అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో వర్షాలు
ABN , Publish Date - May 10 , 2026 | 04:32 PM
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. బీహార్ నుంచి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
అమరావతి, మే 10 (ఆంధ్రజ్యోతి): అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. బీహార్ నుంచి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు శ్రీలంక ప్రాంతాల వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపారు. ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో గురువారం వరకు, రాయలసీమ ప్రాంతాల్లో మంగళవారం వరకు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు.
కోస్తాంధ్రలో భారీ వర్షాలు
వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఉత్తర కోస్తా, మధ్య కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని తెలిపారు. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సముద్ర తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
రాయలసీమ జిల్లాలకు అలర్ట్
రాయలసీమ ప్రాంతాల్లో కూడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని ప్రజలకు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
ప్రజలకు కీలక సూచనలు
వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని.. సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని తెలిపారు. పాత భవనాలు, భారీ హోర్డింగ్స్ దగ్గర నిలబడకూడదన్నారు. విద్యుత్ స్తంభాలు, చెట్లకు దూరంగా ఉండాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. వర్షం, పిడుగులు పడే సమయంలో పొలాల్లో పనిచేయకూడదని సూచించారు. ప్రత్యేకంగా పశుకాపరులు చెట్ల కిందకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. పశువులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ప్రజలు వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసే హెచ్చరికలను నిరంతరం గమనించాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్
జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం
సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News