Share News

కవిత విషయంలో తప్పు చేశామా?

ABN , Publish Date - Feb 28 , 2026 | 04:08 AM

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో..

కవిత విషయంలో తప్పు చేశామా?

  • సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పుతో బీఆర్‌ఎస్‌లో చర్చ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27, (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో.. బీఆర్‌ఎ్‌సలో అంతర్మథనం మొదలైనట్లు తెలుస్తోంది. కవిత విషయంలో తప్పు చేశామా? అన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఆమెపై మద్యం కుంభకోణం కేసు పెట్టినప్పుడు బీఆర్‌ఎస్‌ తొలుత సానుకూలంగానే ఉన్నా.. ఆమె జైలు నుంచి విడుదలయ్యాక పార్టీలో ప్రాధాన్యం తగ్గించారు. బీఆర్‌ఎస్‌ నుంచి కవిత బయటకు వచ్చాక.. ఆ పార్టీ నేతలు కొందరు ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఏకంగా, ‘‘అడ్డంగా బుక్కయి.. జైలుకెళ్లిన లిక్కర్‌ రాణి’’ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఆమె బీఆర్‌ఎస్‌ను ముంచిందని, ఆమెకు సభ్యత, సంస్కారం లేవని అన్నారు. మరోవైపు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ‘‘నువ్వు జైలుకెందుకెళ్లావ్‌? తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు నీ అవినీతి బాగోతం నాకు తెలుసు. నీ కుక్క పేరు కూడా విస్కీ అని పెట్టుకున్నావు. ఢిల్లీలో కేజ్రీవాల్‌ను నాశనం చేశావు.. ఇప్పుడు కేసీఆర్‌, కేటీఆర్‌ను, బీఆర్‌ఎ్‌సను నాశనం చేయాలని చూస్తున్నావు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎ్‌సకు చెందిన మరికొందరు ఇతర నేతలు కూడా ఆమెను మద్యం కేసు విషయంలో విమర్శించారు. అయితే.. ఇప్పుడు ఆమెకు అదే కేసులో క్లీన్‌చిట్‌ రావడం బీఆర్‌ఎ్‌సకు మింగుడుపడని విధంగా మారిందని ఆ పార్టీలోని కొందరు నేతలే అంటున్నారు. కేసీఆర్‌ కుటుంబానికి చెందిన ఆడబిడ్డ, పార్టీలో ఒకప్పుడు కీలకంగా ఉన్న నాయకురాలిని అంత ఘాటుగా విమర్శించడం, ఇప్పుడు ఆమెకు అనుకూలంగా తీర్పు రావడం పార్టీలోని కొందరిని ఉక్కిరి బిక్కిరి చేసిందంటున్నారు. కవితపై రాజకీయపరమైన విమర్శలు చేసినా, లేదంటే ఆమె చేసిన ఆరోపణలకు సమాధానాలు చెప్పినా ఫర్వాలేదని, కానీ.. మద్యం కుంభకోణంలో ఆమె తప్పు చేశారని, అవినీతికి పాల్పడ్డారంటూ మాట్లాడటమే ఇప్పుడు పార్టీకి ఇబ్బందికరంగా మారిందన్న చర్చ బీఆర్‌ఎస్‌లో నడుస్తోంది. మరోవైపు.. తనపై ఇలాంటి విమర్శలు చేయడం వెనక ఒక పెద్ద నాయకుడు ఉన్నారని అప్పట్లో కవిత ఆరోపించారు. ఆయన తనపై చేస్తున్న కుట్రలు చివరకు ఆయనకే తిరిగి తగులుతాయన్నారు. ఈ నేపథ్యంలో ‘కవితకు కోర్టులో న్యాయం జరిగింది’ అనే కేటీఆర్‌ ట్వీట్‌ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Updated Date - Feb 28 , 2026 | 04:08 AM