JC Prabhakar Reddy: పెద్దారెడ్డీ.. దమ్ముంటే తాడిపత్రికి రా... తేల్చుకుందాం: జేసీ ప్రభాకర్‌రెడ్డి
ABN , Publish Date - Aug 18 , 2025 | 11:40 AM
మాజీ ఎమ్మె్ల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టేందుకు హైకోర్టు అనుమతివ్వడంతో.. మరోసారి కేతిరెడ్డి, జేసీ కుటుంబాల మధ్య వివాదం రాజుకుంది. దమ్ముంటే తాడిపత్రికి రా... తేల్చుకుందాం టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి పెద్దారెడ్డికి సవాల్ విసిరారు.
తాడిపత్రిలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేయింది. హైకోర్టు ఆర్డర్ పుచ్చుకుని వైసీపీ నేత, మాజీ ఎమ్మె్ల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో.. కేతిరెడ్డీ.. దమ్ముంటే రా.. తేల్చుకుందాం.. అంటూ టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి సవాల్ విసిరారు. ఎమ్మెల్యేగా ఉండగా కేతిరెడ్డి, అతడి అనుచర గణం చేసిన దౌర్జన్యాలపై తాడిపత్రి ప్రజలకు జవాబు ఇవ్వాల్సిందేనని అన్నారు. ఎన్ని కోర్టు ఆదేశాలు తెచ్చినా కేతిరెడ్డి తాడిపత్రికి రావడానికి ఒప్పుకోమని అన్నారు. పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రావడం కాదు.. ముందు అక్రమంగా నిర్మించిన ఆ ఇంటి సంగతి చూసుకోవాలని సూచించారు జేసీ ప్రభాకర్. పోలీసులపై అనవసర ఆరోపణలు చేయొద్దని హెచ్చరించారు. మాకు అప్పుడూ.. ఇప్పుడూ గన్‌మెన్లు లేరు.. అయినా కేతిరెడ్డి పెద్దారెడ్డికి మాత్రం గన్‌మెన్ల భద్రత కల్పించిన సంగతి గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.
కానీ, కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తనకు ఎలాంటి కక్ష లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గతంలో టీడీపీ నేతలకు హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రానివ్వలేదని గుర్తుచేశారు. చట్టాలు, న్యాయాలు మీకు మాత్రమే వర్తిస్తాయా.. మా విషయంలో వర్తించవా అని ప్రశ్నించారు.
తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సోమవారం తాడిపత్రికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆగస్టున 18న పెద్దారెడ్డిని భారీ భద్రత నడుమ ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య తాడిపత్రికి తీసుకెళ్లాలని పోలీసులకు కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక మరోవైపు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్యాన శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని తాడిపత్రిలో చేపట్టారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావాలని పిలుపునివ్వడంతో శాంతిభద్రతల విషయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరువర్గాల మధ్య ఢీ అంటే ఢీ వైఖరి ఉన్న కారణంగా పట్టణంలో ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉంది. దీంతో పోలీసు అధికారులు భారీ బలగాలను మోహరించారు. అంతకుముందు, కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు పెద్దారెడ్డికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. గతంలో తన ఆదేశాలు పాటించకపోవడంపై అనంతపురం పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి
కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీ.. తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ వాతావరణం..
భారీ వర్షాలు.. ప్రజలకు మంత్రి గొట్టిపాటి సూచనలివే
Read Latest AP News And Telugu News