AP GOVT ON Skoch Award: బీసీ అభివృద్ధి ప్రోగ్రాములకు గుర్తింపు – ఏపీకి స్కోచ్ పురస్కారం
ABN , Publish Date - Sep 20 , 2025 | 04:03 PM
బీసీలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గుర్తించడంతో పాటు... పోటీ పరీక్షల్లో బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందజేసినందుకు గానూ సోషల్ జస్టిస్ సెక్యూరిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్కోచ్ అవార్డును ప్రకటించింది. ఈ క్రమంలో మంత్రి సవితకు ఢిల్లీలో ఈ స్కోచ్ అవార్డును అందజేశారు.
ఢిల్లీ, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): బీసీలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను (BC Welfare) గుర్తించడంతో పాటు... పోటీ పరీక్షల్లో బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందజేసినందుకు గానూ సోషల్ జస్టిస్ సెక్యూరిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్కోచ్ అవార్డు (Skoch Award)ను ప్రకటించింది. ఈ క్రమంలో ఏపీ బీసీ, ఈ డబ్ల్యూఎస్, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత (Minister Savita)కు ఇవాళ(శనివారం) ఢిల్లీలో ఈ అవార్డును అందజేశారు. ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డును ఏపీ బీసీ సంక్షేమ శాఖకు ప్రకటించడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా పనిచేస్తామని తెలిపారు మంత్రి సవిత.
ఈ సందర్భంగా మంత్రి సవిత మీడియాతో మాట్లాడారు. బీసీల అభివృద్ధే లక్ష్యంగా టీడీపీ ఆవిర్భవించిందని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు బీసీలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేశారని ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు నాయుడు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యమిస్తున్నారని నొక్కిచెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో బీసీ నిరుద్యోగ యువతకు బీసీ సంక్షేమ శాఖ తరపున పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ (Mega DSC Coaching)కి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చామని వివరించారు మంత్రి సవిత.
అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా 6,470 మందికి ఉచిత శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో శిక్షణ పొందిన వారిలో 246 మంది బీసీ అభ్యర్థులు టీచర్లగా ఎంపికయ్యారని చెప్పుకొచ్చారు. అమరావతిలో ఐదు ఎకరాల్లో బీసీ స్టడీ సర్కిల్ నిర్మిస్తామని అన్నారు. విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, అనంతపురంలో మెగా బీసీ స్టడీ సర్కిళ్లను నిర్మించే ఆలోచన తమ ప్రభుత్వానికి ఉందని మంత్రి సవిత పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
పల్నాడులో రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోను: సీఎం చంద్రబాబు
నాలుగవ రోజుకు సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
Read Latest AP News And Telugu News