Share News

మహిళలకు గుడ్ న్యూస్.. నేటి నుంచే హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ..

ABN , Publish Date - Feb 28 , 2026 | 08:53 AM

దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి అంటే.. శనివారం నుంచి మహిళలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయనున్నారు. 14 ఏళ్ల నుంచి ఆపై వయస్సు ఉన్నవారందరికీ ఉచితంగా ఈ వ్యాక్సిన్ వేయనున్నారు.

మహిళలకు గుడ్ న్యూస్.. నేటి నుంచే హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ..
HPV Vaccine

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనారోగ్యం బారిన పడుతూనే ఉంటారు. చిన్నచిన్న అనారోగ్య సమస్యలు అయితే ఇంటికి సమీపంలోని వైద్యుడికి చూపించుకుంటాం. ఆ వెంటనే ఆరోగ్యం కుదుటపడుతుంది. కానీ ప్రస్తుతం దేశంలో అత్యధిక శాతం మంది వివిధ ప్రమాదకర క్యాన్సర్ల బారిన పడుతున్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా చాలా మందిని వేధిస్తోంది క్యాన్సర్. మరీ ముఖ్యంగా మహిళలు గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్‌ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యతో చాలా మంది మహిళలు మృత్యుఒడికి చేరుతున్నారు.


అలాంటి వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడుకుండా ఉండేందుకు దేశంలోని మహిళలందరికీ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. 14 ఏళ్ల వయస్సు కలిగిన బాలికల నుంచి ఆపై వయస్సు ఉన్న మహిళలందరికీ ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. అది కూడా ఉచితంగా.. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ టీకాలు వేయనున్నారు. ఈ రోజు నుంచి అంటే.. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా మహిళలందరికీ ఈ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు.


అసలు ఈ వ్యాక్సిన్ ఎందుకు వేసుకోవాలి.. కలిగే లాభాలు.

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ప్రధానంగా హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) అనే వైరస్ వల్ల వస్తుంది. ఇది సాధారణంగా లైంగిక సంబంధాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ వైరస్ శరీరంలోకి చేరిన తర్వాత.. అది గర్భాశయ కణాలను క్యాన్సర్ కణాలుగా మార్చే ప్రమాదకర అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రమాదాన్ని అడ్డుకోవడానికి హెచ్‌పీవీ టీకాను ఇస్తారు. ఈ టీకాను 9 నుంచి 14 ఏళ్ల మధ్య ఉండే బాలికలకు ఇవ్వడం చాలా ఉత్తమమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వయస్సులో టీకా తీసుకోవడం వల్ల పిల్లలు ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే 14 ఏళ్ల వయస్సు వచ్చిన వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఆ క్యాన్సర్ సోకే ముప్పు దాదాపుగా తగ్గిపోతుందని కేంద్రం భావిస్తోంది. చిన్న వయస్సులోనే ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ప్రభావంతంగా పని చేస్తుందంటున్నారు. అదీకాక టీకా వారి శరీరంలో బలమైన రోగనిరోధక శక్తిని పెంచుతుందని పేర్కొంటున్నారు.


రెండు సార్లుగా ఈ వ్యాక్సిన్‌..

మొదటి డోస్ తీసుకున్న ఆరు నెలల తర్వాత రెండో డోస్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకూ ఈ వ్యాక్సిన్‌ను ప్రైవేట్ ఆసుపత్రుల్లో మహిళలకు ఇచ్చి.. వేలాది రూపాయిలు వసూల్ చేసేవారు. కానీ ఇకపై ఈ వ్యాక్సిన్‌ను ప్రభుత్వం ఉచితంగా మహిళలకు అందజేయనుంది. ఈ టీకా పూర్తి సురక్షితమని, ఎన్నో ఏళ్ల పరిశోధనల తర్వాతే దీనిని అందుబాటులోకి ప్రభుత్వం తెచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి..

విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి

కంటి నొప్పి మెదడు సమస్యకు సంకేతమా?

For More Health News And Telugu News

Updated Date - Feb 28 , 2026 | 10:22 AM