కార్తెలు మారిపోతున్నా.. చినుకుల జాడ కనిపించడం లేదు
ABN , Publish Date - Jul 03 , 2026 | 11:55 AM
రోజులు గడుస్తున్నాయి.. కార్తెలు మారిపోతున్నాయి.. చినుకుల జాడ కనిపించడం లేదు.
లోటు వర్షపాతంతో ఊపందుకొని సాగు
పది మండలాల్లో అతితక్కువగా కురిసిన వాన
ఐదు మండలాల్లో సాధారణం
మూడు మండలాల్లో అధికం
భారీ వర్షాలు లేక వెనుకబడిన వ్యవసాయం
జిల్లాలో 70 ఎకరాల్లో మాత్రమే వరినాట్లు
మహబూబాబాద్: రోజులు గడుస్తున్నాయి.. కార్తెలు మారిపోతున్నాయి.. చినుకుల జాడ కనిపించడం లేదు.. ఆశగా ఆకాశం వైపు ఎదురు చూస్తున్న రైతులకు వరుణదేవుడు కరుణించడం లేదు. ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతులకు వ్యవసాయ పండుగే.! సాధారణంగా జేష్టపౌర్ణమి రోజున నూతన వ్యవసాయ సీజన్‌కు శ్రీకారం చుట్టడం ఆనవాయితీ. ఈ సారి వానలు కురవకపోవడంతో వర్షాకాలపు వ్యవసాయ పనులకు నాంది పలికే పౌర్ణమి వెలవెలబోయింది. ప్రకృతి ప్రకోపమా? లేక మానవ తప్పిదమా! ఏదేమైనా కానీ., ప్రస్తుతం వర్షాకాలంలో వర్షాలు లేక సాగు ముందుకు సాగడం లేదు. జూన్ నెల మాసంలో సాధారణ వర్షపాతం కంటే 20 శాతం లోటు వర్షాలు కురిశాయి. దాంతో మహబూబాబాద్ జిల్లాలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు కేవలం 70 ఎకరాల్లో మాత్రమే వరినాట్లు పడగా, ఇతర పంటలు 42,494 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.
వర్షపాతం ఇలా..
జూన్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ నెల రోజుల కాలంలో గతేడాది సగటున 91.6 మిమ్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఈ ఏడాది జూన్ మాసంలో 139.8 మిమ్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ రోజు వరకు 111.6 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే సగటున 20 శాతం లోటు వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లాలోని పది మండలాలైన కొత్తగూడ, గంగారం, కురవి, మహబూబాబాద్, గూడూరు, కేసముద్రం, నెల్లికుదురు, చిన్నగూడూరు, దంతాలపల్లి, ఇనుగుర్తిలలో అతితక్కువ వర్షం కురిసింది. ఐదు మండలాలైన బయ్యారం, డోర్నకల్, నర్సింహులపేట, తొర్రూరు, సీరోలులలో సాధారణ వర్షపాతం నమోదైంది. మూడు మండలాలైన గార్ల, మరిపెడ, పెద్దవంగర అధికంగా వర్షం కురిసింది. సగటున జిల్లాలో 139.8 మిల్లీమీటర్ల వర్షం కురియాల్సి ఉండగా, 111.6 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. సాధారణ వర్షపాతంతో పోలిస్తే 20 శాతం వర్షపాతం లోటు నమోదైంది. దీంతో రైతాంగానికి వర్షాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.
నెమ్మదించిన సాగు..
జిల్లా వ్యాప్తంగా 4,46,350 ఎకరాల్లో పంటల సాగు చేస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేయగా వర్షాలు లేక పంటల సాగు నెమ్మదించింది. గత జూన్ నెలలో 42,494 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేశారు. 35,015 ఎకరాల్లో ఇప్పటి వరకు పత్తి సాగు చేశారు. జొన్నలు 36 ఎకరాల్లో, వరి 70 ఎకరాల్లో, మొక్కజొన్న 5,297 ఎకరాల్లో, కందులు 137 ఎకరాల్లో, పెసళ్లు 1,930 ఎకరాల్లో, మినుములు 4 ఎకరాల్లో, వేరుశనగ 5 ఎకరాల్లో సాగు చేస్తుండగా 32,650 ఎకరాల్లో వరి నారుపోసుకుని నాట్లు వేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. ప్రతీ రోజు సాయంత్రం కాగానే ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకుని దోబూచులాడుతూ.. వెళ్లిపోవడంతో రైతాంగం వర్షాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.
తగ్గని ఉష్ణోగ్రతలు..
వానాకాలం ప్రవేశించి జూన్ నెల గడిచినప్పటికీ వర్షాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఎండలు దంచికొడుతూనే ఉన్నాయి. జూన్ 23 వరకు 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెండోవారంలో 42.7 వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వారం రోజుల్లో 38.3 డిగ్రీల వరకు ఎండలు నమోదవుతున్నాయి. వర్షాలు పడక రైతులు అల్లాడిపోతున్నారు.
చెరువుల్లో ఇలా..
మహబూబాబాద్ జిల్లాలో వర్షాలేక చెరువులన్నీ వెలవెలబోతున్నాయి. దాంతో పాటు ఆకేరు, మున్నేరు, పాకాల వాగుల్లో కూడా నీరులేక రాళ్లుతేలాయి. జిల్లాలో 1,590 చెరువులు ఉండగా అందులో 1,571 చెరువుల్లో 0-25 శాతం వరకు నీరు ఉంది. వీటిలో బాగా నీరులేక దర్శనమిస్తున్నా యి. పెద్దవంగర మండలంలోని 17 చెరువుల్లో 25-50 శాతం వరకు నీరు చేరగా, తొర్రూరు మండలంలో రెండు చెరువుల్లో మాత్రం 50-75 శాతం వరకు నీరు చేరిందని నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. ఒక్క పెద్దవంగర, తొర్రూరు మండలాల చెరువుల్లో నీరు చేరుతుండడంతో ఆ ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వర్షాల కోసం ఎదురుచూస్తున్నాం..
మునిగేటి మల్లయ్య రైతు, ఉగ్గంపల్లి
నాకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో కొంత పొలం చేయడానికి నారు పోసుకున్నా.. నాట్లు వేయడానికి భారీ వర్షాల కోసం ఎదురుచూస్తున్నా వర్షం కురియడం లేదు. వర్షం ఎప్పుడు పడుతుందా అని ఎదురుచూస్తున్నాం. ఈ సంవత్సరం వర్షాలు ఇంకా కురియకపో వడంతో ఆందోళన చెందుతున్నా.
ఈ వార్తలు కూడా చదవండి:
చర్లపల్లి-షాలిమార్ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News