Share News

గాదె ఇన్నయ్య తండ్రి మృతి

ABN , Publish Date - Feb 28 , 2026 | 09:35 AM

సామాజిక ఉద్యమకారుడు, మావోయిస్టు పార్టీ మాజీ నేత గాదె ఇన్నయ్య ఇంట వరుసగా విషాదాలు చోటు చేసుకొంటున్నాయి. శనివారం ఉదయం 6.00 గంటలకు ఇన్నయ్య తండ్రి గాదె సోలోమాన్ రెడ్డి కన్నుమూశారు.

గాదె ఇన్నయ్య తండ్రి మృతి
Gade Innaiah

వరంగల్, ఫిబ్రవరి 28: సామాజిక ఉద్యమకారుడు, మావోయిస్టు పార్టీ మాజీ నేత గాదె ఇన్నయ్య ఇంట వరుసగా విషాదాలు చోటు చేసుకొంటున్నాయి. శనివారం ఉదయం 6.00 గంటలకు ఇన్నయ్య తండ్రి గాదె సోలోమాన్ రెడ్డి కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంచానికే పరిమితమైన ఆయన.. ఈ రోజు ఉదయం జనగామ జిల్లా జాఫర్‌గఢ్ మండలం సాగరంలోని గాదె ఇన్నయ్య నివాసంలో మరణించారు. ఈ ఏడాది జనవరి 15వ తేదీన గాదె ఇన్నయ్య తల్లి థెరిసమ్మ మరణించిన విషయం విదితమే. తల్లి మరణం నుంచి ఆయన తేరుకోక మునుపే.. తండ్రి మృతితో గాదె ఇన్నయ్య ఇంట విషాదం నెలకొంది.


UAPA చట్టం కింద గాదె ఇన్నయ్య అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. తండ్రి మరణించడంతో.. గాదె ఇన్నయ్యను సాగరంకు తీసుకు వెళ్లేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజే సోలోమాన్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహిస్తమని ఇన్నయ్య కుటుంబ సభ్యులు వెల్లడించారు.


గతేడాది జరిగిన ఎన్‌‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు పలువురు మరణించారు. వారిలో కొందరి స్వస్థలం ఉమ్మడి వరంగల్ జిల్లా. మావోయిస్ట్ అగ్రనేతల అంత్యక్రియలు సందర్భంగా గాదె ఇన్నయ్య పలు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు గాదె ఇన్నయ్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించారు. జఫర్‌గఢ్ మండలం రేగడి తండా గ్రామ పంచాయతీ పరిధిలో మా ఇల్లు ప్రజాదరణ పేరుతో ఒక ఆశ్రమాన్ని గాదె ఇన్నయ్య నిర్వహిస్తున్నారు. దాదాపు 200 మంది విద్యార్థులు ఆ ఆశ్రమంలో ఉచిత విద్యను పొందుతున్నారు.

Updated Date - Feb 28 , 2026 | 09:41 AM