వంటింటి దినుసులతో షుగర్‌కు చెక్!
ABN , Publish Date - Jul 03 , 2026 | 07:13 AM
మనం నిత్యం వాడే పోపుల పెట్టెలోని దినుసులతో మధుమేహానికి చెక్ పెట్టే దిశగా.. హైదరాబాద్ తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) శాస్త్రజ్ఞులు ప్రయోగాలు చేస్తున్నారు....
అల్లం, దాల్చినచెక్క, నల్లమిరియాలు, ఉసిరి, పసుపుతో.. పాలీ హెర్బల్ ఎక్స్‌ట్రాక్ట్.. ఎలుకలపై ప్రయోగాలు సక్సెస్
దీర్ఘకాలంగా మధుమేహంతో బాధపడే వారి కంటి, నరాల సమస్యలను నియంత్రించవచ్చని ఆశాభావం
రెండేళ్లలో మార్కెట్‌లోఅందుబాటులోకి వచ్చే అవకాశం
హైదరాబాద్ సిటీ, జూలై 2(ఆంధ్రజ్యోతి): మనం నిత్యం వాడే పోపుల పెట్టెలోని దినుసులతో మధుమేహానికి చెక్ పెట్టే దిశగా.. హైదరాబాద్ తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) శాస్త్రజ్ఞులు ప్రయోగాలు చేస్తున్నారు. అల్లం, దాల్చిన చెక్క, నల్లమిరియాలు, ఉసిరి, పసుపుతో వారు తయారు చేసిన హెర్బల్ ఎక్స్‌ట్రాక్ట్.. ఎలుకలపై ప్రయోగాల్లో సత్ఫలితాలను ఇచ్చింది. దీర్ఘకాలంగా డయాబెటి్‌సతో బాధపడేవారిలో.. మూత్రపిండాల వ్యాధులు (నెఫ్రోపతి), నరాలు దెబ్బతినడం(న్యూరోపతి), కంటిచూపు మందగించడం లేదా కొన్నిసార్లు పూర్తిగా కోల్పోవడం(రెటినోపతి), కంటి శుక్లాల వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తడం చూస్తుంటాం. మధుమేహ బాధితుల పాలిట ముప్పుగా పరిణమించే ఈ ఆరోగ్య సమస్యలను ఈ హెర్బల్ ఎక్స్‌ట్రాక్ట్‌తో నియంత్రించవచ్చని.. ఊబకాయంతో వచ్చే ఆరోగ్య సమస్యలను అదుపు చేసేందుకే ఇది పనికొస్తుందని ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్త డా. జి. భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఈ ఎక్స్‌ట్రాక్ట్‌ను అభివృద్ధి చేయ డానికి 15 ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నట్టు ఆయన వెల్లడించారు.
ఎలా పనిచేస్తుందంటే..
రక్తంలో అధికంగా పోగుపడిన గ్లూకోజ్‌ను.. అల్డోస్ రిడక్టేజ్ అనే ఎంజైమ్ సార్బిటాల్‌గా మారుస్తుంది. కణాలలో పేరుకుపోయిన సార్బిటాల్ ఆక్సిడేటివ్ ఒత్తిడిని కలిగించడం వల్ల నరాలు దెబ్బతినడం, మూత్రపిండాల వ్యాధులు, చూపు మందగించడం, శుక్లాల వంటి సమస్యలు వస్తాయి. ఎన్‌ఐఎన్ శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేసిన హెర్బల్ ఎక్స్‌ట్రాక్టుకు ఆ ఎంజైమ్‌ను నిరోధించే సామర్థ్యం ఉన్నట్లు పరిశోధనలో తేలింది. అంతేకాదు, ఊబకాయంతో బాధపడేవారిలో కొన్నిరకాల ప్రొటీన్లు మారడం వల్ల తలెత్తే సమస్యలను సైతం ఈ హెర్బల్ ఔషధం నియంత్రిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అధికబరువున్న ఎలుకలపై ఈ హెర్బల్ ఔషధాన్ని ప్రయోగించగా సత్ఫలితాలు వచ్చాయని వారు తెలిపారు. ముఖ్యంగా రెటినోపతి, నెఫ్రోపతి సమస్యలు తగ్గుముఖం పట్టినట్లు గుర్తించామని భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఇక.. మనుషులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉందని చెప్పారు. ఇప్పటికే దీనిపై 30కి పైగా పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమైనట్లు సమాచారం. అంతా సజావుగా సాగితే మరొక రెండు సంవత్సరాల్లో ఈ హెర్బల్ ఔషథం మార్కెట్లోకి వస్తుంది అని పరిశోధకులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు
కోళ్లు అరుస్తున్నాయని వెళ్లి చూస్తే.. మృత్యువు వెంటాడింది