Share News

మహాలక్ష్మికి స్మార్ట్‌ కార్డులు..

ABN , Publish Date - May 28 , 2026 | 12:46 PM

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి, దుర్వినియోగాన్ని అరికట్టడానికి ప్రభుత్వ ప్రత్యేకంగా మహాలక్ష్మి స్మార్ట్‌ కార్డుల జారీ చేయనున్నది.

మహాలక్ష్మికి స్మార్ట్‌ కార్డులు..
Mahalaxmi smart cards

  • మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి జారీ

  • జూన్‌ 2 నుంచి పంపిణీకి ఆర్టీసీ కసరత్తు

  • ఇక ఆధార్‌ కార్డు అవసరం ఉండదు

  • దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం

  • తొలుత ప్రయోగాత్మకంగా ప్రతీ జిల్లాలో ఒక మండలంలో జారీ

  • కార్డుల కోసం ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు

  • ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌లో కేంద్రాల సమాచారం

హనుమకొండ: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి, దుర్వినియోగాన్ని అరికట్టడానికి ప్రభుత్వ ప్రత్యేకంగా మహాలక్ష్మి స్మార్ట్‌ కార్డుల జారీ చేయనున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో విద్యార్థులకు రాయితీ, ఉద్యోగులకు, ఇతరులకు నెలవారీగా సీజన్‌ పాస్‌ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో మహాలక్ష్మిలకు స్మార్ట్‌ కార్డులు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించింది. ప్రస్తుతం ఆధార్‌ కార్డు చూపించి మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇక నుంచి ఆధార్‌ కార్డుకు బదులు స్మార్ట్‌ కార్డు చూపించాల్సి ఉంటుంది.


జూన్‌ 2 నుంచి జారీ

స్మార్ట్‌ కార్డులు వచ్చే నెల 2వ తేదీ నుంచి అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బడ్జెట్‌ సన్నాహక సమావేశం లో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఆర్టీసీ ఎం.డి.నాగిరెడ్డి ఈ విషయమై సమీక్షించారు. 2026-27 రాష్ట్ర బడ్జెట్‌లో ఆర్టీసీకి నిధుల కేటాయింపు ప్రతిపాదలను ఆర్థిక శాఖ మంత్రికి ఎం.డి. నాగిరెడ్డి వివరించడం తోపాటు స్మార్ట్‌ కార్డుల జారీకి సంబంధించిన వ్యయం గురించి వివరించారు. ఇందుకు ఆమోదం తెలుపడంతో తొలుత జిల్లాకు ఒక మండలాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకొని, సాంకేతిక సమస్యలు పరిష్కరించుకొని జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై కసరత్తు జరుగుతోంది. స్మార్ట్‌ కార్డుకు సంబంధించిన విధివిధానాలు ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌ పరిధిలోని అధికారులకు ఇంకా అందలేదు. త్వరలో సమాచారం అందే అవ కాశం ఉన్నట్టు చెబుతున్నారు.


hnk2.jpgఏటీఎం తరహాలో కార్డు

ఏటీఎం తరహాలో చిప్‌తో కూడిన స్మార్ట్‌ కార్డు జారీ చేస్తారు. ముందుగా ఆధార్‌ కార్డు, ఒక ఫొటో సేకరించి మహాలక్ష్ముల ప్రాథమిక సమాచారం చిప్‌తో అనుసంధానిస్తారు. ఈ స్మార్ట్‌ కార్డులో లబ్ధిదారుడి పూర్తి వివరాలు, ఫొటో, క్యూఆర్‌ కోడ్‌ ఉంటాయి. తర్వాత వారి పేర్లతో కార్డు జారీ చేస్తారు. అమల్లోకి వచ్చాక స్మార్ట్‌కార్డు చూపకుంటే ఉచిత ప్రయాణానికి అనుమతివ్వరు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 9డిపోల పరిధిలో నెలకు సగటున 1.12కోట్ల మంది, ఏడాదికి 13.33 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు.


దుర్వినియోగానికి చెక్‌

ఇతర రాష్ట్రాల వారు నకిలీ ఆధార్‌ కార్డులతో ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్న ఘటనలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. బతుకు తెరువు కోసం పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలస వచ్చిన వేలాది మహిళా కూలీలు, ప్రైవేటు ఉద్యోగులు, నకిలీ ఆధార్‌ కార్డుల సాయంతో బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. దీని వల్ల ఆర్టీసీకి పెద్ద మొత్తంలో ఆదాయానికి గండి పడుతోంది. ఈ పథకం అమలులోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. కార్డుల జారీ దరఖాస్తు చేసుకునే విధానం, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి, సమీప కార్డుల జారీ కేంద్రాన్ని కనుగొనడానికి టీఆర్‌ఎస్‌ఆర్‌టీసీ అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి సమారాన్ని త్వరలో పొందుపరుస్తారు. కార్డులు అందే వరకు ఆధార్‌ కార్డు చూపించి మహిళళు ఉచితంగా ప్రయాణించవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి:

అవలాంజి అటవీ ప్రాంతంలో తెల్ల పులి సంచారం

అడవి దారుల్లో బొమ్మల కళ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 28 , 2026 | 12:46 PM