అనంతపురం: కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీ.. తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ వాతావరణం..
ABN , Publish Date - Aug 18 , 2025 | 08:51 AM
తాడిపత్రిలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఓ వైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీ.. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపడుతుండటంతో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
తాడిపత్రిలో కేతిరెడ్డి, జేసీ కుటుంబాల మధ్య రాజకీయ కలహాలు నువ్వా నేనా అన్నట్లు సాగుతుంటాయి. ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా వైరం ఉంటుంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని సోమవారం పోలీసులే తాడిపత్రి తీసుకెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే పోలీస్ ఫోర్స్ ఉపయోగించాలని సూచనలు ఇచ్చింది. మరో వైపు తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి శివుడి విగ్రహ ప్రారంభోత్సవం చేపట్టారు. కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. దీంతో ఏమవుతుందననే ఉత్కంఠ నెలకొంది.
హైకోర్టు ఆదేశాలపై తాడిపత్రికి కేతిరెడ్డి
ఓవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీ... మరోవైపు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపట్టడంతో తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. హైకోర్టు ఆదేశాలతో తాడిపత్రి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రెడీ అయ్యారు. శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలంలోని తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి బయలుదేరి వెళ్ళనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకెళ్లాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆయనకు భద్రత కల్పించాల్సిందిగా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు తాడిపత్రిలో ధ్యాన శివుడి విగ్రహావిష్కరణకు జేసీ ప్రభాకర్ రెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. తాడిపత్రిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుందనే అంచనాతో పోలీసులు శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డికి సూచించారు. ఈ మేరకు నోటీసులు కూడా జారీ చేశారు. అయినప్పటికీ.. మేం ఎలాగైనా కార్యక్రమం నిర్వహించి తీరుతామని జేసీ వర్గీయులు పట్టుబట్టినట్లు సమాచారం. దీంతో తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు భారీ బలగాలను మోహరించారు.
ఇంతకుముందు, పెద్దారెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కారణ కేసును విచారించిన హైకోర్టు ఈ 18న తాడిపత్రి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాక, గతంలో తన ఆదేశాలు పాటించకపోవడంపై హైకోర్టు అనంతపురం పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి
కొత్త బార్లకు నేడు నోటిఫికేషన్
మరిన్ని ఏపీ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండిమ