కోడిగుడ్డు అ‘ధర’హో!
ABN , Publish Date - Jul 03 , 2026 | 10:36 AM
కోడిగుడ్ల ధరకు రెక్కలు వచ్చాయి. గతంలో రూ.5నుంచి రూ.6వరకు పలికే గుడ్డు నేడు రూ.7నుంచి 8 వరకు పలుకుతోంది.
రిటైల్‌లో రూ.7 నుంచి రూ.8, హోల్‌సేల్‌లో రూ.6. 83 పైసలు
రోజురోజుకూ పెరుగుతున్న రేట్లు
హనుమకొండ: కోడిగుడ్ల ధరకు రెక్కలు వచ్చాయి. గతంలో రూ.5నుంచి రూ.6వరకు పలికే గుడ్డు నేడు రూ.7నుంచి 8 వరకు పలుకుతోంది. 30గుడ్లతో కూడిన ట్రే హోల్‌సెల్‌లో రూ.205లకు విక్రయిస్తున్నారు. విపరీతమైన ఎండల కారణంగా కోళ్లు సరిగ్గా మేత తినక, గుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో పౌల్ర్టీ ఫాం నిర్వాహకులు గుడ్లధరలు పెంచేశారు. దీనికి తోడు అధిక ఉష్ణోగ్రతల వల్ల పెద్ద మొత్తంలో కోళ్లు మృత్యువాత పడ్డాయి.
ఫలితంగా చికెన్, కోడిగుడ్ల ధరలు ఆకాశాన్ని అంటడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నిత్యం వ్యాయామం చేసే వారు, జిమ్‌లకు వేళ్లే యువత, ప్రభుత్వ పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్ల వినియోగం అధికంగా ఉంటుంది. దీనికి తోడు కేక్‌ల తయారీలో గుడ్లను వినియోగించడంతో పాటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఓవైపు కూరగాయల ధరలు మండిపోతుండగా ఇపుడు కోడిగుడ్ల ధరలు సైతం కొండెక్కడంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మునుపెన్నడూ ఇంత రేట్లు లేవు..
ఈసారి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కోళ్లు పెద్ద మొత్తంలో చనిపోయి గుడ్ల రాబడి తగ్గింది. దీంతో వాటి ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. గత 25ఏళ్లుగా హనుమకొండ టైలర్‌స్ర్టీట్‌లో కోడి గుడ్ల వ్యాపారం చేస్తున్నాను. మునుపెన్నడూ ఇంత రేట్లను చూడలేదు. రెండేళ్ల క్రితం ఇదే తరహాలో కొన్ని రోజలు పాటు గుడ్ల ధరలు పెరిగాయి.
దుంపేట నటరాజ్, హనుమకొండ
కొనుగోలు చేయలేకపోతున్నాం..
కూరగాయల ధరలు పెరిగితే ప్రత్యామ్నాయంగా గుడ్లను కొనుగోలు చేసి వండుకునేవాళ్లం. కానీ ఇప్పుడు గుడ్డు ధర కూడా ఆకాశాన్ని తాకడంతో ఏం కొనాలో, ఏం తినాలో అర్థం కావడం లేదు. గతంలో గుడ్డు రేటు రూ. 5కు లభించినప్పడు కేసు (30)గుడ్లు ఒకేసారి కొనుగోలు చేసేది. కానీ నేడు పెరిగిన ధరల కారణంగా పెద్ద మొత్తంలో కోనుగోలు చేయలేకపోతున్నాం.
బుజుగుండ్ల శ్రీనివాస్, రెడ్డికాలనీ
ఈ వార్తలు కూడా చదవండి:
చర్లపల్లి-షాలిమార్ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లు
సవాలు చేసుడే కాదు.. కట్టుబడాలి
Read Latest AP News And Telangana News And International News And Telugu News