టీ20 ప్రపంచకప్ 2026: పాక్ కోసం పోరాడిన ఇంగ్లండ్!
ABN , Publish Date - Feb 28 , 2026 | 08:48 AM
టీ20 వరల్డ్ కప్ 2026లో సెమీస్‌కు చేరే విషయంలో కొన ఊపిరితో ఉన్న పాకిస్థాన్ జట్టుకు ఇంగ్లండ్ ప్రాణం పోసింది. శుక్రవారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన కీలక పోరులో ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించడంతో పాక్ అనూహ్యంగా సెమీ ఫైనల్ రేసులోకి వచ్చింది.
స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2026)లో సెమీస్‌కు చేరే విషయంలో కొన ఊపిరితో ఉన్న పాకిస్థాన్ జట్టుకు ఇంగ్లండ్ ప్రాణం పోసింది. శుక్రవారం (ఫిబ్రవరి 27) కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన కీలక పోరులో ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించడంతో పాక్ అనూహ్యంగా సెమీ ఫైనల్ రేసులోకి వచ్చింది. కివీస్‌ను ఓడించేందుకు ఇంగ్లండ్ చివరి వరకు పోరాడి సక్సెస్ అయింది. పాకిస్థాన్ కోసం ఇంగ్లీష్ జట్టు పోరాడిందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంగ్లండ్ ఓడి ఉంటే.. పాకిస్థాన్ ఇంటికి వెళ్లేది. మొత్తంగా హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు సూపర్-8లో వరుసగా మూడు విజయాలతో 6 పాయింట్లు సాధించి గ్రూప్-2 టాపర్‌గా సెమీస్‌కు దూసుకెళ్లింది. నిన్నటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలుపుతో ఇప్పుడు రెండో సెమీస్ బెర్త్ కోసం కివీస్, పాక్ మధ్య నెట్ రన్‌రేట్ వార్ మొదలైంది.
ప్రస్తుతం గ్రూప్-2 పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్(New Zeland) మూడు మ్యాచ్‌లు ఆడి 3 పాయింట్లు, నెట్ రన్‌రేట్ +1.390తో రెండో స్థానంలో ఉంది. మరోవైపు పాకిస్థాన్ రెండు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒకే ఒక్క పాయింట్, నెట్ రన్‌రేట్ -0.461తో మూడో స్థానంలో ఉంది. అయితే, గ్రూప్-2 కివీస్ తన మ్యాచ్‌లన్ని పూర్తి చేసుకోగా.. పాకిస్థాన్‌కు ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ప్రస్తుతం ఇదే ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఇవాళ(శనివారం) పల్లెకెలె వేదికగా శ్రీలంకతో పాక్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో లంకపై పాక్ గెలిస్తే.. వారి పాయింట్లు కూడా 3కి చేరుతాయి. అప్పుడు నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉన్న జట్టు సెమీస్‌కు చేరుతుంది. ఒకవేళ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే మాత్రం పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
పాకిస్థాన్ సెమీస్‌కు వెళ్లాలంటే శ్రీలంకపై కేవలం గెలిస్తే సరిపోదు, ఒక భారీ విజయం నమోదు చేయాలి. పాక్(Pakistan) మొదట బ్యాటింగ్ చేస్తే శ్రీలంకపై కనీసం 64 పరుగుల భారీ తేడాతో విజయం సాధించాలి. ఒకవేళ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తే, శ్రీలంక విధించిన లక్ష్యాన్ని కేవలం 13 .1 ఓవర్లలోనే ఛేదించాలి. ఈ సమీకరణం పూర్తయితేనే పాకిస్థాన్ రన్‌రేట్ న్యూజిలాండ్ కంటే మెరుగవుతుంది. శనివారం పల్లెకెలెలో వాతావరణం కూడా పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉంది. వర్షం పడే సూచనలు ఏమాత్రం లేవని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశం మేఘావృతమై ఉన్నా, పూర్తి మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. లంకతో జరిగే మ్యాచ్‌లో పాక్ భారీ తేడాతో గెలవలేకపోతే మాత్రం న్యూజిలాండ్ నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది. మొత్తంగా పాకిస్థాన్‌కు ఇంగ్లండ్(England) ఊపిరి పోస్తే.. దాన్ని నిలబెట్టుకునే బాధ్యత సల్మాన్ అఘా సేన చేతుల్లోనే ఉంది.
ఇవి కూడా చదవండి:
టీ20 డబ్ల్యూసీ: అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిన రింకు సింగ్