వైభవ్ సూర్యవంశీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
ABN , Publish Date - May 28 , 2026 | 11:42 AM
వైభవ్ సూర్యవంశీ ఆస్తులకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్ ఆదాయం, ఇళ్లు, అవార్డులు.. అన్నీ కలిపి అతడి నెట్‌వర్త్ సుమారు రూ.7 కోట్ల వరకు ఉంటుందని అంచనా. స్పాన్సర్‌షిప్ ఒప్పందాలు కలిపితే ఈ మొత్తం రూ.10 కోట్లకు పైగానే ఉండొచ్చని సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు ప్రపంచ క్రీడా వర్గాల్లో మార్మోగిపోతోంది. 15 ఏళ్లకే తన బ్యాటింగ్‌తో రికార్డులు కొల్లగొడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఐపీఎల్ 2026 ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అయితే ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఆస్తులకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్ ఆదాయం, ఇళ్లు, అవార్డులు.. అన్నీ కలిపి అతడి నెట్‌వర్త్ సుమారు రూ.7 కోట్ల వరకు ఉంటుందని అంచనా. స్పాన్సర్‌షిప్ ఒప్పందాలు కలిపితే ఈ మొత్తం రూ.10 కోట్లకు పైగానే ఉండొచ్చని సమాచారం.
వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరఫున 2025లో క్రికెట్ అరంగేట్రం చేశాడు. అప్పుడు వైభవ్‌కు 14 ఏళ్లు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్ఆర్ ఫ్రాంచైజీ అతడిని ఏకంగా రూ. 1.1 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. 14 ఏళ్ల కుర్రాడికి అంత మొత్తం పెట్టడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కానీ ఆడిన మూడో మ్యాచ్‌లోనే 35 బంతుల్లో సెంచరీ బాదేశాడు. అక్కడ మొదలైన విధ్వంసం.. ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. వైభవ్ ప్రస్తుత ప్రదర్శనలు చూస్తే ఆ మొత్తం చాలా తక్కువనేనని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు అతడి సంపాదన, బ్రాండ్ విలువ అమాంతం పెరిగిపోయినట్లు తెలుస్తోంది.
వైభవ్ సూర్యవంశీకి ముంబైలో రూ.3 కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్‌మెంట్ ఉంది. అతడి స్వస్థలం బిహార్‌లోని సమస్తిపూర్‌లో రూ.60లక్షల విలువ చేసే ఇల్లు ఉంది. ఐపీఎల్ కాంట్రాక్టుల ద్వారా వైభవ్ భారీగా సంపాదిస్తున్నాడు. ప్రతి సీజన్‌కు రూ.1.1 కోట్ల జీతం అందుకుంటున్న అతడు.. మ్యాచ్ ఫీజుల రూపంలో కూడా అదనంగా డబ్బు సంపాదిస్తున్నాడు. ఒక్కో మ్యాచ్‌కు రూ.7.5 లక్షల చొప్పున ఇప్పటివరకు 22 మ్యాచ్‌లు ఆడినందుకు సుమారు రూ.1.65 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు అవార్డులు, బహుమతులు కూడా అతడి సంపాదనలో భాగమయ్యాయి. ఐపీఎల్ 2025లో అత్యధిక స్ట్రైక్‌రేట్ సాధించినందుకు టాటా కర్వ్ ఈవీ కారును బహుమతిగా అందుకున్నాడు. దీని విలువ సుమారు రూ.17 లక్షలు.
అండర్-19 ప్రపంచకప్ 2026 ఫైనల్లో భారత్‌కు విజయం అందించిన తర్వాత అప్పటి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వైభవ్‌కు రూ.50 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు. ఇక బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, స్పాన్సర్‌షిప్ డీల్స్ కూడా వైభవ్ సంపాదనను భారీగా పెంచుతున్నాయి. ఐపీఎల్ ఆదాయం, ఇళ్లు, బహుమతులు కలిపి అతడి నెట్‌వర్త్ సుమారు రూ.7 కోట్ల వరకు ఉంటుందని అంచనా. స్పాన్సర్‌షిప్ ఒప్పందాలు కలిపితే ఈ మొత్తం రూ.10 కోట్లకు పైగానే ఉండొచ్చని సమాచారం.
ఇవి కూడా చదవండి:
వైభవ్ దూకుడును ఎలా ఆపాలి? జోఫ్రా ఆర్చర్ సమాధానం ఇదే..
వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్