Share News

తక్షశిలకు మరమ్మతులు చేపట్టిన పాక్.. యునెస్కో తీవ్ర ఆగ్రహం..

ABN , Publish Date - Jul 03 , 2026 | 10:26 AM

పాకిస్థాన్‌లోని ప్రాచీన పురావస్తు క్షేత్రం తక్షశిలలో ప్రభుత్వం చేపట్టిన సంరక్షణ పనులపై యునెస్కో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రపంచ వారసత్వ జాబితాలో ఉన్న ఈ చారిత్రక కట్టడాల్లో చేపట్టిన పనులు అసలు నిర్మాణాల ప్రామాణికత, చారిత్రక విలువను దెబ్బతీసేలా ఉన్నాయని హెచ్చరించింది.

తక్షశిలకు మరమ్మతులు చేపట్టిన పాక్.. యునెస్కో తీవ్ర ఆగ్రహం..

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని ప్రాచీన పురావస్తు క్షేత్రం తక్షశిలలో ప్రభుత్వం చేపట్టిన సంరక్షణ పనులపై యునెస్కో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రపంచ వారసత్వ జాబితాలో ఉన్న ఈ చారిత్రక కట్టడాల్లో చేపట్టిన పనులు అసలు నిర్మాణాల ప్రామాణికత, చారిత్రక విలువను దెబ్బతీసేలా ఉన్నాయని హెచ్చరించింది. ఈ మేరకు పనులను వెంటనే నిలిపివేయకపోతే తక్షశిలను 'వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్' జాబితాలో చేర్చడంతో పాటు, అవసరమైతే ప్రపంచ వారసత్వ హోదానూ రద్దు చేస్తామని పాకిస్థాన్ అధికారులను హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి.


ఐదు శతాబ్దాల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం..

పంజాబ్ ప్రావిన్స్‌లోని రావల్పిండి జిల్లాలో ఉన్న తక్షశిల.. దక్షిణాసియాలోనే అత్యంత ప్రాచీన బౌద్ధ విద్యా కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. మెసోలిథిక్ కాలానికి చెందిన గుహ, నాలుగు ప్రాచీన పట్టణాల అవశేషాలు, బౌద్ధ విహారాలు, మసీదు, మదరసా వంటి నిర్మాణాలతో ఈ ప్రాంతం విశేష చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉంది. భారత ఉపఖండంలోని పట్టణ నాగరికత అభివృద్ధికి తక్షశిల ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోందని యునెస్కో పేర్కొంటోంది.


పర్యాటకుడి ఫిర్యాదుతో..

ఈ ఏడాది మార్చిలో ఓ సందర్శకుడు తక్షశిలలో జరుగుతున్న పనులకు సంబంధించిన ఫొటోలు, వివరాలను ప్యారిస్‌లోని పాకిస్థాన్ శాశ్వత ప్రతినిధి కార్యాలయానికి పంపించాడు. అసలు రాతి గోడలను తొలగించి కొత్త నిర్మాణాలు చేపట్టడం, పాత గోడల ఎత్తు పెంచడం వంటి చర్యలు చారిత్రక కట్టడాల ప్రామాణికతకు విఘాతం కలిగిస్తున్నాయని ఆయన ఫిర్యాదు చేశారు.


సిమెంట్‌తో గోడలు.. యునెస్కో ఆగ్రహం..

ఈ ఫిర్యాదులతో జూన్ 12న యునెస్కో ప్రతినిధులు, పాకిస్థాన్ పురావస్తు శాఖ (DOAM), జాతీయ వారసత్వ మంత్రిత్వ శాఖ అధికారులు కలిసి తక్షశిల మ్యూజియాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మొహ్రా మొరాడు, సిర్కాప్ ప్రాంతాల్లో చేపట్టిన పనులకు సంబంధించిన పూర్తి సాంకేతిక పత్రాలను పంజాబ్ పురావస్తు శాఖ సమర్పించలేకపోయినట్లు సమాచారం. అంతేకాకుండా ప్రపంచ వారసత్వ కట్టడాల గోడలను సిమెంట్‌తో నిర్మించడం, పురాతన గోడల స్థానంలో కొత్త రాతి నిర్మాణాలు చేపట్టడం, గోడల ఎత్తును పెంచడం వంటి చర్యలు యునెస్కో నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు. పాత రాళ్లకు, కొత్త నిర్మాణ సామగ్రికి మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోందని తెలిపారు.


వారసత్వ హోదాకే ముప్పు..

ప్రపంచ వారసత్వ కట్టడాల్లో ఇటువంటి మార్పులు చేయడం తీవ్ర ఉల్లంఘనగా పరిగణిస్తామని యునెస్కో స్పష్టం చేసింది. దీంతో తక్షశిల ప్రపంచ వారసత్వ హోదా ప్రమాదంలో పడే అవకాశం ఉందని, ఇదే పరిస్థితి కొనసాగితే 'డేంజర్ లిస్ట్'లో చేర్చడంతో పాటు అవసరమైతే జాబితా నుంచి పూర్తిగా తొలగించే అవకాశమూ ఉందని హెచ్చరించింది. ప్రస్తుతం మరో 24 చారిత్రక ప్రాంతాలకు ప్రపంచ వారసత్వ హోదా పొందేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలపైనా ఈ వివాదం ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.


పంజాబ్ పురావస్తు శాఖ వివరణ

అయితే, ఈ ఆరోపణలను పంజాబ్ పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ మాలిక్ జహీర్ అబ్బాస్ ఖండించారు. ప్రస్తుతం జరుగుతున్నవి 'పునర్నిర్మాణ పనులు కావు.. సంరక్షణ చర్యలు మాత్రమే' అని ఆయన స్పష్టం చేశారు. శిథిలావస్థకు చేరుతున్న నిర్మాణాలను మరింత దెబ్బతినకుండా కాపాడటం, వాటి అసలు స్వరూపాన్ని సంరక్షించడమే లక్ష్యమని చెప్పారు. ఈ మేరకు చేపట్టిన పనులను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదని పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ మాలిక్ జహీర్ అబ్బాస్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

బాలుడి ప్రాణం తీసిన గబ్బిలం.. ముఖంపై వాలటంతో..

తండ్రి అంత్యక్రియలకు మొజ్తాబా ఖమేనీ హాజరు కారు: ఇరాన్ అధికారి

Updated Date - Jul 03 , 2026 | 10:28 AM