ఫిఫా వరల్డ్ కప్: స్పెయిన్ గోల్ కీపర్ గిన్నిస్ ప్రపంచ రికార్డు
ABN , Publish Date - Jul 03 , 2026 | 11:27 AM
స్పెయిన్ గోల్ కీపర్ ఉనై సైమన్ 36 ఏళ్లనాటి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్‌లో స్పెయిన్ రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. రౌండ్ ఆఫ్ 32లో ఆస్ట్రియాపై 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో స్పెయిన్ గోల్ కీపర్ ఉనై సైమన్ 36 ఏళ్లనాటి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు.
ప్రపంచ కప్‌లో 519 నిమిషాల పాటు ప్రత్యర్థులను ఒక్క గోల్ కూడా చేయనీయకుండా స్పెయిన్ గోల్ కీపర్ ఉనై సైమన్ రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు ఇటలీ ప్లేయర్ వాల్టెర్ జెంగా పేరిట ఉండేది. 1990 ప్రపంచ కప్‌లో అతడు 518 నిమిషాల పాటు ప్రత్యర్థులను గోల్ చేయనివ్వలేదు. మూడు దశాబ్దాలుగా చెక్కు చెదరకుండా ఉన్న ఈ రికార్డును సైమన్.. ఆస్ట్రియాపై మ్యాచ్‌లో బద్దలు కొట్టాడు. 2022 ఖతార్ ప్రపంచ కప్ నుంచి ఈ స్పెయిన్ గోల్ కీపర్ అద్భుత ఆటతీరు ప్రదర్శిస్తూ వస్తున్నాడు. గత ప్రపంచ కప్ లీగ్ స్టేజ్ మ్యాచ్‌లో జపాన్ 51వ నిమిషంలో గోల్ చేసింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు స్పెయిన్ తన ప్రత్యర్థికి ఒక్క గోల్ కూడా ఇవ్వలేదు. ఈసారి జరిగిన లీగ్ మ్యాచుల్లోనూ సైమన్ ఒక్క గోల్ కూడా ఇవ్వలేదు.
ఈ వార్తలనూ చదవండి:
వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమా.. జట్టు కూర్పు ఇలా ఉంటుందా..
మెస్సీకి ఒక న్యాయం.. బలోగన్‌కు మరో న్యాయమా.. అభిమానుల ఆగ్రహం..