Share News

అర్హులకు ‘చేయూత’.. కొత్త పింఛన్ల మంజూరుకు సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌

ABN , Publish Date - Nov 17 , 2026 | 11:24 AM

ప్రభుత్వం నూతనంగా చేయూత పింఛన్లు మంజూరు చేసింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది.

అర్హులకు ‘చేయూత’.. కొత్త పింఛన్ల మంజూరుకు సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌
cheyutha pensions

  • జిల్లాలో కొత్తగా 30,232 పింఛన్లు మంజూరు

  • ఈ నెల 19న లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ

  • పథకానికి వచ్చిన మొత్తం

  • దరఖాస్తులు 37,831

  • వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు లబ్ధి

  • 5 కేటగిరీల్లో పింఛన్ల మంజూరు

  • డీబీటీ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి నగదు

రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అర్హులైన లబ్ధిదారులకు చేయూత అందించేందుకు సిద్ధమైంది. జిల్లాలో కొత్తగా 30,232 మందికి పింఛన్లు మంజూరయ్యాయి. ఇప్పటికే మంజూరు పత్రాల పంపిణీ ప్రారంభమైంది. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబరు 19న లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నేరుగా పింఛన్‌ డబ్బును జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పథకం కింద జిల్లాలో వేలాది కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

రంగారెడ్డి: ప్రభుత్వం నూతనంగా చేయూత పింఛన్లు మంజూరు చేసింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబరు 19న లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నేరుగా (డీబీటీ)పింఛన్‌ డబ్బును జమ చేసేందుకు సెర్ప్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఆర్థిక శాఖ ఆమోదంతో ప్రభుత్వం బడ్జెట్‌ను కూడా విడుదల చేసింది. జిల్లాలో మొత్తం 30,232 మందికి కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయి.


వీటిలో వితంతు పింఛన్లు 20,249, దివ్యాంగులు 5,712, కల్లుగీత కార్మికులు 1,505, చేనేత కార్మికులు 123, ఒంటరి మహిళలు 2,643 మందికి పింఛన్లు మంజూరు చేసింది. కొత్త పింఛన్లపై వచ్చిన దరఖాస్తులపై జిల్లాయంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. జిల్లాలో మొత్తం 27 మండలాలు, 6 మున్సిపాలిటీలు, 526గ్రామ పంచాయతీలుండగా, కొంత మేరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉంది. ఈ పథకం కింద జిల్లాలో ప్రస్తుతం 1,90,950మంది లబ్ధిదారులకు నెలవారీగా రూ.43.72కోట్లు అందిస్తుంది. అదనంగా మరో 30,232 మందికి చేయూత పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.


vkb1.jpgజిల్లాలో దరఖాస్తులు..

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరుకు అనుమతినిచ్చింది. జిల్లాలో చేయూ త పింఛన్ల కోసం కొత్తగా 37,831 దరఖాస్తులు అందాయి. వితంతువులు 24,315, ఒంటరి మహిళలు 3,134, దివ్యాంగులు 7,818, చేనేత కార్మికులు 418, గీత కార్మికులు 2,146 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 9 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా సెర్ప్‌ దరఖాస్తులు స్వీకరించింది. తొలుత ఆగస్టు నెలాఖరుతో గడువు ముగియాల్సి ఉండగా, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో లేకపోవడంతో సెప్టెంబరు 15వరకు గడువు పొడిగించింది. సర్టిఫికెట్లు లేకున్నా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. వాటి పరిశీలన సమయంలో ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని సూచించింది. అర్హతలు, ఆదాయ పరిమితులు, కుటుంబ పరిస్థితులు, సంబంధిత కేటగిరీకి చెందిన ఆధారాలను అధికారులు పరిశీలించిన తర్వాత తుది జాబితా సిద్ధం చేశారు.


ఒంటరి మహిళల అర్హతను నిర్థారించేందుకు అవసరమైన పత్రాలు ప్రధాన సమస్యగా మారాయి. వివాహం జరిగి విడిపోయిన మహిళలకు విడాకుల పత్రం లేకుంటే కోర్టు ఉత్తర్వులతో పాటు కనీసం ఏడాది కాలంగా ఒంటరిగా ఉంటున్నట్లు ధ్రువీకరణ అవసరం. వివాహం కాని మహిళలకు కూడా నిర్దేశిత వయసు, స్థానిక నివాస పరిస్థితులకు అనుగుణంగా ధ్రువీకరిస్తారు. ఒంటరి మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో తహసీల్దార్లతోపాటు మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్‌, నగర పాలక సంస్థల కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్ల ద్వారా ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది. గీత, చేనేత, డయాలసిస్‌, ఫైలేరియా, తదితర పింఛన్ల మంజూరుకు సంబంధిత శాఖల నుంచి జారీచేసిన ధ్రువీకరణ పత్రాల ఆధారంగా పింఛన్‌ మంజూరు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మహిళా కాంగ్రెస్‌.. రెండో జాబితా విడుదల

అధిక ధరలకు బియ్యం విక్రయాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 11:29 AM