బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’
ABN , Publish Date - Oct 26 , 2026 | 09:14 PM
బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా ‘అర్నబ్’ బలపడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. రానున్న 12 గంటల్లో అతి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని తెలిపారు.
అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా ‘అర్నబ్’ బలపడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. రానున్న 12 గంటల్లో అతి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని తెలిపారు. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా తుఫాన్ కదులుతోందని చెప్పారు. విశాఖపట్నం, గోపాల్‌పూర్‌కు 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపారు. కాకినాడకు 560 కిలోమీటర్ల, మచిలీపట్నానికి 660, బాపట్లకు 730 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వివరించారు. ఎల్లుండి ఉదయం బాపట్ల - విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు.
తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రఖర్ జైన్ తెలిపారు. గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అన్నారు. రేపు(మంగళవారం), ఎల్లుండి (బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. అక్కడక్కడా అత్యంత భారీ వానలు పడతాయని వెల్లడించారు. రేపు (మంగళవారం) కోస్తా తీరం వెంబడి గంటకు 90 నుంచి 100 వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. చెట్లు, భారీ హోర్డింగులు, శిథిల భవనాల వద్ద ఉండవద్దని హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్ష సూచన ఉందని తెలిపారు.
శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ప్రఖర్ జైన్ అన్నారు. పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. బుధవారం విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అత్యంత భారీ వర్ష సూచన ఉందని తెలిపారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో 8 ఎస్‌డీఆర్‌ఎఫ్, 7 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
అదనంగా 3 ఎస్‌డీఆర్‌ఎఫ్, 5 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. 115 చెట్ల తొలగింపు బృందాలు, 13 పడవలతో రక్షణ బృందాలు సిద్ధమయ్యాయని తెలిపారు. తుఫాన్ సహాయక చర్యల కోసం ఏపీ ప్రభుత్వం రూ.27 కోట్లు విడుదల చేసిందని వివరించారు. 7 జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున.. 13 జిల్లాలకు రూ.కోటి చొప్పున నిధులను కేటాయించినట్లు వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం
జడ్పీ పీఠాలపై కూటమి కసరత్తు.. చంద్రబాబుతో భేటీ తర్వాతే క్లారిటీ!
రక్షణ రంగంలో ఏపీకి బిగ్ బూస్ట్.. రూ. 2, 500 కోట్లతో BEL ప్రాజెక్టు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News