Share News

కివీస్‌..చేజేతులా

ABN , Publish Date - Feb 28 , 2026 | 02:47 AM

సెమీస్‌ బెర్త్‌ దక్కాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఆఖర్లో తడబడింది. క్లిష్టతరమైన పిచ్‌పై సవాల్‌ విసిరే స్కోరు సాధించడమే కాకుండా.. బౌలర్లు కూడా విశేషంగా రాణించి చివరి వరకు తమదే విజయం..

కివీస్‌..చేజేతులా

4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ విజయం

విల్‌ జాక్స్‌ ఆల్‌రౌండ్‌షో

పాక్‌ ఆశలు సజీవంఫ టీ20 వరల్డ్‌కప్‌

కొలంబో: సెమీస్‌ బెర్త్‌ దక్కాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఆఖర్లో తడబడింది. క్లిష్టతరమైన పిచ్‌పై సవాల్‌ విసిరే స్కోరు సాధించడమే కాకుండా.. బౌలర్లు కూడా విశేషంగా రాణించి చివరి వరకు తమదే విజయం అనే స్థితికి తెచ్చారు. కానీ 18వ ఓవర్‌లో 22 పరుగులు సమర్పించుకోవడంతో కివీస్‌ భారీ మూల్యమే చెల్లించుకుంది. దీంతో శుక్రవారం జరిగిన ఈ సూపర్‌-8 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 4 వికెట్ల తేడాతో నెగ్గింది. విల్‌ జాక్స్‌ ఆల్‌రౌండ్‌ షోతో (2/23; 18 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 32 నాటౌట్‌) అదరగొట్టాడు. అలాగే ఇంగ్లండ్‌ హ్యాట్రిక్‌ విజయాలతో గ్రూప్‌ 2లో టాప్‌నకు చేరింది. ఇక కివీస్‌ సెమీస్‌ అవకాశాలు పాక్‌ ప్రదర్శనపై ఆధారపడి ఉన్నాయి. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఫిలిప్స్‌ (39), సైఫర్ట్‌ (35), ఆలెన్‌ (29) సత్తాచాటారు. స్పిన్నర్లు జాక్స్‌, రషీద్‌, రెహాన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఇంగ్లండ్‌ 19.3 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసి గెలిచింది. బాంటన్‌ (33), బ్రూక్‌ (26), కర్రాన్‌ (24) రాణించారు. రచిన్‌కు మూడు వికెట్లు లభించాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా జాక్స్‌ నిలిచాడు.

చివర్లో జోరు: ఓ మాదిరి ఛేదనలో ఇంగ్లండ్‌ ఆరంభం నుంచే తడబడింది. తొలి రెండు ఓవర్లలోనే సాల్ట్‌ (2), బట్లర్‌ (0) వికెట్లను కోల్పోయింది. తర్వాత కెప్టెన్‌ బ్రూక్‌ నిలదొక్కుకుని ఒత్తిడిని దూరం చేశాడు. ఇక ఓ దశలో 18 బంతుల్లో 43 పరుగులు అవసరమయ్యాయి. కానీ ఫిలిప్స్‌ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో రెహాన్‌ (19 నాటౌట్‌) 6, జాక్స్‌ 6,4,4తో 22 రన్స్‌ రాబట్టి కివీ్‌సకు షాకిచ్చారు. ఇక ఆ తర్వాత మరో 3 బంతులుండగా ఈ జోడీ మ్యాచ్‌ను ముగించింది. చివరి 15 బంతుల్లోనే వీరు 44 పరుగులు రాబట్టడం విశేషం.


స్పిన్నర్ల కట్టడి: టాస్‌ గెలిచిన కివీస్‌ బ్యాటింగ్‌ ఎంచుకోగా, ఓపెనర్లు సైఫర్ట్‌, ఆలెన్‌ ధనాధన్‌ ఆటతీరుతో శుభారంభం అందించారు. కానీ ఆ తర్వాతే కివీస్‌ ఆటలో వేగం తగ్గింది. ఈ క్రమంలో దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్లు కోల్పోవడంతో చివరి ఐదు ఓవర్లలో 34 పరుగులే వచ్చాయి.

అంతకుముందు వరుస ఓవర్లలో సైఫర్ట్‌ను రషీద్‌.. ఆలెన్‌ను జాక్స్‌ పెవిలియన్‌కు చేర్చి ఝలక్‌ ఇచ్చారు. తొలి వికెట్‌కు ఈ జోడీ 64 పరుగులు అందించింది. ఈ దశలో ఫిలిప్స్‌ అండగా నిలిచి ఎదురుదాడికి దిగాడు. దీంతో 14 ఓవర్లలో 123/3 స్కోరుతో కివీస్‌ పటిష్టంగానే కనిపించింది. కానీ అప్పటికే ధాటిగా ఆడుతున్న చాప్‌మన్‌ (15)ను రషీద్‌ అవుట్‌ చేయడంతో కివీస్‌ లయ తప్పింది. స్పిన్నర్లు డాట్‌ బాల్స్‌తో ఒత్తిడి పెంచారు. దీంతో షాట్లు ఆడేందుకు వెళ్లిన ఫిలిప్‌, మిచెల్‌ (3), మకాన్‌చీ (14) వేగంగా వెనుదిరిగారు. చివరి ఓవర్‌లో 12 రన్స్‌తో స్కోరు కష్టంగా 150 దాటింది.

సంక్షిప్త స్కోర్లు:

కివీస్‌: 20 ఓవర్లలో 159/7 (ఫిలిప్స్‌ 39, సైఫర్ట్‌ 35, ఆలెన్‌ 29; జాక్స్‌ 2/23, రషీద్‌ 2/28, రెహాన్‌ 2/28)

ఇంగ్లండ్‌: 19.3 ఓవర్లలో 161/6 (బాంటన్‌ 33, జాక్స్‌ 32 నాటౌట్‌, బ్రూక్‌ 26; రచిన్‌ 3/19)

1

టీ20 ఇన్నింగ్స్‌లో ఏకంగా 16 ఓవర్లు స్పిన్నర్లచేతే వేయించడం ఇంగ్లండ్‌కిదే మొదటిసారి. అలాగే టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల్లో స్పిన్నర్లే ఎక్కువ వికెట్లు (7) తీయడం ఈ జట్టుకిది రెండోసారి.

1

ఇంగ్లండ్‌ తరఫున టీ20ల్లో ఎక్కువ డకౌట్లు (10) అయిన బ్యాటర్‌గా బట్లర్‌.

పాయింట్ల పట్టిక

గ్రూప్‌-1

జట్టు మ్యా గె ఓ ర పా ర.రే

దక్షిణాఫ్రికా 2 2 0 0 4 2.890

వెస్టిండీస్‌ 2 1 1 0 2 1.791

భారత్‌ 2 1 1 0 2 -0.100

జింబాబ్వే 2 0 2 0 0 -4.475

గ్రూప్‌-2

జట్టు మ్యా గె ఓ ర పా ర.రే

ఇంగ్లండ్‌ 3 3 0 0 6 1.096

న్యూజిలాండ్‌ 3 1 1 1 3 1.390

పాకిస్థాన్‌ 2 0 1 1 1 -0.461

శ్రీలంక 2 0 2 0 0 -2.800

మ్యా: మ్యాచ్‌లు; గె: గెలుపు; ఓ: ఓటమి;

ర: రద్దు; పా: పాయింట్లు; ర.రే: రన్‌రేట్‌

ఈ వార్తలూ చదవండి

ఏఐ వల్లే 4 వేల మందిని తీసేస్తున్నాము: జాక్ డోర్సీ

కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ

Updated Date - Feb 28 , 2026 | 02:47 AM