భాగ్యనగరంలో భారీ వర్షం.. మరికొన్ని గంటలపాటు వర్ష సూచన
ABN , Publish Date - Jun 06 , 2026 | 05:29 PM
భాగ్యనగరంలో శనివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఉక్కపోతతో ఇబ్బందిపడ్డ నగరవాసులకు భారీ వర్షం ఉపశమనం కలిగించింది.
హైదరాబాద్, జూన్6 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలో ఈరోజు (శనివారం) సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఉక్కపోతతో ఇబ్బందిపడ్డ నగరవాసులకు భారీ వర్షం ఉపశమనం కలిగించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడగా, ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అలాగే ఖైరతాబాద్, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్ ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. ఉప్పల్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, నిజాంపేట, శంషాబాద్, రాజేంద్రనగర్, గోల్కొండ ప్రాంతాల్లో కూడా వర్షం కురవడంతో నగరమంతా తడిసిముద్దైంది.
వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. రహదారులపై వాహనాలు నెమ్మదిగా కదిలాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, పంజాగుట్ట, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం పడటంతో ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ ఉండటంతో ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు వాహనదారులు అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు.
ఇక వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో మరికొన్ని గంటల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, నీటిమునిగిన రహదారులపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు, వర్షంతో నగరంలో ఉష్ణోగ్రతలు తగ్గి ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లో కురిసిన ఈ వర్షం వేసవి వేడిమి నుంచి నగరవాసులకు తాత్కాలిక ఉపశమనం కలిగించింది.
ఈ వార్తలు కూడా చదవండి...
రెండేళ్ల ప్రజా తీర్పు.. ఏపీ అభివృద్ధికి నాంది: చంద్రబాబు
పవన్ తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు: రాంచందర్ రావు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News