కేతన్ అగర్వాల్ హత్య కేసు.. సియా గోయల్ పాత వీడియో వైరల్..
ABN , Publish Date - Jul 03 , 2026 | 09:09 AM
వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్‌కు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
మహారాష్ట్ర: వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్ పాత వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఓ నైట్‌క్లబ్‌లో ఆమె బీర్ బాటిల్ పట్టుకుని ఫోన్‌లో మాట్లాడుతున్న దృశ్యాలు సంచలనం సృష్టిస్తున్నాయి. సియా ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ ఆగ్రహిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. సుమారు 15 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఆమె ఫోన్ ఎత్తి 'ఎవరు మీరు?' అని అడిగినట్లు వినిపిస్తోంది. నైట్‌క్లబ్‌లో పెద్దపెద్ద శబ్దాలు ఉండటంతో ఒక చెవిని చేతితో మూసుకుని, అవతలి వ్యక్తి మాటలు వినేందుకు ఆమె ప్రయత్నించినట్లు కనిపిస్తోంది.
అనంతరం సియా మాట్లాడుతూ 'ముందు నన్ను మోసం చేస్తాడు.. ఆ తర్వాత నాకే ఫోన్ చేస్తాడు' అంటూ అభ్యంతరకర పదజాలం ఉపయోగించినట్లు వీడియోలో వినిపిస్తోంది. ఈ వీడియో 2025 డిసెంబర్‌లో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఇది కాస్తా పోలీసుల దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సియా ఎవరితో మాట్లాడుతోంది? ఆమె ప్రస్తావించిన వ్యక్తి ఎవరు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టే అవకాశముందని తెలుస్తోంది. కాగా, తాజా వైరల్ వీడియోతో దర్యాప్తు మరింత కీలక దశకు చేరే అవకాశముందని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఇటీవల సియా పోలీసు కస్టడీలో ఉండగా బీర్ కావాలని కోరిందని, ఆమెకు మద్యం అలవాటు ఉందని కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి. అయితే, ఈ ఆరోపణలను సియా తల్లి పూజా గోయల్ తీవ్రంగా ఖండించారు.
మరోవైపు, కేసు దర్యాప్తులో భాగంగా పాలీగ్రాఫ్ (లై డిటెక్టర్) పరీక్షకు నిందితురాలు సియా అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు లేకపోవడం, ఇద్దరు నిందితులు పరస్పరం ఒకరిపై మరొకరు నెపం నెట్టుకుంటున్న నేపథ్యంలో ఈ పరీక్ష నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. దీంతో నిజానిజాలు వెలికి తీసే అవకాశముందని చెబుతున్నారు. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లోనూ విచారణ కొనసాగుతోంది.
కాగా, జూన్ 18న సియా గోయల్ తన కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి పుణెలోని లోహగడ్ కోట వద్ద కొండ పైనుంచి తోసేసినట్లు అనుమానిస్తున్నారు. సియా, కేతన్‌లకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరగగా, నవంబర్‌లో వివాహం జరగాల్సి ఉంది. అయితే, పెళ్లి ఇష్టం లేకపోవడంతోనే సియా ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
విజయ్ ప్రభుత్వం కూల్చివేత కుట్ర కేసులో మరో నలుగురి అరెస్టు
ప్రజలు ప్రభుత్వానికి బానిసలు కారు