్ రెడ్డి
ABN , Publish Date - Sep 20 , 2025 | 06:31 PM
వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భారీగా దోచుకున్నారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. స్వామి వారి హుండీని వైసీపీలోని కీలక నేతలు దోచుకున్నారని విమర్శించారు.
తిరుపతి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భారీగా దోచుకున్నారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి (Bhanuprakash Reddy) సంచలన ఆరోపణలు చేశారు. స్వామి వారి హుండీని వైసీపీలోని కీలక నేతలు దోచుకున్నారని విమర్శించారు. గతంలో టీటీడీ నుంచి తాడేపల్లి ప్యాలెస్‌కు కూడా ఇందులో వాటాలు వెళ్లాయని ఆరోపించారు. ఇవాళ(శనివారం) తిరుపతి వేదికగా భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలనలో పవిత్రమైన శ్రీవారి హుండీ నుంచి విదేశీ డాలర్లను దొంగతనం చేసిన కేసును తిరిగి విచారణ చేసేందుకు ఏపీ హై కోర్టు సంచలన ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తుచేశారు భానుప్రకాష్ రెడ్డి.
లోక్ అదాలత్‌లో రాజీ అయితే ఏపీ హైకోర్టు (AP High Court) ఉత్తర్వులతోనే మళ్లీ విచారణ సాధ్యమని చెప్పుకొచ్చారు. శ్రీవారి పరకామణిలో జరిగిన దొంగతనం కేసును సీబీసీఐడీ విచారణ చేసి అక్టోబర్ 13వ తేదీలోపు సీల్డ్ కవర్‌లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో టీటీడీలో ఉన్నతాధికారులుగా పని చేసిన వారికి కూడా ఇందులో వాటాలు ఉన్నాయని విమర్శించారు. సీబీసీఐడీ సీల్డ్ కవర్ నివేదిక హై కోర్టుకు అందిన వెంటనే కీలకమైన వ్యక్తులు జైలుకెళ్లడం ఖాయమని హెచ్చరించారు. శ్రీ కృష్ణ దేవరాయుల కాలంలో ఇలా దొంగలిస్తే ఉరిశిక్ష విధించారని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వంలో టీటీడీలో రోజుకూ రూ.10 నుంచి రూ.12 లక్షల వరకు కొట్టేసేవారని... అలా ఎన్నో సంవత్సరాలు దోచుకున్నారని ఆరోపించారు. లెక్కలేనన్ని ఆస్తులు కొన్నారని... చెన్నై సమాచార కేంద్రంలో ఆస్తులను రాయించుకున్నారని విమర్శించారు భానుప్రకాష్ రెడ్డి.
లోక్ అదాలత్ (Lok Adalat)లో ఈ కేసును రాజీ చేయించేశారని చెప్పుకొచ్చారు. పోలీసు శాఖ నుంచి తీవ్రమైన వత్తిడి వల్ల లోక్ అదాలత్‌లో రాజీ చేసుకుంటున్నట్లు విజిలెన్స్ నివేదికలో పేర్కొన్నారని గుర్తుచేశారు. ఈ సంఘటన జరిగినప్పుడు కరుణాకర్ రెడ్డి చైర్మన్‌గా ఉన్నారని తెలిపారు. గోవిందదాసుగా చెప్పుకున్న కరుణాకర్ రెడ్డి (Karunakar Reddy) అప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అప్పట్లో ఈ కేసు విచారణ చేసిన వ్యక్తి అప్రూవర్‌గా మారారని తెలిపారు. ఆయన సంచలన నిజాలను వెలుగులోకి తీసుకురాబోతున్నారని చెప్పుకొచ్చారు. గతంలో సీసీ టీవీ ఫుటేజ్ మొత్తాన్ని డిలీట్ చేసేశారని ఆరోపించారు. పరకామణిలోనే కాదని... తులాభారంలోనూ గత వైసీపీ (YSRCP) ప్రభుత్వ పెద్దలు చేతివాటం ప్రదర్శించారని విమర్శించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు పూర్తి అయిపోగానే గత పాలకులకు సహకరించిన వారిని టీటీడీ నుంచి పంపేస్తున్నామని భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
పల్నాడులో రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోను: సీఎం చంద్రబాబు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 9 మంది ఐఏఎస్‌ల బదిలీ
Read Latest AP News And Telugu News