సవాలు చేసుడే కాదు.. కట్టుబడాలి
ABN , Publish Date - Jul 03 , 2026 | 05:59 AM
‘సవాలు చేస్తే కట్టుబడండి. తెలంగాణ భవన్‌కు వస్తానని సవాలు విసిరి ఎందుకెళ్లలేదు? అక్కడికి వెళ్లకుండా సీఎల్పీలోనే ఎందుకున్నారు?’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక మంత్రిని ప్రశ్నించినట్టు సమాచారం.
తెలంగాణ భవన్‌కు వెళ్తానని అంటే.. వెళ్లాల్సింది
గన్‌పార్క వద్ద బీఆర్‌ఎస్ నేతలు వచ్చేదాకా వేచి ఉండాల్సింది
బీఆర్‌ఎస్‌ను ఇరకాటంలో పెట్టే అవకాశం వదులుకున్నారు
ప్రతిపక్షం వద్ద అంశాలే లేవు
కొత్త సమస్యలు సృష్టించొద్దు
మూసీ తొలిదశ పూర్తి చేశాకే ఎన్నికలకు: మంత్రులతో సీఎం
హైదరాబాద్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ‘సవాలు చేస్తే కట్టుబడండి. తెలంగాణ భవన్‌కు వస్తానని సవాలు విసిరి ఎందుకెళ్లలేదు? అక్కడికి వెళ్లకుండా సీఎల్పీలోనే ఎందుకున్నారు?’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక మంత్రిని ప్రశ్నించినట్టు సమాచారం. ‘‘మనం బహిరంగ చర్చలేవైనా ప్రెస్ క్లబ్ వేదికగా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. కానీ కొందరు మంత్రులు గన్‌పార్క్‌కు వెళ్లారు. అక్కడ రెండు గంటల పాటు ఉన్నా.. ఆ తర్వాత వెళ్లిపోయారు. బీఆర్‌ఎస్ నేతలు వచ్చేదాకా వేచి ఉండాల్సింది. బహిరంగంగా చర్చించి, వాస్తవాలు చెప్పి... ప్రతిపక్షాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేసే అవకాశాన్ని వదులుకున్నారు. అసలు ప్రతిపక్ష పార్టీల వద్ద లేవనెత్తేందుకు, చర్చించేందుకు సరైన అంశాలే లేవు. వాళ్లకు మీరే పని కల్పించొద్దు’’ అని చురకలంటించినట్టు తెలిసింది. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ, దానికన్నా ముందు జరిగిన తేనేటి విందు సందర్భంగా ఈ చర్చ జరిగినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. గురుకులాల టెండర్ల వ్యవహారంలో అవినీతి జరగనప్పటికీ.. జరిగినట్లుగా బీఆర్‌ఎస్ చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టే అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయారని సీఎం వ్యాఖ్యానించినట్టు ఆ వర్గాలు తెలిపాయి. ‘‘రాష్ట్రంలో అధికారంలోకి రాగానే 60 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం. విద్య, వైద్యరంగాల్లో పలు సంస్కరణలు తెచ్చాం. పేద వర్గాలందరూ తినేలా సన్న బియ్యం ఇస్తున్నాం.
రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేశాం. రుణమాఫీ చేశాం. గృహజ్యోతి, ఉచిత బస్సు వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఆర్థికంగా ప్రతికూలతలు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, ప్రజల్లోకి వెళ్లడానికి ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేశాం. అసలు ఆడేందుకు మైదానమే లేకుండా కట్టడి చేశాం. ఇటువంటి సమయంలో కొత్త సవాళ్లు విసరడం ద్వారా సమస్యలు సృషించొద్దు’’ అని సీఎం సూచించినట్టు సమాచారం. అలాగే.. మూసీ పునరుజ్జీవన పథకం తొలి దశ 2027 డిసెంబరుకల్లా పూర్తిచేసి, ఆ తర్వాతే శాసనసభ ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. దీనికోసం మంత్రులంతా తమ వంతు పాత్రను పోషించాలని సూచించారు. రానున్న ఎన్నికల నినాదంలో మూసీ తొలిదశ పూర్తి కూడా ప్రచారవ్యూహంగా ఉండాలని గుర్తు చేశారు. కాగా.. క్యాబినెట్ భేటీకి ఒక మహిళా మంత్రి గైర్హాజరయ్యారు. కాలు బెణకడం వల్లే హాజరుకాలేదని ఆమె ప్రకటించినప్పటికీ.. ఇటీవలే ప్రకటించిన యాదాద్రి ఆలయ పాలకమండలి విషయంలో ఆమె నారాజ్‌గా ఉన్నారని సమాచారం. పాలకమండలి ప్రకటించేముందు కనీస సమాచారం తనకు ఇవ్వలేదంటూ ఆమె తన సన్నిహితుల వద్ద వాపోయారని తెలుస్తోంది. పాలకమండలి నిర్ణయం సీఎం స్థాయి వ్యవహారమేనని.. అయితే గౌరవప్రదంగా ఒక మాటగా సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేదని ఆమె సన్నిహితుల వద్ద అన్నట్లు తెలిసింది.