Share News

Infant Trafficking Case: శిశువుల విక్రయం కేసులో కొత్త కోణం.. బయటపడుతున్న ఆ గ్యాంగ్ లింకులు

ABN , Publish Date - Jan 09 , 2026 | 10:08 AM

శిశువుల విక్రయం కేసులో పసికందులంతా తల్లిదండ్రులు విక్రయించినవారే అని అంతా అనుకున్నారు. ఢిల్లీ ముఠాలో పనిచేసి ముంబయిలోని థానే జైల్లో ఉన్న అనిల్‌బాబా కైర్ గురించి తెలిసిన తర్వాత.. కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. గత ఏడాది మార్చిలో నగరంలో శిశువులను విక్రయిస్తుండగా పోలీసులు సరోజిని గ్యాంగ్‌ను పట్టుకున్నారు..

Infant Trafficking Case: శిశువుల విక్రయం కేసులో కొత్త కోణం.. బయటపడుతున్న ఆ గ్యాంగ్ లింకులు
Infant Trafficking Case

  • పాపం పసివారు

  • శిశువుల విక్రయం కేసులో కొత్తకోణం

  • అమ్మ పొత్తిళ్ల నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చారా?

  • ఢిల్లీ, ముంబయి ముఠాలపై అనుమానాలు

  • దర్యాప్తులో బయటపడుతున్న ప్రధాన లింక్‌లు

  • కిడ్నాప్‌లో ఆరితేరిన అనిల్‌బాబా ప్రమేయం

  • పీటీ వారెంట్‌పై తీసుకొస్తున్న పోలీసులు

  • సరోజినీకి శిశువులను అప్పగించిన ముఠాలో అనిల్

శిశువుల విక్రయం కేసులో (infant trafficking Case) ప్రధాన నిందితురాలు బలగం సరోజిని వెనుక మరో కోణం ఏమైనా ఉందా? అసలు ఆమె విక్రయించిన ఆ శిశువులు ఎవరు? వారిని పోషించే సామర్థ్యం లేక తల్లిదండ్రులే విక్రయించారా? లేదా ఆస్పత్రుల నుంచి ఎత్తుకొచ్చారా? కిడ్నాప్ చేశారా? ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు కలుగుతున్న అనుమానాలివి..

(ఆంధ్రజ్యోతి-విజయవాడ): శిశువుల విక్రయం కేసులో బయటపడిన పసికందులంతా తల్లిదండ్రులు విక్రయించినవారే అని అంతా భావించారు. అయితే ఢిల్లీ ముఠాలో పనిచేసి ముంబయిలోని థానే జైల్లో ఉన్న అనిల్‌బాబా కైర్ గురించి తెలిసిన తర్వాత కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. గత ఏడాది మార్చిలో నగరంలో శిశువులను విక్రయిస్తుండగా పోలీసులు సరోజిని గ్యాంగ్‌ను పట్టుకున్నారు. మొత్తం ఏడుగురు శిశువులను సంరక్షణ కేంద్రాలకు తరలించారు. సరోజినితో పాటు 18 మందిని అరెస్టు చేశారు. దీనిపై మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. సరోజిని గ్యాంగ్‌కు సంకెళ్లు పడ్డాక ఢిల్లీకి చెందిన కిరణ్ శర్మ, బర్తీ పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ ఇద్దరినీ కొద్దిరోజుల క్రితం పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ గ్యాంగ్‌లో ఒకడైన అనిల్‌బాబా కైర్.. థానే జైల్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో అతడిపై పీటీ వారెంట్ జారీ చేసి కోర్టు అనుమతి తీసుకున్నారు.


కవితకు రిమాండ్..

ముంబయి ముఠాలో ఉన్న కవిత ప్రతాప్ జాదవ్‌ను పోలీసులు గురువారం కోర్టులో హాజరుపరిచారు. ఆమెను ముంబైలోని థానేలో అరెస్టు చేసి అక్కడి కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే. ట్రాన్సిట్ వారెంట్‌పై కవితను పోలీసులు విజయవాడ తీసుకొచ్చారు. చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు న్యాయాధికారి రాధారాణి ఎదుట హాజరుపరచగా, ఈనెల 21 వరకు రిమాండ్ విధించారు. అనంతరం విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. భవానీపురం పోలీసులు నమోదు చేసిన కేసులో కవితను నిందితురాలిగా చూపించారు.


అనుమానానికి అదే కారణం..

అనిల్‌బాబాపై కుల్గావ్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పన్నెండేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, రూ.20 లక్షలు డిమాండ్ చేశాడు. దీనిపై ఆ బాలిక తల్లిదండ్రులు కుల్గావ్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. ఈ కేసే విజయవాడ పోలీసులకు కొత్త అనుమానాలను రేకెత్తించింది. కేసు ప్రాథమిక దర్యాప్తులో ఢిల్లీ గ్యాంగ్ వేరు, ముంబయి ముఠా వేరు అని పోలీసులు భావించారు. నిందితులను అరెస్టు చేసే కొద్దీ కొత్తకొత్త కోణాలు, లింక్‌లు బయటపడుతున్నాయి. ఢిల్లీ, ముంబయి ముఠాలకు అవినాభావ సంబంధాలు ఉన్నాయని ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తులో తేలిపోయింది. ముంబయి ముఠాలో ఉన్న సతీష్, ప్రస్తుతం జైల్లో ఉన్న అనిల్‌కు బంధుత్వం ఉంది. సరోజినీకి ఏడుగురు శిశువులను అందజేసిన ముఠాలో అనిల్‌ ఉన్నాడు.


ఈ గ్యాంగ్‌లు సరోజిని చేతుల్లో పెట్టిన శిశువులను కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారుల అక్రమ రవాణాకు సంబంధించిన మొత్తం లింకులు బయటకు లాగాలని పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు అధికారులను ఆదేశించారు. ఈ కేసు దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతలను పరిపాలన డీసీపీ కేజీవీ సరితకు అప్పగించారు. గురువారం ఆమె సీపీతో సమావేశమై ఇప్పటివరకు సాగిన దర్యాప్తు గురించి వివరించారు. కిడ్నాప్ కేసులో అనిల్ నిందితుడిగా ఉండటంతో ఈ చిన్నారులను కిడ్నాప్ చేసి అమ్మకానికి పెట్టారని భావిస్తున్నారు. కేసులో నిందితుల ఆరెస్టులు జరుగుతున్న కొద్దీ కొత్త లింక్‌లు పోలీసులకు చిక్కుతున్నాయి. దశలవారీగా ఈ శిశువుల ముఠాల వ్యవహారాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. కిరణ్ శర్మ టీంలో ఉన్న ప్రియాంక కోసం ఢిల్లీలో పోలీసులు గాలిస్తున్నారు. గుజరాత్‌లోని వడోదరలో అరెస్టు చేసిన సతీష్ బాబా కైర్‌ను టాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తీసుకొస్తున్నారు. ముంబయి జైల్లో ఉన్న అనిల్‌ను విజయవాడకు శనివారం తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చ

భక్తులకు అలర్ట్.. ఆ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 09 , 2026 | 10:31 AM