Share News

Cyclone Alert: రెయిన్ అలర్ట్.. వాయుగుండం ప్రభావంతో వర్షాలు..

ABN , Publish Date - Jan 10 , 2026 | 07:26 AM

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ఇవాళ (శనివారం), రేపు (ఆదివారం) ఉత్తర శ్రీలంక తీరాన్ని దాటే అవకాశముంది. ఏపీపై ప్రభావం పరిమితంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ప్రజలు, రైతులు, మత్స్యకారులు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండటం అవసరం..

Cyclone Alert: రెయిన్ అలర్ట్.. వాయుగుండం ప్రభావంతో వర్షాలు..

అమరావతి, జనవరి10 (ఆంధ్రజ్యోతి): వాతావరణ పరిస్థితుల్లో ఏర్పడిన మార్పులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. వాయుగుండం వల్ల ఏపీలో ఇవాళ (శనివారం), రేపు (ఆదివారం) వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం (Deep Depression) ప్రస్తుతం దక్షిణ భారత తీరం వైపు పయనిస్తోందని తెలిపారు. వాయుగుండం ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, శ్రీలంక తీర ప్రాంతాల్లో వాతావరణం వేగంగా మారుతోందని పేర్కొన్నారు.


ఏపీలో ప్రభావం..

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం బలపడుతూ కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం ప్రభావం వల్ల ఏపీలోని పలు జిల్లాల్లో వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకొచ్చారు. ఈ వాయుగుండం ప్రభావంతో శని, ఆదివారాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. వాయుగుండం ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో మేఘావృత వాతావరణం నెలకొంది. ముఖ్యంగా తూర్పు దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా వర్షపాతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతితో పాటు మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.


రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్ష సూచన

తీవ్ర వాయుగుండం ప్రభావం ఏపీపై పూర్తిగా లేకపోయినా, దాని అనుబంధ ప్రభావంతో కొన్ని జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లా, రాయలసీమ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రైతులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


నేడు ఉత్తర శ్రీలంక వద్ద తీరం దాటే అవకాశం..

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తీవ్ర వాయుగుండం ఇవాళ లేదా రేపు మధ్యాహ్నం ఉత్తర శ్రీలంకలోని ట్రింకోమలీ – జాఫ్నా మధ్య ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటిన తర్వాత ఇది క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గంటకు సుమారు 13 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం వాయువ్య దిశగా కదులుతోందని తెలిపారు.


శ్రీలంక తీర ప్రాంతాల్లో ప్రభావం..

ఈ వాయుగుండం శ్రీలంక తీరాన్ని దాటే సమయంలో ఆకాశం మేఘావృతంగా ఉండడంతో పాటూ బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సముద్రతీర ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని.. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు.


మత్స్యకారులకు హెచ్చరిక..

నైరుతి బంగాళాఖాతంలో సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలో ఏపీ తీర ప్రాంతాల మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా తీర ప్రాంతాల్లో సముద్రం ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు.


రైతులకు సూచనలు..

వర్ష సూచన ఉన్న జిల్లాల్లోని రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. కోత దశలో ఉన్న పంటలను రక్షించుకోవాలని పేర్కొన్నారు. నీటి నిల్వలు ఏర్పడకుండా చూడాలని తెలిపారు. పంట పొలాల్లో కాలువలు శుభ్రంగా ఉంచాలని సూచించారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


పట్టణ ప్రాంతాల్లో జాగ్రత్తలు..

నెల్లూరు, తిరుపతి వంటి పట్టణాల్లో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలో విద్యుత్ సరఫరాలో స్వల్ప అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని స్థానిక యంత్రాంగం అప్రమత్తంగా ఉందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని సూచించారు.


చలి తీవ్రత..

వర్షాల కారణంగా ప్రస్తుతం ఉన్న చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని వివరించారు. చలి ప్రభావం దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.


అప్రమత్తమైన అధికారులు..

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అన్ని జిల్లాల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించింది. ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని తెలిపారు. అవసరమైతే సహాయక చర్యలు చేపట్టేందుకు రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు.


రాబోయే 48 గంటల పాటు..

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాబోయే 24 నుంచి 48 గంటల్లో వర్ష తీవ్రత క్రమంగా తగ్గే అవకాశం ఉందని తెలిపారు. శ్రీలంక తీరం దాటిన తర్వాత వాయుగుండం బలహీనపడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అయితే స్థానిక వాతావరణ పరిస్థితులను బట్టి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అనూహ్యంగా కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కంచికచర్ల తహసీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం..

శిశువుల విక్రయం కేసులో కొత్త కోణం.. బయటపడుతున్న ఆ గ్యాంగ్ లింకులు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 10 , 2026 | 08:15 AM