Share News

AP Police: నూర్‌ మహమ్మద్‌ జిహాద్‌ కోసం పనిచేస్తున్నాడు

ABN , Publish Date - Aug 18 , 2025 | 06:48 AM

నిషేధిత ఉగ్రవాదులతో లింకులు కలిగిన శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన నూర్‌ మహమ్మద్‌ జీహాద్‌ కోసం పనిచేస్తున్నట్లు పోలీసు విచారణలో...

AP Police: నూర్‌ మహమ్మద్‌ జిహాద్‌ కోసం పనిచేస్తున్నాడు

  • పాక్‌ ప్రేరేపిత నిషిద్ధ ఉగ్రవాద గ్రూపుల్లో యాక్టివ్‌గా ఉన్నాడు

  • ధర్మవరం వాసి ఉగ్రలింకులపై శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ

పుట్టపర్తిరూరల్‌, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): నిషేధిత ఉగ్రవాదులతో లింకులు కలిగిన శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన నూర్‌ మహమ్మద్‌ జీహాద్‌ కోసం పనిచేస్తున్నట్లు పోలీసు విచారణలో తేలిందని ఎస్పీ రత్న వెల్లడించారు. పుట్టపర్తిలోని జల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం మీడియాకు ఆమె వివరాలు వెల్లడించారు. రాష్ట్ర కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌కు వచ్చిన సమాచారం మేరకు ధర్మవరంలోని లోనికోట ప్రాంతానికి చెందిన కొత్వాల్‌ నూర్‌ మహమ్మద్‌ను ఈనెల 16న అరెస్టు చేసి, అతడి నుంచి నిషేధిత జాబితాలో ఉన్న 6 పాక్‌ ప్రేరేపిత ఉగ్ర సంస్థలకు సంబంధించిన జిహాదీ సిద్ధాంత పుస్తకాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అతడు పాక్‌ ఉగ్రవాద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న 36 సోషల్‌ మీడియా గ్రూపుల్లో సభ్యత్వం కలిగి ఉన్నట్లు తెలిపారు. ఆరు పాక్‌ ప్రేరేపిత నిషేధిత ఉగ్రవాద గ్రూపుల్లో యాక్టివ్‌గా ఉన్నాడనీ, ఉగ్రవాద భావజాలం కలిగి ఉండి దేశ వ్యతిరేక ప్రచారం, జిహాద్‌ కోసం పనిచేస్తున్నట్లు పోలీసు విచారణలో తేలిందని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన మొబైల్‌ఫోన్‌, ఉగ్రవాద సాహిత్యం ఉన్న పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నామని, అతడి మొబైల్‌ ఫోన్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని వెల్లడించారు. నివేదిక వచ్చిన తర్వాత నిషేధిత ఉగ్రవాద సంస్థల్లో అతడి పాత్ర ఏమిటో, ఎవరెవరితో సంబంధాలున్నాయి.. ఇతర ఉగ్రవాద లింకులు తదితర వివరాలను వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు.

Updated Date - Aug 18 , 2025 | 06:49 AM