మెరిసిన చపాట మిర్చి
ABN , Publish Date - Feb 28 , 2026 | 10:10 AM
వరంగల్ (ఏనుమాముల) వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం చపాట(దేశీ) మిర్చి ధరలు మెరిశాయి. నాలుగు సంవత్సరాల తరువాత దేశీ మిర్చి ధరలు పుంజుకుంటున్నాయి.
వరంగల్ మార్కెట్‌లో క్వింటాకు రూ.50 వేలు
కేసముద్రంలో రూ.18,789 పలికిన తేజ రకం
నాలుగేళ్ల తర్వాత పుంజుకుంటున్న ధరలు
వరంగల్: వరంగల్ (ఏనుమాముల) వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం చపాట(దేశీ) మిర్చి ధరలు మెరిశాయి. నాలుగు సంవత్సరాల తరువాత దేశీ మిర్చి ధరలు పుంజుకుంటున్నాయి. 2021-22లో మిర్చి ధరలు, ముఖ్యంగా దేశీ మిర్చి ధర క్వింటాకు లక్ష రూపాయల వరకు పలికింది. ఆ తరువాత గడిచిన నాలుగేళ్లుగా రూ.30వేల నుంచి రూ.40వేలు.. తేజ, వండర్‌హాట్, యూఎస్ 341 లాంటి రకాలకు రూ.12వేల నుంచి రూ.16వేలు పలికాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. అనేక మంది రైతులు మిర్చి బస్తాలను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నారు.
ప్రస్తుత సీజన్‌లో కొంత కాలంగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. శుక్రవారం వరంగల్ వ్యవసాయ మార్కెట్లో దేశీ మిర్చి క్వింటాకు రూ.50 వేలు పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పుల్లూరుపల్లి గ్రామానికి చెందిన ఎ.రవీందర్‌రావు అనే రైతు 9 బస్తాల దేశీమిర్చిని అంబికా అండ్ కంపెనీ అడ్తికి తీసుకురాగా శాంతి ఇండస్ర్టీస్ నిర్వాహకులు క్వింటాకు రూ.50 వేల చొప్పున కొనుగోలు చేశారు. జియోట్యాగింగ్ కలిగిన దేశీ మిర్చికి విదేశాలలో మంచి డిమాండ్ ఉండడంతో ఎగుమతులు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. కాగా, వరంగల్ వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం మిర్చి ధరలు గరిష్టంగా క్వింటాకు ఈ విధంగా ఉన్నాయి. తేజ - రూ.18,700, వండర్‌హాట్ - రూ.36వేలు, దీపిక రూ.30 వేలు, యూఎస్ 341 - రూ.22.100, ఎల్లో మిర్చి (తేజ) రూ.23 వేలు, తాలు మిర్చి రూ.12వేలు ధర పలికాయి.
కేసముద్రంలో గరిష్ఠంగా రూ.18,789
కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం 45 మంది రైతులు 495 బస్తాల్లో తేజరకం మిర్చి విక్రయానికి తీసుకువచ్చారు. ఎలకా్ట్రనిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్(ఈ-నామ్) విధానంలోని ఈ-వేలంలో వ్యాపారులు క్వింటాకు గరిష్టంగా రూ.18,789, కనిష్టంగా రూ.17,521, సగటున రూ.18,489 ధరల చొప్పున ఖరీదులు చేశారు. మార్కెట్‌లో ఈ నెల మొదటివారంలో మిర్చి సీజన్ ప్రారంభం కాగా, తొలుత క్వింటాకు రూ.16,300 నుంచి రూ.16,800 వరకే సగటు ధరలు ఉన్నాయి. మార్కెట్‌కు వరుస సెలవుల అనంతరం ఈనెల 18న సగటు ధర రూ.17,011ఉండగా క్రమంగా పెరుగుతూ తాజాగా రూ.18,489కి చేరింది. ఖమ్మం, వరంగల్ మార్కెట్ల రాబడులు, కోల్డ్ స్టోరేజీల్లో ఉన్న నిల్వలు, ఇతర దేశాల ఎగుమతుల అంశాలన్నీ ఇక్కడి మిర్చి ధరలను ప్రభావితం చేస్తున్నట్లు వ్యాపారులు విశ్లేషిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
‘రైతు భరోసా’పై మోసగించిన కాంగ్రెస్
Read Latest Telangana News and National News