Share News

తండ్రి అంత్యక్రియలకు మొజ్తాబా ఖమేనీ హాజరు కారు: ఇరాన్ అధికారి

ABN , Publish Date - Jul 02 , 2026 | 07:51 PM

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనరని ఆయన ప్రతినిధి తెలిపారు. భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

తండ్రి అంత్యక్రియలకు మొజ్తాబా ఖమేనీ హాజరు కారు: ఇరాన్ అధికారి
Iran Supreme Leader Mojtaba To Not Attend Father's Funeral

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తన తండ్రి, మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనరని ఆయన వ్యక్తిగత ప్రతినిధి అయతొల్లా హకీమ్ ఎలాహీ తెలిపారు. తండ్రి అంత్యక్రియలకు ఆయన వెళ్లడం భద్రతా కారణాల రీత్యా సాధ్యం కాదని చెప్పారు. ఇజ్రాయెల్‌తో ఇప్పటికీ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ‘నేను గత వారం ఇరాన్‌కు వెళ్లాను. సుప్రీం లీడర్‌తో టచ్‌లో ఉన్నవాళ్లతో మాట్లాడాను. ఆయన బయటకు రావాలనే అనుకుంటున్నారు. కానీ భద్రతా సిబ్బంది మాత్రం ఇందుకు అంగీకరించట్లేదు. ఈ పరిస్థితుల్లో ఆయనను బయటకు వెళ్లనిస్తే ప్రమాదమని, తగిన భద్రతను తాము కల్పించలేమని వారు అంటున్నారు’ అని హకీమ్ చెప్పారు.


అయతొల్లా ఖమేనీ మరణం నుంచి ఇరాన్ ఇంకా కోలుకోలేదని హకీమ్ అన్నారు. దేశ ప్రజలు విచారంలో కూరుకుపోయారని చెప్పారు. తమ ఆత్మ, అస్తిత్వాన్ని కోల్పోయినట్టు ఇరాన్ ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఆయన లోటును భర్తీ చేయడం సాధ్యం కాదని అన్నారు. అంత్యక్రియల కోసం టెహ్రాన్‌కు బయలుదేరే ముందు హకీమ్ మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు. మరో రెండు రోజుల్లో జరగనున్న అంత్యక్రియలకు వేల సంఖ్యలో ప్రజలు హాజరుకానున్నారు. పలు దేశాల ప్రతినిధులు కూడా ఈ అంత్యక్రియల్లో పాల్గొంటారు.


ఈ వార్తలనూ చదవండి:

బాలుడి ప్రాణం తీసిన గబ్బిలం.. ముఖంపై వాలటంతో..

చర్చలు సానుకూలంగా సాగుతున్నాయి.. దోహా సమావేశాలపై ఖతార్ ఆశాభావం..

Updated Date - Jul 02 , 2026 | 08:24 PM