AP Heavy Rains: భారీ వర్షాలు.. ప్రజలకు మంత్రి గొట్టిపాటి సూచనలివే
ABN , Publish Date - Aug 18 , 2025 | 10:01 AM
AP Heavy Rains: వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదేశించారు. ప్రజలకు సమస్యలు తలెత్తకుండా అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు.
అమరావతి, ఆగష్టు 18: రాష్ట్రం వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వర్షాలకు ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాలపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ (Minister Gottipati Ravikumar) ఈరోజు (సోమవారం) సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. ప్రజలకు సమస్యలు తలెత్తకుండా అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రమాదాలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు, ఈదురుగాలులతో కూలిన కరెంటు స్తంభాల పునరుద్ధరణ వెంటనే చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి తనకు నివేదించాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆర్డర్స్ జారీ చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండండి: మంత్రి అనగాని

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం వాయుగుండంగా బలపడడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Satyaprasad) సూచించారు. ఈ ఐదురోజులు వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు. తీర ప్రాంతాల్లోని ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని గమనిస్తూ, అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించాలని రెవెన్యూ అధికారులకు, పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా, గోదావరి నదులకు వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని..ప్రజల ఆస్తి, ప్రాణ రక్షణకు, వరద విపత్తును ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీ.. తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ వాతావరణం..
Read Latest AP News And Telugu News